తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్ యువకుడు దొరికాడు : చైనా సైన్యం

ABN , First Publish Date - 2022-01-23T20:08:04+05:30 IST

భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌ నుంచి తప్పిపోయిన ఓ యువకుడు

తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్ యువకుడు దొరికాడు : చైనా సైన్యం

బీజింగ్ : భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌ నుంచి తప్పిపోయిన ఓ యువకుడు దొరికినట్లు చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-పీఎల్ఏ) ఆదివారం భారత సైన్యానికి సమాచారం ఇచ్చింది. ఆ యువకుడిని విడుదల చేసేందుకు లేదా తిప్పి పంపేందుకు తగిన ప్రక్రియను అనుసరిస్తున్నట్లు తెలిపింది. ఈ వివరాలను తేజ్‌పూర్‌లోని భారత దేశ రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే తెలిపినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. 


‘‘అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఓ యువకుడిని గుర్తించినట్లు చైనా సైన్యం మాకు సమాచారం ఇచ్చింది. (ఆ యువకుడిని తిప్పి పంపేందుకు) తగిన ప్రక్రియను అనుసరిస్తున్నట్లు చెప్పింది’’ అని పాండే చెప్పారని తెలిపింది. అయితే చైనా సైన్యం గుర్తించిన యువకుడు మిరమ్ టరోన్ (17)యేనా? కాదా? అనే వివరాలు ఇంకా తెలియడం లేదు. మిరమ్ టరోన్ ఆచూకీ తెలుసుకునేందుకు సహాయపడాలని ఇటీవల చైనా సైన్యాన్ని భారత సైన్యం కోరిన సంగతి తెలిసిందే. 


మిరమ్ టరోన్ అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లా, జిడో గ్రామస్థుడు. ఆయనను చైనా సైన్యం జనవరి 18న అపహరించినట్లు వార్తలు వచ్చాయి. మరికొందరితో కలిసి వేటకు వెళ్ళినపుడు ఇరు దేశాల సరిహద్దుల్లో ఆయన అదృశ్యమయ్యారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే భారత సైన్యం స్పందించింది. తక్షణమే పీఎల్ఏను సంప్రదించింది. అరుణాచల్ ప్రదేశ్‌ బీజేపీ ఎంపీ టపిర్ గావో మాట్లాడుతూ, పీఎల్ఏ దళాలు భారత భూభాగంలోని ఓ యువకుడిని అపహరించాయని  ఆరోపించారు. 


ఇటువంటి సంఘటన 2020 సెప్టెంబరులో కూడా జరిగింది. అప్పట్లో పీఎల్ఏ ఐదుగురు అరుణాచల్ ప్రదేశ్ యువకులను అపహరించి, ఓ వారం తర్వాత విడిచిపెట్టింది. 


భారత దేశం, చైనా మధ్య సరిహద్దులు దాదాపు 3,400 కిలోమీటర్ల మేరకు కలిసి ఉన్నాయి. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సరిహద్దు ఉంది. ఇరు దేశాల మధ్య 2020 మే నెల నుంచి ప్రారంభమైన ప్రతిష్టంభన 14 రౌండ్ల మిలిటరీ లెవెల్ చర్చల తర్వాత కూడా తొలగడం లేదు. 


Updated Date - 2022-01-23T20:08:04+05:30 IST