ఉక్రెయిన్‌పై రష్యా సిద్ధాంతం, భారత్‌పై చైనా సిద్ధాంతం ఒకటే : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-04-08T21:05:42+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు

ఉక్రెయిన్‌పై రష్యా సిద్ధాంతం, భారత్‌పై చైనా సిద్ధాంతం ఒకటే : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా అనుసరిస్తున్న సూత్రాన్నే భారత్‌పై చైనా అనుసరిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్, లుహాన్‌స్క్‌లను భారత దేశంలోని లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లతో పోల్చారు. ఆర్జేడీ నేత శరద్ యాదవ్‌ను ఢిల్లీలో కలిసిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. 


రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించాలని మీడియా కోరినపుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను అంగీకరించబోమని రష్యా చెప్తోందన్నారు. డోనెట్‌స్క్, లుహాన్‌స్క్ ప్రాంతాలను ఉక్రెయిన్‌లో భాగంగా గుర్తించబోమని చెప్తోందన్నారు. ఆ ప్రాతిపదికపైనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిందన్నారు. NATO-ఉక్రెయిన్-అమెరికా మధ్య సంబంధాలను దెబ్బతీయడమే రష్యా లక్ష్యమని తెలిపారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ భారత దేశానికి చెందినవి కాదని చైనా అంటోందన్నారు. ఈ ప్రాంతాల్లో చైనా తన దళాలను మోహరించిందన్నారు. ఆ (రష్యా) విధానాన్ని మనకు (భారత్‌కు) కూడా వర్తింపజేసే అవకాశం ఉందన్నారు. 


భారత దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, మన దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల పరిస్థితి గురించి ఊహించలేరన్నారు. మునుపెన్నడూ లేని పరిస్థితి రాబోతోందన్నారు. ఈ దేశ ఉపాధి రంగం వెన్ను విరిగిందని చెప్పారు. చిన్న, మధ్య తరహా వ్యాపార రంగం; చిన్న దుకాణదారులు, అవ్యవస్థీకృత రంగం మన దేశానికి వెన్నెముక వంటివన్నారు. 


ఆర్థికవేత్తలు, బ్యూరోక్రాట్లు ఇతర దేశాలను చూసి ప్రణాళికలను తయారు చేస్తారన్నారు. మనం ఆ దేశాల మాదిరిగా అభివృద్ధి చెందాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్తూ ఉంటారన్నారు. అలా జరగడం అసాధ్యమన్నారు. మొదట, మనం మనమెవరమో? ఇక్కడ జరుగుతున్నదేమిటో? తెలుసుకోవాలని చెప్పారు. ఈ ప్రభుత్వం ఆ వెన్నెముకను విరగ్గొట్టిందని తెలిపారు. రానున్న మూడు, నాలుగేళ్ళలో భయానక ఫలితాలు వస్తాయని చెప్పారు. 


రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో పార్లమెంటులో మాట్లాడుతూ, భారత దేశ వైఖరి వల్ల చైనా, పాకిస్థాన్‌లు దగ్గరయ్యాయన్నారు. చైనా, పాకిస్థాన్‌ వేర్వేరుగా ఉండేలా చేయడం భారత దేశ వ్యూహాత్మక లక్ష్యం కావాలన్నారు. మనం ఎదుర్కొంటున్నదానిని తక్కువగా అంచనా వేయకూడదన్నారు. ఇది భారత దేశానికి తీవ్రమైన ముప్పు అన్నారు.


శరద్ యాదవ్ తన లోక్‌తాంత్రిక్ జనతా దళ్ పార్టీని గత నెలలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలో విలీనం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఏకంకావాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-04-08T21:05:42+05:30 IST