సరిహద్దులో ప్రతిష్టంభన : చైనా కొత్త ప్రతిపాదనను కొట్టిపారేసిన భారత్

ABN , First Publish Date - 2020-08-08T01:53:20+05:30 IST

తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనకు ఇప్పట్లో తెరపడేలా లేదు.

సరిహద్దులో ప్రతిష్టంభన : చైనా కొత్త ప్రతిపాదనను కొట్టిపారేసిన భారత్

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనకు ఇప్పట్లో తెరపడేలా లేదు. జిత్తులమారి చైనా సైన్యం ఈ ప్రాంతంలో భారత బలగాలను తగ్గించాలని కోరుతోంది. నిజానికి ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను భారత్ విస్పష్టంగా తిప్పి కొట్టింది. చైనా దళాలు వెనుకకు వెళ్ళకపోతే, తాము కూడా పట్టువీడకుండా అక్కడే ఉంటామని భారత్ దళాలు తెలిపాయి. 


మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇతర విధాలుగా కూడా చైనాపై ఒత్తిడి పెంచుతోంది. చైనా మొబైల్ యాప్‌లపై నిషేధం విధించడంతోపాటు ఆ దేశ సంస్థలు మన దేశ ప్రభుత్వ కాంట్రాక్టులు పొందడానికి అవసరమైన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మరోవైపు చైనా విశ్వవిద్యాలయాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై కూడా దృష్టి సారించింది. 


విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు లడఖ్‌లో 1,597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ 20నాటికి ముందు ఉన్న పరిస్థితిని కల్పిస్తేనే, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని చైనాకు భారత్ స్పష్టం చేసింది. దీనికి చైనా ఏమాత్రం లొంగడం లేదు. 


భారత దేశాన్ని లొంగదీయాలని చైనా గట్టిగా ప్రయత్నిస్తోందని, అయితే తాము కూడా ఎంత కాలమైనా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో సరిహద్దు వివాదం ప్రభావం ద్వైపాక్షిక సంబంధాలపై ఎంత తీవ్రంగా ఉంటుందో చైనా తెలుసుకునేలా చేయడానికి ఇతర చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. 


ఇరు దేశాల మిలిటరీ కమాండర్ల సమావేశంలో చైనా ప్రతిపాదించిన కొత్త సూత్రం ఏమిటంటే, ఏప్రిల్-మే నెలల్లో ఘర్షణ ఏర్పడటానికి ముందు భారత సైన్యానికి ప్రాబల్యంగల సంప్రదాయ ప్రదేశాల నుంచి వెనుకకు వెళ్ళిపోవాలని భారత సైన్యాన్ని చైనా సైన్యం కోరుతోంది. 


గోగ్రా సమీపంలో కుగ్రంగ్ నది ఒడ్డునగల మొదటి అంచులో కొత్తగా చైనా బలగాలు వచ్చి చేరాయి. ఈ ప్రాంతం నుంచి భారత బలగాలు పూర్తిగా తగ్గిపోవాలని చైనా సైన్యం కోరుతోంది. అదే విధంగా పాంగాంగ్ ట్సో వద్ద ఫింగర్ 4 ఎత్తయిన ప్రదేశంలో చైనా బలగాలు తిష్ఠ వేశాయి. ఫింగర్ 3 పరిసరాల్లో ధన్ సింగ్ థాపా వద్ద పాత స్థావరం వద్దనున్న భారతీయ దళాలను ఉపసంహరించాలని చెప్తోంది. గోగ్రా సాధారణ ప్రాంతంలో కూడా భారత దళాలను ఉపసంహరించాలని చెప్తూ, పాంగాంగ్ ట్సో వద్ద ఫింగర్ ఫీచర్ 4 నుంచి 8 వరకు ఉన్న ప్రాంతాల నుంచి తమ బలగాల ఉపసంహరణకు లంకె పెడుతోంది. 


భూభాగాన్ని వదులుకోరాదని భారత ప్రభుత్వం తీసుకున్న కచ్చితమైన నిర్ణయాన్ని చైనా అర్థం చేసుకోలేకపోతోందని ఓ సైనిక కమాండర్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతంలో సైనికపరంగా మరింత ప్రాబల్యం పెంచుకోవడం కోసం చైనా ప్రయత్నిస్తోందని చెప్పారని తెలిపింది.


Updated Date - 2020-08-08T01:53:20+05:30 IST