కరోనా మృతులకు నివాళిగా దేశవ్యాప్తంగా మౌనం పాటించిన చైనా

ABN , First Publish Date - 2020-04-04T21:07:47+05:30 IST

కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితులకు చైనా నివాళులు అర్పించింది....

కరోనా మృతులకు నివాళిగా దేశవ్యాప్తంగా మౌనం పాటించిన చైనా

బీజింగ్: కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితులకు చైనా నివాళులు అర్పించింది. నోవెల్ కరోనా వైరస్  తొలిసారి వెలుగుచూసిన చైనాలో ఇప్పటి వరకు 3,300 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేసి సంతాప దినంగా పాటించారు. ఉదయం 10 గంటలకు దేశ వ్యాప్తంగా మూడు నిమిషాల పాటు మౌనం వహించారు. అదే సమయంలో చైనాలో అన్ని పట్టణాల్లోని కూడళ్ల వద్ద ట్రాఫిక్ లైట్లు ఎరుపు రంగు ప్రదర్శించాయి. కార్లు, రైళ్లు, నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. చైనాతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చైనా దౌత్యకార్యాలయాల వద్ద ఆ దేశ జాతీయ జెండాను అవనతం చేశారు.  చైనాలోని హుబై ప్రావిన్స్‌ రాజధాని వుహాన్‌లో కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. చైనా మృతుల్లో 75 శాతం మంది ఇక్కడే చనిపోయారు. వుహాన్‌ నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా మహమ్మారి ఇప్పటి వరకు దాదాపు 50 వేల మందికి పైగా ప్రాణాలను బలిగొంది. 

Updated Date - 2020-04-04T21:07:47+05:30 IST