Nancy Pelosi Taiwan Visit : తైవాన్‌పై చైనా ఆంక్షలు.. పెస్టిసైడ్స్ అవశేషాలు అధికంగా ఉన్నాయంటూ..

ABN , First Publish Date - 2022-08-03T19:19:35+05:30 IST

అమెరికా(America) ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (Nancy Pelosi) తైవాన్‌లో (Taiwan) పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చైనా (China) అన్నంత పనిచేసింది.

Nancy Pelosi Taiwan Visit : తైవాన్‌పై చైనా ఆంక్షలు.. పెస్టిసైడ్స్ అవశేషాలు అధికంగా ఉన్నాయంటూ..

బీజింగ్ : అమెరికా(America) ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (Nancy Pelosi) తైవాన్‌లో (Taiwan) పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చైనా (China) అన్నంత పనిచేసింది. తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులు నిలిపివేస్తున్నట్టు చైనా కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్(China Customs Admnistration) బుధవారం ప్రకటించింది. చైనా నుంచి తైవాన్‌కు ఇసుక రవాణాను కూడా ఆపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. నిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రస్ ఫలాల దిగుమతులను రద్దు చేస్తున్నామని పేర్కొంది. ఈ పండ్లలో పురుగుల మందు(పెస్టిసైడ్స్) అవశేషాలు అధిక మోతాదులో ఉన్నాయని, ప్యాకింగ్‌పై పరీక్షలు చేయగా కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొంది. పదేపదే ఈ తరహా ఆనవాళ్లు గుర్తించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్టు కారణంగా చూపింది. చైనా నుంచి తైవాన్‌కు ఇసుక రవాణాను నిలిపివేతను చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా ప్రత్యేక ప్రకటనలో నిర్ధారించింది.


అయితే ఇంతకుమించి వివరాలు పేర్కొనలేదు. కాగా తైవాన్ లక్ష్యంగా చైనా ఆంక్షలు విధించడం కొత్తమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మార్చి 2021లో తైవాన్ నుంచి పైన్‌యాపిల్ దిగుమతులను నిలిపివేసింది. పెస్టిసైడ్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నప్పటికీ ఇది రాజకీయంగా తీసుకున్న నిర్ణయమే. తైవాన్ అధ్యక్షురాలిగా త్సాయ్ ఇంగ్-వెన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చైనా ఒత్తిళ్లు పెరిగాయి. తైవాన్ చైనాలో అంతర్భాగం కాదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశమని త్సాయ్ ఇంగ్-వెన్ చెబుతుండడమే ఈ ఒత్తిళ్లకు కారణంగా ఉంది. 


కాగా యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనను నిరసిస్తూ చైనా మిలిటరీ కసరత్తు నిర్వహించనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. తైవాన్ ద్వీపం చుట్టూ సంయుక్త కసరత్తు నిర్వహించాలని చైనా భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి.


ఉద్రిక్తతలకు దారితీసిన పెలోసి పర్యటన..

గడచిన పాతికేళ్లలో అమెరికాకు చెందిన అత్యున్నత స్థాయి అధికారి తైవాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి మంగళవారం తైవాన్‌లో అడుగుపెట్టారు. దీంతో... చైనా-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో తీవ్ర పరిణామాలు తప్పవంటూ డ్రాగన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేగాక తైవాన్‌  ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి అమెరికా చర్యలు విఘాతం కలిగిస్తాయని చైనా అధికారిక మీడియా పేర్కొంది. పైలోసి పర్యటన ‘ఒకే చైనా’ విధానానికి వ్యతిరేకమని, ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన 3 ఒప్పందాలకు విరుద్ధమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పెలోసి పర్యటన... చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్య అని పేర్కొంది. ఇందుకు ప్రతిఘటనగా నిర్దిష్ట లక్ష్యాలపై తమ సైన్యం చర్యలు చేపడుతుందని పేర్కొంది. కాగా... నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనపై మంగళవారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు ఆమె తైవాన్‌లో అడుగుపెట్టినట్టు అమెరికా వర్గాలు మంగళవారం రాత్రి ధ్రువీకరించాయి.

Updated Date - 2022-08-03T19:19:35+05:30 IST