లద్దాఖ్‌ను కబళించాలనే!

ABN , First Publish Date - 2020-06-17T08:01:55+05:30 IST

గ్యాల్వన్‌ నది సెక్టార్‌లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న సంక్షోభం ఇప్పుడు అకస్మాత్తుగా ఏర్పడింది కాదు. 1962 యుద్ధానికి ముందు నుంచే చైనా కన్ను దీనిపై ఉంది. తూర్పు సరిహద్దులోని లద్దాఖ్‌ ప్రాంతాన్ని పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటే భారత బలగాలను అడ్డుకోవచ్చని భావిస్తోంది...

లద్దాఖ్‌ను కబళించాలనే!

  • చైనా దుందుడుకుతనం ఇందుకే
  • తూర్పు సరిహద్దులో భారత్‌దే పైచేయి
  • దాని నిరోధానికే ఘర్షణల ఎత్తుగడ
  • తొలి నుంచీ గాల్వన్‌ నదిపై కన్ను
  • ఆ పరిసరాల్లోనే భారీగా మన బలగాలు
  • దీనిపై పట్టు సాధిస్తే తిరుగుండదు
  • 1962 నాటికే అక్సాయ్‌చిన్‌ ఆక్రమణ
  • ఇప్పుడు మొత్తం లద్దాఖ్‌పైనే దృష్టి

(న్యూఢిల్లీ) : గ్యాల్వన్‌ నది సెక్టార్‌లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న సంక్షోభం ఇప్పుడు అకస్మాత్తుగా ఏర్పడింది కాదు. 1962 యుద్ధానికి ముందు నుంచే చైనా కన్ను దీనిపై ఉంది. తూర్పు సరిహద్దులోని లద్దాఖ్‌ ప్రాంతాన్ని పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటే భారత బలగాలను అడ్డుకోవచ్చని భావిస్తోంది. ఇప్పటికే ఆక్సాయ్‌చిన్‌లో చాలా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అంతటితో ఆగకుండా ఇప్పుడు కీలకమైన గ్యాల్వన్‌ లోయపైనా కన్నేసింది. నిజానికి చైనా 1962లో ఆక్రమణకు దిగడానికి ప్రధాన కారణం.. జిన్‌జియాంగ్‌-టిబెట్‌ రహదారి నిర్మాణంపై భారత్‌ అభ్యంతరం చెప్పడమే. అప్పటికి ఆ రహదారి పూర్తయింది కూడా. ఆ రోడ్డు మన భూభాగంలోని అక్సాయ్‌చిన్‌ గుండా 179 కిలోమీటర్ల మేర ఉంది. భారత్‌ ఆమోదం తీసుకోకుండా దీనిని నిర్మించింది. ఆ తర్వాత ఇది తన భూభాగమేనన్న వాదన అందుకుంది.. 1962 సెప్టెంబర్లో తూర్సు లద్దాఖ్‌లో పలు ప్రాంతాలు తనవేనని ప్రకటించుకుంది.


నవంబరులో యుద్ధం ముగిసేటప్పటికి మరిన్ని ఏరియాలను ఆక్రమించింది. ఇప్పుడు లద్దాఖ్‌ మొత్తం తనదేనని పట్టుబడుతోంది. ఒకప్పుడు లద్దాఖ్‌ ప్రాంతమంతా తన జిన్‌జియాంగ్‌ ప్రాంతంలోనిదని వాదిస్తోంది. దీనికి ప్రధాన కారణమేమిటంటే.. తూర్పు సరిహద్దులో తన ఆర్థిక, సైనిక వ్యూహాలకు అవాంతరాలు ఏర్పడకుండా చూసుకోవడమే. టిబెట్‌ను కూడా చైనా ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం సంభవించి జిన్‌జియాంగ్‌-టిబెట్‌ రోడ్డు వైపు భారత్‌ బలగాలు ముందుకొస్తే సైనికంగా తనకే గాక మిత్రదేశమైన పాకిస్థాన్‌కు కూడా ముప్పు ఏర్పడుతుంది. అందుకే భారత్‌ను చక్రబంధంలో ఇరికించడానికి ఎల్‌ఏసీ వెంబడి ఘర్షణలకు దిగుతోందని రక్షణ నిపుణులు అంటున్నారు.




చైనాకు అభిముఖంగా..

తూర్పు లద్దాఖ్‌లో గ్యాల్వన్‌ నది సహా పలు ప్రాంతాల్లో భారతీయ సైన్యం స్థావరాలను ఏర్పాటుచేసుకుంది. వాటికి అభిముఖంగా ఉన్న చైనా సైన్యానికి భారత పతాకం రెపరెపలాడుతూ కనిపిస్తుంటుంది. 1962 యుద్ధంలో ఈ పోస్టుల వద్ద భారతీయ బలగాలు ఎక్కువగా లేకపోవడంతో వేల సంఖ్యలో వచ్చిన చైనా సైన్యం చేతుల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత్‌ అధీనంలోని లద్దాఖ్‌లోని ఈశాన్య భాగాన్ని సబ్‌సెక్టార్‌ నార్త్‌ (ఎస్‌ఎ్‌సఎన్‌)గా లేదా దౌలత్‌ బేగ్‌ ఓల్డీ (డీబీవో) సెక్టార్‌గా పిలుస్తారు. అక్సాయ్‌చిన్‌లో చైనా ఆక్రమించగా మిగిలిన భూభాగం భారత్‌ అధీనంలో ఉంది. ఇక్కడకు భారత బలగాలు వెళ్లేందుకు సరైన రోడ్లు లేవు. అక్కడి శ్యోక్‌ నది శీతాకాలం ఘనీభవించి.. వేసవి కాలం కరిగిపోతుంది. కరిగిన నీటి ప్రవాహం ఉఽధృతంగా ఉంటుంది. రోడ్లు, వంతెనలు నిర్మించినా కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా భారత వాయుసేన ఇక్కడ పహరా కాస్తోంది. రోడ్డు మార్గంలో మన బలగాలు అక్కడకే చేరే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఇక్కడ భారత్‌ మౌలిక సదుపాయాలు కల్పించకుండా చైనా అడ్డుకుంటోంది. అదే సమయంలో 2016 నుంచి చైనా ఎల్‌ఏసీకి అతి సమీపాన పెద్దఎత్తున రోడ్లు నిర్మిస్తోంది. అంతేగాక పాకిస్థాన్‌ గుండా ఆర్థిక కారిడార్‌ రహదారి (సీపీఈసీ) కూడా ఇక్కడకు సమీపానే ఉంది. వీటి రక్షణకే వ్యూహాత్మకంగా భారత్‌తో సరిహద్దుల్లో ఘర్షణలకు దిగుతోంది. పాక్‌తో కలిసి తూర్పు, వాయవ్య ప్రాంతాల నుంచి భారత్‌ను ఎదుర్కొనే దిశగా అడుగులు కదుపుతోంది. సియాచిన్‌ గ్లేసియర్‌ నుంచి ఇండియాను తరిమేస్తే కశ్మీరంతా తమ చేతికి చిక్కుతుందన్న దురాలోచనలో ఉందని నిపుణులు అంటున్నారు.




ఘర్షణలకు మేలోనే శ్రీకారం..

గ్యాల్వన్‌ నది సెక్టార్‌లో మే నెలలో తమ స్థావరాల నుంచి బయల్దేరిన చైనా సైనికులు మొదటివారంలో ఈ నది వెంబడి ప్రయాణించి ఎల్‌ఏసీని దాటాలనుకున్నారు. 14వ గస్తీ కేంద్రం వద్ద భారత సైనికులు వారిని అడ్డుకున్నారు. శ్యోక్‌, గ్యాల్వన్‌ నదుల సంగమం ఎల్‌ఏసీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో దీనికి వ్యూహాత్మక ప్రాఽధాన్యం ఏర్పడింది. గత నెల 5న ప్యాంగ్‌యాంగ్‌ సరస్సుకు ఉత్తరాన సైనికులు బాహాబాహీ తలపడ్డారు. తర్వాత 9న నాకులా పాస్‌ వద్ద మళ్లీ తలపడ్డారు. ఇప్పుడు గ్యాల్వన్‌లో ఘర్షణ జరిగింది.


కశ్మీర్లో ఎప్పుడో తలదూర్చింది

నిరుడు జమ్మూకశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దుచేసి లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. అప్పటి నుంచే చైనా దుందుడుకుతనంతో వ్యవహరిస్తోందన్న వాదనను రక్షణ నిపుణులు కొట్టివేస్తున్నారు. కశ్మీరు అంశంలో చైనా ఎప్పుడో తలదూర్చిందని స్పష్టం చేస్తున్నారు. కశ్మీరులోని అక్సాయ్‌ చిన్‌, లద్దాఖ్‌లోని కొన్ని ప్రాంతాలను ఏనాడో ఆక్రమించుకుందని గుర్తుచేస్తున్నారు. ‘1947 నుంచి ఇప్పటివరకు పలు సార్లు కశ్మీరుపై తన వైఖరి మార్చుకుంది. ఇప్పటి పీవోకేలోని గిల్గిట్‌లో ఉన్న హంజా ప్రాంతం తనదేనని వాదించింది. చివరకు దానిని పాక్‌లో విలీనం చేసింది. 1950ల్లో హిందీ-చీనీ భాయీభాయీ నినాదం కారణంగా కశ్మీరుపై ఎలాంటి వైఖరీ తీసుకోలేదు. 1962 యుద్ధం తర్వాత కశ్మీరీలకు స్వయంనిర్ణయాధికార హక్కుందని వాదించింది. 1995లో కశ్మీరు సమస్యను పక్కనపెట్టి రెండు దేశాలూ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించింది. 2009 నాటికి మళ్లీ భారత్‌తో సరిహద్దు సమస్య, కశ్మీరుపై కఠిన వైఖరి అవలంబించడం మొదలుపెట్టింది’ అని చెబుతున్నారు. భారత్‌ తక్షణమే తన బలగాలను పెద్దసంఖ్యలో లద్దాఖ్‌లో మోహరిస్తే చైనా వెనక్కి తగ్గవచ్చని.. కానీ ఈ ప్రాంతంలో సైనికపరంగా సమతౌల్యం సాధించకపోతే చైనా కశ్మీరులో పూర్తిగా జోక్యం చేసుకుంటుందని చెబుతున్నారు. 


పీఎల్‌ఏ బలగాలు అక్రమంగా రోడ్డు నిర్మించేందుకు భూటాన్‌ భూభాగమైన డోక్లాంలోకి 2017 జూన్‌ 16న చొరబడ్డాయి. చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భారత్‌ 270 మంది సైనికులను, బుల్‌డోజర్లను అక్కడకు పంపింది. ఆగస్టు 28 వరకు ఉభయ సైన్యాలు బాహాబాహీకి ఎదురెదురు నిలబడ్డాయి. చైనా బలగాలు ముందుకు రాకుండా భారతీయ సైనికులు అడ్డుకోగలిగారు. అత్యున్నత స్థాయిలో జరిగిన చర్చల దరిమిలా ఉభయపక్షాలు నిర్దుష్ట దూరం వెనుదిరిగాయి. 


మంచు పర్వతాల్లో చైనా సమరోద్ధత?

ఎల్‌ఏసీ పొడవునా భారత సైనిక సామర్థ్యాన్ని తొలుత తేలిగ్గా అంచనా వేసిన చైనా.. 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత తన సైనిక వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. మంచుకొండల్లో చేయాల్సిన యుద్ధరీతులపై దృష్టి సారించింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పొడవునా.. అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను మోహరించింది. సరిహద్దు ప్రాంతాల్లో తన ఆయుధ సంపదను మరింత బలోపేతం చేసుకుంది. టైప్‌ 15 యుద్ధ ట్యాంకులను రంగంలోకి దించుతోంది. జడ్‌-20 హెలికాప్టర్లు, జీజడ్‌-2 డ్రోన్లతో భారత బలగాల కదలికలపై కన్నేశామని చైనా అధికార పత్రిక ‘ది గ్లోబల్‌ టైమ్స్‌’ తెలిపింది. ఆయుధ వ్యవస్థలన్నిటినీ కంప్యూటకరించినట్లు సమాచారం. వీటన్నిటితో పర్వత శిఖరాలపై యుదఽ్ధంలో తనదే పైచేయి అని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) భావిస్తోంది. ముఖ్యంగా టైప్‌ 15 ట్యాంకు తేలికపాటి వాహనం. 105 మిల్లీమీటర్ల ఫిరంగులతో ఎలాంటి సాయుధ కవచ వాహనాలనైనా ధ్వంసం చేయగలదని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. అయితే ఈ ఆయుధ వ్యవస్థలను ఎల్‌ఏసీ వెంబడి పూర్తిస్థాయిలో మోహరించిందీ లేనిదీ గ్లోబల్‌ టైమ్స్‌ తన కథనంలో చెప్పలేదు. భారత అధికార వర్గాలు కూడా దీనిని ధ్రువీకరించలేదు. 




మూడు సరిహద్దుల్లో ఏది?

మెక్‌మోహన్‌ లైన్‌, క్లెయిమ్‌ లైన్‌, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ).. భారత్‌, చైనా మధ్య మూడు రకాల సరిహద్దు రేఖలు ఉన్నాయి. ఇందులో మెక్‌మోహన్‌ లైన్‌ను చైనా అంగీకరించదు. క్లెయిమ్‌ లైన్‌ను భారత్‌ గుర్తించదు. ఎల్‌ఏసీని ఉభయపక్షాలూ అంగీకరించినా గొడవలు కొనసాగుతున్నాయి. 1846లో బ్రిటిష్‌ ఇండియా జమ్మూకశ్మీరును తనలో కలుపుకొంది. ఇప్పడున్న గుర్తించని సరిహద్దు ప్రాంతాలను ఉభయ దేశాల మధ్య సరిహద్దుగా గుర్తించేందుకు చైనాను అంగీకరింపజేయడానికి బ్రిటిష్‌ పాలకులు చేసిన యత్నాలు ఫలించలేదు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక 1950లో విడుదల చేసిన మ్యాప్‌లో లద్దాఖ్‌ను గుర్తించని సరిహద్దు ప్రాంతంగా పేర్కొంది. 1959లో అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌లై సరిహద్దు సమస్య పరిష్కారానికి నాటి భారత ప్రధాని నెహ్రూకు ఓ లేఖ రాశారు. మెక్‌మోహన్‌ రేఖను తూర్పు సరిహద్దుగా అంగీకరిస్తామని, బదులుగా తూర్పు లద్దాఖ్‌లో అప్పటికి రెండు దేశాల అధీనంలో ఉన్న ప్రాంతాలను సరిహద్దుగా గుర్తించాలని మెలిక పెట్టారు. ఈ ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారు. 1993లో శాంతిసామరస్య ఒప్పందం ప్రకారం మొత్తం సరిహద్దు వివాద ప్రాంతాన్ని ఎల్‌ఏసీగా గుర్తించాలని 2 దేశాలూ అంగీకరించాయి.


గత ఘర్షణలు ఇలా..

1962: చైనా-భారత్‌ యుద్ధం. అక్సాయ్‌చిన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ను ఆక్రమించిన చైనా.

1967: చుంబు వ్యాలీపై పట్టు 

కోసం నాథులా పాస్‌ వెంబడి చైనా సైన్యం మళ్లీ దాడి. నెల తర్వాత చో లా పాస్‌ వద్ద ఉభయ సేనల ఘర్షణలు. 88 మంది 

భారత సైనికులు, 340 మంది చైనా ట్రూపర్లు మృతి. 

1987: అరుణాచల్‌ ప్రదేశ్‌కు రాష్ట్రప్రతిపత్తి కల్పించడంతో చైనా ఆగ్రహం. సులు లా, బుమ్‌ లా పాస్‌ల 

వద్ద ఉభయ సైన్యాల ఘర్షణ.

2013: అక్సాయ్‌చిన్‌ వద్ద రకీ నులా 

వద్ద స్థావరం ఏర్పాటుకు చైనా బలగాల యత్నం. దానికి 300 మీటర్ల చేరువలో శిబిరం ఏర్పాటుచేసిన భారత్‌, భారీగా బలగాలను తరలించిన చైనా.. చివరకు క్రమంగా సేనల ఉపసంహరణ.

2014: ఽతన భూభాగంలోని దెంచాక్‌లోని గ్రామాలకు నీరు అందించేందుకు 100 అడుగుల కెనాల్‌ను భారత్‌ తవ్వడంతో చైనా అభ్యంతరం. మూడు వారాల పాటు సంక్షోభం. ఇదే సమయంలో చుమార్‌ వద్ద భారత భూభాగంలోకి ఐదు కిలోమీటర్ల వరకు చొరబడిన చైనా బలగాలు. మళ్లీ ఘర్షణలు. చివరకు వెనక్కి తగ్గిన చైనా.

2015: ఉత్తర లద్దాఖ్‌లోని బర్ట్సేలో 

శిబిరం నిర్మించిన చైనా. ధ్వంసం చేసిన భారత బలగాలు.

2017: 73 రోజులపాటు డోక్లాం సంక్షోభం. భూటాన్‌ భూభాగంలో రోడ్డు నిర్మాణానికి చైనా యత్నం. భూటాన్‌కు దన్నుగా రంగంలోకి భారత బలగాలు. చర్చల తర్వాత ఉభయ బలగాల ఉపసంహరణ. రోడ్డు నిర్మాణం నిలిపివేత.

2018: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దును దాటి 400 మీటర్లు లోపలకు చొచ్చుకొచ్చిన చైనా బలగాలు. భారత్‌ రోడ్డు నిర్మించకుండా అడ్డుకునే యత్నం.


Updated Date - 2020-06-17T08:01:55+05:30 IST