చైనా దూకుడు

ABN , First Publish Date - 2022-01-04T06:03:53+05:30 IST

‘కొత్త సంవత్సరం తొలిరోజున గల్వాన్ లోయలో చైనా జాతీయ జెండా ఎగిరింది. ఇది తియాన్మెన్ స్వ్కేర్ మీద ఎగిరిన జెండా’ అంటూ చైనా అధికార ప్రతినిధి వీడియోతో పాటు చేసిన ట్వీట్ మన విపక్ష రాజకీయ నేతలకు...

చైనా దూకుడు

‘కొత్త సంవత్సరం తొలిరోజున గల్వాన్ లోయలో చైనా జాతీయ జెండా ఎగిరింది. ఇది తియాన్మెన్ స్వ్కేర్ మీద ఎగిరిన జెండా’ అంటూ చైనా అధికార ప్రతినిధి వీడియోతో పాటు చేసిన ట్వీట్ మన విపక్ష రాజకీయ నేతలకు ఆవేదన కలిగించింది. ప్రధాని మోదీ ఇప్పటికైనా మౌనం వీడాలనీ, డ్రాగన్‌కు దీటుగా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గల్వాన్ లోయలో ఎగరాల్సింది మన మువ్వన్నెల పతాకం మాత్రమే అని మరొకరు అన్నారు. ప్రభుత్వం మాట్లాడలేదు కానీ, ఆర్మీమాత్రం ఓ వివరణ ఇచ్చింది. చైనా సైన్యం తన దేశ జెండా ఎగురవేసింది వివాదాస్పద ప్రాంతంలో కాదనీ, చైనా అధీనంలోని ప్రదేశంలోనే ఈ పతాకావిష్కరణ జరిగిందని ఆ ప్రకటన పేర్కొంది. చైనా అధీనంలోని ప్రాంతంలోనే ఈ జెండా ఎగిరితే చైనా అధికార ప్రతినిధి అంత ఉత్సాహంగా ఆ వీడియో పోస్టుచేయడం, దానికో నర్మగర్భ వ్యాఖ్య చేర్చడం ఎందుకని కొందరి అనుమానం. భారతదేశాన్ని నిత్యం ఏదో ఒక వివాదంతోనో, వ్యాఖ్యతోనో గిల్లుతూండాలని చైనా సంకల్పించినట్టుంది. 


ఇటీవల ఈశాన్యరాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో పదిహేను ప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకుంది. మీరు మీ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మా ఊళ్ళు మీవి కాబోవు అని భారత్ జవాబిచ్చింది. భారత్ అంతర్భాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో  చైనా కుయుక్తులకు పాల్పడినంత మాత్రాన సత్యం మారిపోదని భారత్ వ్యాఖ్యానించింది. ఈ పదిహేను ప్రాంతాలను దక్షిణ టిబెట్‌లోని తన అంతర్గత భూభాగాలుగా చైనా సమర్థించుకుంది. మొత్తం అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తన అధికారిక మ్యాపుల్లో దక్షిణటిబెట్ గా పేర్కొంటున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ళక్రితం కూడా చైనా ఇదే తరహా విన్యాసం చేసింది. 2017లో దలైలామా అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శించడంపై ఆగ్రహించిన చైనా ఆరుప్రాంతాలకు తన పేర్లు పెట్టింది. ఇప్పుడు మరింత పెద్ద జాబితాతో రాష్ట్రంలోని ప్రధానప్రాంతాలన్నీ ఆ చివరినుంచి ఈ చివరివరకూ చుట్టేసే రీతిలో ఈ నామకరణం జరిపింది. పదకొండు జిల్లాలు, ఎనిమిది పట్టణాలు, నాలుగు పర్వతాలు, రెండు నదులు కూడా ఇందులో ఉన్నాయి.


అరుణాచల్ మాదే అన్న వాదనకు అనుగుణంగా చైనా ఈ విన్యాసం సాగించినా నిజాలు ఎప్పటికీ చెరిగిపోవు. అయితే, వివాదాల్లో ఉన్న సరిహద్దుల విషయంలో చైనా కొత్త వైఖరిని అనుసరించబోతున్నదని కొందరి అనుమానం. జనవరి ఒకటినుంచి చైనా కొత్త ‘భూ సరిహద్దు చట్టం’ అమలులోకి రాబోతున్న తరుణంలో ఈ పేర్ల ప్రకటన వెలువడింది. 2021 మార్చిలో ప్రతిపాదించిన ఈ చట్టం ఏడునెలల్లో ఆమోదం పొందింది. అక్టోబర్ 23న చైనా ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ దీనికి తలూపగానే అధ్యక్షుడు జిన్ పింగ్ ఆమోదముద్రవేశారు. చైనా ప్రభుత్వ సమస్త వ్యవస్థలూ దేశ భూభాగాన్ని పరిరక్షించడానికి బలంగా కట్టుబడాలని ఈ చట్టం పిలుపునిస్తున్నది. ఈ చట్టం మీద భారతదేశం వెంటనే తన నిరసన వెలిబుచ్చింది. ఉన్న వివాదాల పరిష్కారమే కష్టమవుతున్న తరుణంలో ఈ ఏకపక్ష చట్టం సరిహద్దు సమస్యలని మరింత జటిలం చేస్తుందని భారత్ వాదన. ఇప్పటికే చేసుకున్న సరిహద్దు ఒప్పందాలమీద దీని ప్రభావం ఉండబోదని చైనా ప్రకటించినప్పటికీ, తన చొరబాట్లకు సాధికారత సంపాదించుకోవడానికి ఈ కొత్త చట్టం దానికి ఉపకరించవచ్చు. రెండేళ్ళుగా చైనా ఎంతో దూకుడుగా సరిహద్దులు చొచ్చుకువస్తున్నది. అంతిమంగా హద్దులనీ, అధీనరేఖని తనకు అనుగుణంగా తిరగరాసుకోవాలన్నది లక్ష్యం.


సరిహద్దు వివాదాల పరిష్కారానికి సైనికస్థాయిలోనూ, దౌత్యపరంగానూ ఏవో ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో చైనా ఈ నామకరణ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. 20 విడతల చర్చల్లో పెద్దగా సాధించింది ఏమీ లేకున్నా, సరిహద్దుల్లో శాంతికొనసాగించే విషయంలో ఇరుపక్షాలూ అంగీకారానికి వచ్చినందున కాస్తంత వెనక్కుతగ్గి ప్రశాంతత నిలబెట్టుకోగలిగాయి. ఇప్పుడు కొత్త చట్టంతో చైనా ఎన్ని వీరంగాలైనా వేయవచ్చును. దేశ సరిహద్దుల పరిరక్షణ పేరిట సైనిక చొరబాట్లు జోరుగా సాగి, చర్చలు వెనక్కుపోవచ్చును. దాని అధీనంలో ఉన్న వివాదాస్పద ప్రాంతాలనుంచి ఉపసంహరణలు కూడా కష్టంకావచ్చును. ఉభయదేశాలు గత ఒప్పందాలకు కట్టుబడి ఉండటం, సరిహద్దుల్లో యథాతథస్థితిని కొనసాగించడం, శాంతి నెలకొనేట్టు చేయడం తక్షణావసరం. సర్వశక్తులూ సమీకరించి వైరస్‌తో మరింత బలంగా పోరాడవలసిన తరుణంలో హద్దులుదాటిన కయ్యాలు ఏమాత్రం సరికాదు.

Updated Date - 2022-01-04T06:03:53+05:30 IST