జీయర్‌కు ఝలక్‌!

ABN , First Publish Date - 2022-02-20T07:30:34+05:30 IST

యాదాద్రి నృసింహుడి ఆలయ ఉద్ఘాటనకు చిన

జీయర్‌కు ఝలక్‌!

  • ఆయన లేకుండానే యాదాద్రి ఉద్ఘాటన
  • దూరం పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం?
  • సుదర్శన మహా యాగం వాయిదా అందుకే..
  • యాగ నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
  • అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం
  • నాలుగు రోజుల కిందటే ప్రగతి భవన్లో భేటీ
  • ఈనెల 12న యాదాద్రికి వెళ్లిన ముఖ్యమంత్రి
  • ఐనా యాగశాల ఏర్పాట్ల పరిశీలనకు దూరం
  • జీయర్‌, కేసీఆర్‌ మధ్య ముదిరిన విభేదాలు
  • శనివారం శాంతి కల్యాణానికీ సీఎం గైర్హాజరు
  • విభేదాల తొలగింపునకు మై హోం రామేశ్వరరావు రాయబారం!


హైదరాబాద్‌, యాదాద్రి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి నృసింహుడి ఆలయ ఉద్ఘాటనకు చిన జీయర్‌ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరం పెట్టారా!? ఇందులో భాగంగానే, సుదర్శన నారసింహ మహా యాగాన్ని వాయిదా వేశారా!? చిన జీయర్‌ స్వామితో సంబంధం లేకుండానే యాగం నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అధికార, ఆలయ వర్గాలు! ముచ్చింతల్‌లో శనివారం జరిగిన శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్‌ హాజరు కాకపోవడాన్ని ఇందుకు ఉదాహరిస్తున్నాయి.


ముచ్చింతల్‌లో శనివారం జరిగే ముగింపు ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, ఆయన వస్తారో రారో తెలియదని చిన జీయర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దాంతో, కేసీఆర్‌ ముచ్చింతల్‌కు వస్తారని శనివారం సాయంత్రం వరకు అక్కడ ఉన్నవారు భావించారు. కానీ, ప్రధాని మోదీ వచ్చినప్పుడు సమతా మూర్తి ప్రారంభానికి, రాష్ట్రపతి కోవింద్‌ వచ్చినప్పుడు స్వర్ణమూర్తి ఆవిష్కరణకు హాజరు కాని కేసీఆర్‌.. ముగింపు ఉత్సవాలకు కూడా దూరంగానే ఉన్నారు. ముచ్చింతల్‌లో సమతా మూర్తి విగ్రహ ప్రారంభ సమయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలోనే చిన జీయర్‌ స్వామికి పూర్తిస్థాయిలో చెక్‌ పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. యాగానికి చిన జీయర్‌ స్వామిని దూరంగా ఉంచాలని దేవాదాయ శాఖ కీలక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


 నాలుగు రోజుల క్రితమే ప్రగతి భవన్‌లో దేవాదాయ, వైటీడీఏ కీలక అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమైనట్లు తెలిసింది. యాగం వాయిదా, చిన జీయర్‌ను యాదాద్రికి దూరంగా ఉంచడం, యాగ నిర్వహణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం తదితరాలపై వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేనా, ప్రధాని మోదీ ఈనెల 5న ముచ్చింతల్‌కు వచ్చారు. ఈనెల 13న రాష్ట్రపతి కోవింద్‌ వచ్చారు. మధ్యలో 12వ తేదీన సీఎం కేసీఆర్‌ యాదాద్రి వెళ్లారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌, వీవీఐపీ విల్లాలను ప్రారంభించిన తర్వాత, యాగశాల ఏర్పాట్లను పరిశీలించకుండానే వెళ్లిపోయారు. అప్పటి నుంచే యాగం నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. చివరికి, సీఎం ఆదేశాల మేరకే వైటీడీఏ అధికారులు శుక్రవారం యాగం వాయిదా ప్రకటన చేశారు.


సీఎం కేసీఆర్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, పని ఒత్తిడి, ఆరోగ్య కారణాలతోనే ముచ్చింతల్‌కు కేసీఆర్‌ వచ్చి ఉండకపోవచ్చని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిన జీయర్‌ తెలిపిన కొద్దిసేపటికే వైటీడీఏ అధికారులు ఈ ప్రకటన చేయడం గమనార్హం. నిజానికి, ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభించినప్పటి నుంచీ పలు సందర్భాల్లో చిన జీయర్‌ను సీఎం కేసీఆర్‌ యాదాద్రికి వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ముచ్చింతల్‌కు వెళ్లి కూడా యాదాద్రిలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు.


‘‘యాదాద్రి ఆలయ పునః ప్రారంభ కార్యక్రమం 8-9 రోజుల మహోత్సవం. చిన జీయర్‌ స్వామి పర్యవేక్షణలోనే ఉద్ఘాటన పనులన్నీ జరుగుతాయి’’ అని గత ఏడాది అక్టోబరులో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు కూడా. ముందుగా అనుకున్న ప్రకారం ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహ ఏర్పాటు సమయంలో పాల్గొన్న రుత్వికులే యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పూజా కార్యక్రమాలు, హోమాల్లో పాల్గొనాల్సి ఉంది. 1008 కుండాలతో సుదర్శన మహా యాగం, మహా కుంభ సంప్రోక్షణ పూజలకు మార్చి 21న అంకురారోపణ చేసేందుకు యాగం నిర్వహణ బాధ్యతలను ఆర్‌అండ్‌బీ, వైటీడీఏ అధికారులకు అప్పగించారు. ఇందుకు రూ.75 కోట్లను కూడా విడుదల చేశారు.


అయితే, యాదాద్రి ఉద్ఘాటనకు చినజీయర్‌ను దూరం పెట్టాలన్న ఉద్దేశంతోనే యాగాన్ని వాయిదా వేశారని తెలుస్తోంది. ఉగాది తర్వాత యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధాన ఆలయ విమాన గోపురం, స్వర్ణ తాపడం తర్వాతే మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. కేసీఆర్‌ తాజా ఆదేశాల నేపథ్యంలో, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేద పండితులను సమీకరించే పనిలో వైటీడీఏ అధికారులు నిమగ్నమయ్యారు.


గతంలో ప్రకటించిన దాని ప్రకారం.. సుదర్శన మహా యాగం తర్వాత ప్రధాన ఆలయంలోకి భక్తులకు ప్రవేశం కల్పించాలి. కానీ, తాజా మార్పు ప్రకారం మార్చి 21 నుంచి 27 వరకు జరిగే పూజా కార్యక్రమాలు, మహా కుంభ సంప్రోక్షణ అనంతరం 28 నుంచే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. యాగం వాయిదా చినజీయర్‌ ఊహించని పరిణామమని పండిత వర్గాల్లో చర్చ జరుగుతోంది.



మై హోం రామేశ్వరరావు రాయబారాలు!

సీఎం కేసీఆర్‌, చిన జీయర్‌ మధ్య విభేదాలను తొలగించేందుకు ఇద్దరికీ అత్యంత సన్నిహితుడైన మై హోం రామేశ్వరరావు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం మొదలు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సుదర్శన నారసింహ మహా యాగం శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం జరగాల్సినదని, దానిని చిన జీయర్‌ కాకుండా ఇతరుల పర్యవేక్షణలో జరపడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాల్లో రామేశ్వరరావు, ఆయన కుటుంబం అంతా తామై వ్యవహరించిన విషయం తెలిసిందే. సమతా మూర్తి, స్వర్ణ మూర్తి విగ్రహాల శిలా ఫలకాలు రెండింట్లోనూ రామేశ్వరరావు పేరును చెక్కారు కూడా.


అయితే, చిన జీయర్‌తో విభేదాల నేపథ్యంలో రామేశ్వరరావుపైనా సీఎం కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన రాయబారం ఫలిస్తే.. పరిస్థితిలో మార్పు రావచ్చు. ఒకవేళ, చిన జీయర్‌ను కచ్చితంగా దూరంగా పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయిస్తే.. సుదర్శన మహా యాగం క్రతువును శ్రీరంగంలో ఉండే అహోబిలం మఠాధిపతికి అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. వరంగల్‌కు చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యులు ఏడుగురు జీయర్‌లను తయారు చేశారు. వారిలో చిన జీయర్‌ ఒకరు. ఆయనను పక్కనబెడితే, మిగిలిన వారి సహాయంతో యాగ క్రతువును నిర్వహించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అలా పిలవాల్సి వస్తే.. భీమిలిలో ఉండే రామచంద్ర జీయర్‌ స్వామి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.


ఆది నుంచీ వివాదాలు


యాదాద్రి పనులు కొనసాగుతుండగా రకరకాల వివాదాలు చుట్టుముట్టాయి. ఆలయ రాతి శిలలపై దేవతామూర్తులతోపాటు సీఎం కేసీఆర్‌ చిత్రాన్ని చెక్కడం తీవ్ర వివాదాస్పదమైంది. దాంతో, కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఓ శిల్పి దానిని చెక్కారంటూ ఆయనపై వేటు వేశారు. ఆ తర్వాత, ఆలయంలోని మూల విరాట్టు ఆకారంలో మార్పులు చేశారనే ఆరోపణలు వచ్చాయి. శాంత మూర్తిగా ఉన్న నరసింహుడిని ఉగ్రరూపంలోకి మార్చారనే కథనాలు వచ్చాయి. అయితే, అటువంటిదేమీ లేదని వైటీడీఏ అధికారులు స్పష్టం చేశారు. ఉద్ఘాటనకు సిద్ధమైన సమయంలో ఇప్పుడు చినజీయర్‌ వివాదం దుమారం రేపుతోంది. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం, మూల విరాట్టుకు నులి పోటు తగలడం వల్లే ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయని వేద పండిత వర్గాల్లో చర్చ జరుగుతోంది.


చీకట్లోనే ఫౌంటెయిన్‌

సమతా మూర్తి విగ్రహం వద్ద శిలా ఫలకంపై ప్రధాని మోదీ, చిన జీయర్‌ స్వామి, వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు పేర్లను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ డుమ్మా కొట్టడంతో ఆయన హాజరు కాకపోయినా స్వర్ణ మూర్తి విగ్రహం శిలా ఫలకం వద్ద కేసీఆర్‌ పేరును ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి కోవింద్‌ పేరుతో సమానంగా ప్రముఖంగా కనిపించేలానే ఉంచారు. నిజానికి, ముచ్చింతల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించాల్సి ఉంది. అయితే, రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించిన ఫౌంటెయిన్‌ను శుక్రవారం నుంచి చీకట్లో ఉంచారు. ఎందుకలా చేయాల్సి వచ్చిందని మీడియా అడిగిన ప్రశ్నకు.. సాంకేతిక సమస్యలంటూ చిన జీయర్‌ దాటవేసే ప్రయత్నం చేశారు.


యాగానికి విపక్ష నాయకులు

ఉగాది తర్వాత నిర్వహించే మహా యాగం సందర్భంగా రాజకీయ సంచలనాలకూ ఆస్కారం ఉండవచ్చనే వాదన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్‌.. యాగానికి జాతీయ స్థాయిలో విపక్ష నాయకుల్ని ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.




సీఎం యాదాద్రి పర్యటన రద్దు

యాదాద్రి టౌన్‌: పుట్టిన రోజు నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయనకు ఆశీర్వచనాలు ఇచ్చేందుకు యాదాద్రి క్షేత్రం నుంచి అర్చకులు ప్రగతి భవన్‌కు వస్తున్నట్లు తెలిపినా రావద్దని విముఖత వ్యక్తంచేశారు. ఈనెల రెండో వారంలో రెండుసార్లు యాదాద్రిలో పర్యటించిన సీఎం.. తన పుట్టిన రోజైన 17న యాగస్థలిని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు 75 ఎకరాల్లో  నిర్మించనున్న యాగశాల స్థలంలో నమూనా యాగశాలను ఏర్పాటు చేశారు. అయితే, తన పర్యటనను ఆయన అర్ధంతరంగా రద్దు చేసుకోవడంతో నమూనా యాగశాలను తొలగించారు.


Updated Date - 2022-02-20T07:30:34+05:30 IST