‘దలైలామా వారసుని ఎంపికతో చైనాకు సంబంధం లేదు’

ABN , First Publish Date - 2021-05-16T02:10:46+05:30 IST

దలైలామా వారసుని ఎంపికతో చైనా ప్రభుత్వానికి ఎటువంటి

‘దలైలామా వారసుని ఎంపికతో చైనాకు సంబంధం లేదు’

న్యూఢిల్లీ : దలైలామా వారసుని ఎంపికతో చైనా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని ప్రవాస టిబెన్ ప్రభుత్వ తదుపరి ప్రెసిడెంట్ పెన్‌పా త్సేరింగ్ శనివారం చెప్పారు. చైనా కమ్యూనిస్టు నేతలకు మతం పట్ల విశ్వాసం లేదని, టిబెట్ ఆధ్యాత్మిక నేత వారసత్వం విషయం పూర్తిగా మతపరమైనదని తెలిపారు. టిబెట్‌కు జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అధిపతిగా పెన్‌పా త్సేరింగ్ శుక్రవారం ఎన్నికయ్యారు. 


తదుపరి దలైలామా ఎంపిక చైనా భూభాగంలో జరగాలని చైనా పట్టుబడుతోంది. ఈ అంశంలో భారత్ సహా ఇతరుల జోక్యం ఉండకూడదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పెన్‌పా త్సేరింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. టిబెటన్ బుద్ధిస్ట్ కాన్సెప్ట్‌లోనే తదుపరి దలైలామా ఎంపిక జరుగుతుందన్నారు. దలైలామా పునరవతారానికి ఆయన మాత్రమే బాధ్యులని తెలిపారు. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అధిపతిగా పెన్‌పా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 


ప్రస్తుత దలైలామా జూలైలో 86వ జన్మదినోత్సవం జరుపుకోబోతున్నారు. ఆయనకు వారసుని ఎంపిక జరగవలసి ఉంది. ఈ ఎంపిక 18వ శతాబ్దంనాటి గోల్డెన్ ఉర్న్ పద్ధతిలో జరగాలని చైనా పట్టుబడుతోంది. లాసాలోని గోల్డెన్ ఉర్న్ నుంచి ఎంపిక చేయాలంటోంది. దీనికి చైనా ప్రభుత్వ అనుమతి ఉండాలంటోంది. చైనా వాదనను ప్రస్తుత దలైలామా తోసిపుచ్చారు. 


Updated Date - 2021-05-16T02:10:46+05:30 IST