India Vs China : ‘ఆట బొమ్మ’తో కొట్టిన మోదీ... విలవిలలాడుతున్న చైనా...

ABN , First Publish Date - 2022-08-26T22:48:56+05:30 IST

తరచూ ఘర్షణకు దిగుతున్న చైనాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని

India Vs China : ‘ఆట బొమ్మ’తో కొట్టిన మోదీ... విలవిలలాడుతున్న చైనా...

న్యూఢిల్లీ : తరచూ ఘర్షణకు దిగుతున్న చైనాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్తోంది. ఓ వైపు సైనికపరంగా దీటుగా సమాధానం చెప్తూనే, మరోవైపు ఆర్థిక రంగంలోనూ ఘాటుగా దెబ్బతీస్తోంది. దీనికి స్థానిక తయారీదారులు, దేశ ప్రజల సహకారం కూడా తోడవడంతో అనూహ్య విజయాలు నమోదవుతున్నాయి. 


2020 ఆగస్టు 30న ‘మన్‌ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మన దేశం సుసంపన్నమైన వారసత్వం, సంప్రదాయాలకు ఆలవాలమని చెప్పారు. ప్రపంచ ఆట బొమ్మల పరిశ్రమల రంగంలో నూతన ఆవిష్కరణలకు ఈ వారసత్వ, సంప్రదాయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. స్థానిక ఆటబొమ్మలపై దృష్టి సారించాలని స్టార్టప్ కంపెనీలకు పిలుపునిచ్చారు. ‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’ (vocal for local toys) అని నినదించారు. 


ఈ ఏడాది జూలై 31న మోదీ ‘మన్ కీ బాత్’లో మాట్లాడుతూ, భారతీయ ఆట బొమ్మల పరిశ్రమ సాధించిన విజయాలను వివరించారు. ఏటా దాదాపు రూ.3,000 కోట్ల విలువైన ఆట బొమ్మలను దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడు దిగుమతులు 70 శాతం తగ్గిపోయాయని చెప్పారు. మన దేశం నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల విలువైన ఆటబొమ్మలను ఎగుమతి చేసేవారమని, ఇది ఇప్పుడు రూ.2,600 కోట్లకు పెరిగిందని వివరించారు. ఎక్కడ చూసినా ‘వోకల్ ఫర్ లోకల్’ వినిపిస్తోందన్నారు. ఇటువంటి విజయాన్ని ఎవరూ ఊహించలేదన్నారు. 


తగ్గిన దిగుమతులు, పెరిగిన ఎగుమతులు

ఈ ఏడాది జూలైలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, భారత దేశంలో స్థానిక తయారీదారులు (లోకల్ మాన్యుఫ్యాక్చరర్ల)కు మంచి ప్రోత్సాహం లభించింది. గడచిన మూడేళ్ళలో ఆట బొమ్మల ఎగుమతులు 61 శాతం పెరిగాయి, దిగుమతులు 70 శాతం తగ్గిపోయాయి. మూడు చక్రాల సైకిళ్ళు, స్కూటర్లు, పెడల్ కార్లు, వీడియో గేమ్ కన్సోల్స్, మెషీన్స్, పండుగలు, కార్నివాల్, ఇతర వినోద వస్తువుల దిగుమతులు బాగా క్షీణించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 371 మిలియన్ డాలర్ల విలువైన ఆట బొమ్మలను దిగుమతి చేసుకోగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 110 మిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. అంటే దిగుమతుల్లో 70.35 శాతం క్షీణత కనిపించింది. మరింత వివరంగా పరిశీలించినపుడు, మూడు చక్రాల సైకిళ్లు, స్కూటర్లు, పెడల్ కార్ల దిగుమతులు ఇదే కాలంలో 304 మిలియన్ డాలర్ల నుంచి 36 మిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. 2020-21లో దిగుమతి చేసుకున్న మొత్తం ఆట బొమ్మల్లో చైనా ఉత్పత్తులు 71 శాతం ఉండేవి, 2021-22లో మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 62 శాతానికి తగ్గింది. 



అనూహ్య విజయానికి కారణాలు

స్థానిక ఉత్పత్తులకు ప్రభుత్వంతోపాటు మోదీ ఇస్తున్న ప్రోత్సాహం వల్ల ఆట బొమ్మల పరిశ్రమ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందినట్లు టాయ్ మాన్యుఫ్యాక్చరర్లు చెప్పారు. టాయ్ ఇండస్ట్రీ గురించి మోదీ ఇచ్చిన ప్రకటన, ‘మన్ కీ బాత్’ కార్యక్రమాల్లో స్థానిక ఆట బొమ్మల గురించి ప్రస్తావించడం వంటివన్నీ ఇటీవలి సంవత్సరాల్లో తమకు బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు. గతంలో ఢిల్లీలో వేళ్ళపై లెక్కబెట్ట కలిగినంత మంది మాత్రమే స్థానిక మాన్యుఫ్యాక్చరర్లు ఉండేవారని, ఇప్పుడు ప్రాంతీయ తయారీదారులు కూడా రంగంలోకి దిగారని చెప్పారు. 


టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, విదేశీ తయారీదారులు కూడా తప్పనిసరిగా బీఐఎస్ సర్టిఫికేషన్ పొందాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఇప్పటి వరకు విదేశీ కంపెనీలేవీ ఈ సర్టిఫికేషన్ పొందలేదన్నారు. దిగుమతులు తగ్గడానికి ఇది ప్రధాన కారణమని చెప్పారు. మన దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఇప్పుడు సొంతంగానే పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు మన దేశం నుంచి ఎగుమతులు కూడా పెరిగాయన్నారు. 


టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు, లిటిల్ జీనియస్ టాయ్స్ యజమాని నరేశ్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ, ఆట బొమ్మల పరిశ్రమ అకస్మాత్తుగా ఊపందుకోవడానికి కారణం ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తున్న విధానాలేనని తెలిపారు. చైనా ఆట బొమ్మలపై దిగుమతి సుంకాన్ని 300 శాతం పెంచడం, ఆట బొమ్మలకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) ట్యాగ్‌ను తప్పనిసరి చేయడం తమ పరిశ్రమకు బాగా ఉపయోగపడినట్లు తెలిపారు. 2020 ఫిబ్రవరిలో ట్రైసైకిళ్ళు, పెడల్ కార్లు, స్కూటర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుంచి 60 శాతానికి పెంచిందన్నారు. బీఐఎస్ ట్యాగ్‌ను తప్పనిసరి చేయడంతో స్థానిక ఆట బొమ్మల తయారీదారులు నాణ్యమైన ఆట బొమ్మలను తయారు చేయడం ప్రారంభించారని, దానివల్ల ఎగుమతులకు అవకాశాలు పెరిగాయని చెప్పారు. 32 సంవత్సరాల నుంచి తమ కంపెనీలో కొయ్య బొమ్మలను తయారు చేస్తున్నామని, అమెరికా, యూరోప్ దేశాలవారి డిమాండ్‌కు తగినట్లుగా బొమ్మలను తయారు చేసి, పంపిస్తున్నామని చెప్పారు. 


యునైటెడ్ ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌కు చెందిన అనుభవ్ జైన్ మాట్లాడుతూ, చైనా ఉత్పత్తులను ఆపేందుకు మోదీ ప్రభుత్వం చాలా ముఖ్యమైన, మంచి నిర్ణయాలను తీసుకుందన్నారు. ఒకప్పుడు మన దేశ ఆట బొమ్మల మార్కెట్లో స్థానిక తయారీదారులు చాలా తక్కువగా ఉండేవారని, చైనీయులే ఆధిపత్యం చలాయించేవారని చెప్పారు. కానీ ఇప్పుడు స్థానిక తయారీదారుల మధ్య విపరీతమైన పోటీ ఉందన్నారు. ఢిల్లీతోపాటు గుజరాత్, దక్షిణాది రాష్ట్రాల కంపెనీలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయన్నారు. 



ఎగ్జిబిషన్ల నిర్వహణ

స్థానిక తయారీదారులు తయారు చేసిన ఆట బొమ్మలను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఎగ్జిబిషన్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జూలై 2 నుంచి 5 వరకు టాయ్ బిజ్ బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించింది. దీనిలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన టాయ్ మాన్యుఫ్యాక్చరర్లు పాల్గొన్నారు. 


ఆరు నెలలకు సరిపడిన ఆర్డర్లు

ఈ ఎగ్జిబిషన్‌ అనంతరం తమకు ఆరు నెలలకు సరిపడిన ఆర్డర్లు వచ్చాయని ఓ మాన్యుఫ్యాక్చరర్ చెప్పారు. తమ కంపెనీలో స్థలం సరిపోదని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, గ్రేటర్ నోయిడాలోని జేవర్ విమానాశ్రయం వద్ద కొంత స్థలాన్ని ఇస్తామని చెప్పారని తెలిపారు. 


స్థానిక కంపెనీలు 6,000కుపైనే...

టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, మన దేశంలో ఆట బొమ్మల తయారీ కంపెనీలు దాదాపు 6,000 వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 850 వరకు బీఐఎస్ లైసెన్స్‌ను పొందాయి. గతంలో దిగుమతిదారులుగా ఉన్నవారిలో అత్యధికులు నేడు తయారీదారులుగా మారారు. సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల టాయ్ హబ్స్, క్లస్టర్స్ వెలుస్తున్నాయి. 


తయారీదారులు ఇంకా ఏం కోరుకుంటున్నారు?

ఢిల్లీలోని ఆర్‌పీ అసోసియేట్స్ యజమాని పవన్ గుప్తా మాట్లాడుతూ, దిగుమతిదారులు సొంత కంపెనీలను ఏర్పాటు చేసుకుంటుండటం సానుకూల పరిణామమని చెప్పారు. త్వరలోనే తమకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. అదేవిధంగా రుణాలపై వడ్డీ రేటులో రాయితీ ఇవ్వాలన్నారు. ప్రస్తుత వేగంతో అభివృద్ధి కొనసాగితే రానున్న ఐదేళ్ళలో మన దేశం ఆట బొమ్మల ఎగుమతుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో నిలుస్తుందన్నారు. 


దేశవ్యాప్తంగా 19 టాయ్ క్లస్టర్లకు అనుమతి

కేంద్ర మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 19 టాయ్ క్లస్టర్లకు అనుమతి ఇచ్చింది. మధ్య ప్రదేశ్‌లో 9, రాజస్థాన్‌లో 3, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో రెండు చొప్పున, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. 


పిల్లలకు వందనం : మోదీ

స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఈ నెల 15న ఎర్ర కోట నుంచి మోదీ మాట్లాడుతూ, ఐదు నుంచి ఏడేళ్ళ బాలలు సైతం తమకు విదేశీ ఆట బొమ్మలు వద్దంటున్నారని, వారికి తాను వందనం చేస్తున్నానని అన్నారు. ఇది వారిలోని ఆత్మనిర్భర్ భారత్ (స్వయం సమృద్ధ భారత్) స్ఫూర్తిని తెలియజేస్తోందని అన్నారు. 


                                        - యెనుములపల్లి వేంకట రమణ మూర్తి


Updated Date - 2022-08-26T22:48:56+05:30 IST