Kuwaitపై చైనా కన్ను.. లక్ష కోట్లకు పైగా అప్పిస్తామంటూ భారీ ఆఫర్

ABN , First Publish Date - 2021-09-14T17:03:38+05:30 IST

పక్క దేశాల అవసరాలే ఆసరాగా అప్పులివ్వడం, తర్వాత ఆ దేశాలపై పెత్తనం చెలాయించడం చైనాకు అలవాటే. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలు చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయి ..

Kuwaitపై చైనా కన్ను.. లక్ష కోట్లకు పైగా అప్పిస్తామంటూ భారీ ఆఫర్

కువైత్ సిటీ: పక్క దేశాల అవసరాలే ఆసరాగా అప్పులివ్వడం, తర్వాత ఆ దేశాలపై పెత్తనం చెలాయించడం చైనాకు అలవాటే. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలు చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. ఇక తాజాగా చైనా కన్ను కువైత్‌‌పై పడింది. లక్షల కోట్ల రూపాయలను అప్పుగా ఇస్తామంటూ కువైత్ ముందు ప్రతిపాదన పెట్టింది.


కువైత్ ప్రస్తుతం అల్ షకాయా ఎకనామిక్ సిటీని నిర్మించే ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ ఆర్థిక స్థితిని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించవచ్చని కువైత్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షల కోట్లు అవసరమయ్యే అవకాశం ఉండడంతో చైనా దీనిపై కన్నేసింది. ఈ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం దాదాపు 5 వేల కువైతీ దీనార్లు ఖర్చవుతుందని చైనా డెవెలప్‌మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని తాము అప్పుగా ఇస్తామని కువైత్‌కు ఆఫర్ ఇచ్చింది. అంటే 16 బిలియన్ డాలర్లు(రూ.1,17వేల కోట్ల రూపాయలకు పైగా) కువైత్‌కు అప్పుగా ఇచ్చేందుకు చైనా బ్యాంక్ సిద్ధమైందన్నమాట.


సిటీ మొత్తాన్ని నిర్మించేందుకు అవసరమయ్యే మొత్తాన్ని తామే ఇస్తామంటూ చైనా బ్యాంకు ఆఫర్ ఇవ్వడంతో కువైత్ కూడా ఆలోచనలో పడింది. కువైత్ అధికార యంత్రాంగం ఇప్పటికే చైనా ఆఫర్‌పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించడానికి చైనా ఆఫర్ మినహా మరేమైనా మార్గాలున్నాయోమేనని కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.


కాగా.. ఏ పనైనా లాభం లేకుండా చైనా చేయదనే విషయం తెలిసిందే. ఈ సారి కూడా చైనా అదే తరహా ప్లాన్‌తో వచ్చింది. కువైత్‌కు 16 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తామని, అయితే దానికి బదులుగా బీఓటీ పద్ధతిలో తమకు రాయితీ కావాలని మెలిక పెట్టింది. కువైత్‌లోని బీవోటీ(బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్) విధానం ప్రకారం.. నిర్మాణాల కోసం టెండర్ల కేటాయింపులో 30 శాతం కువైత్ ఇండస్ట్రీలకే కేటాయించాల్సి ఉంటుంది. ఇందులోనే చైనా మినహాయింపు కోరుతోంది. అయితే దీనిపై కువైత్ తన తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది.

Updated Date - 2021-09-14T17:03:38+05:30 IST