పాక్‌కు భారీగా ఆయుధాలు పంపుతున్న చైనా

ABN , First Publish Date - 2022-01-27T19:21:14+05:30 IST

ఆయుధాల విషయంలో భారత దేశంతో సరిసాటిగా పాకిస్థాన్‌ను నిలపాలని

పాక్‌కు భారీగా ఆయుధాలు పంపుతున్న చైనా

ఇస్లామాబాద్ : ఆయుధాల విషయంలో భారత దేశంతో సరిసాటిగా పాకిస్థాన్‌ను నిలపాలని చైనా తహతహలాడుతోంది. భారత దేశ రాకెట్ లాంఛర్లు, హోవిట్జర్ శతఘ్నులను దీటుగా ఎదుర్కొనేందుకు వెహికిల్ మౌంటెడ్ హోవిట్జర్లు, NORINCO AR-1 300 mm మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్లను సరఫరా చేస్తోంది. దాదాపు 512 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఈ కాంట్రాక్టులో భాగంగా ఇప్పటికే మొదటి దఫా చైనీస్ తయారీ వెహికిల్ మౌంటెడ్ హోవిట్జర్లు పాక్‌కు చేరుకున్నాయి. 


భారత దేశం వద్ద ఉన్న కే-9 వజ్ర హోవిట్జర్లను ఎదుర్కొనేందుకు చైనీస్ తయారీ వెహికిల్ మౌంటెడ్ హోవిట్జర్లను చైనా సరఫరా చేస్తోంది. భారతీయ రాకెట్ లాంఛర్లను ఎదుర్కొనేందుకు NORINCO AR-1 300 mm మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్లను సరఫరా చేస్తోంది. భారత్ తాజాగా రష్యా నుంచి సేకరించిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఎదుర్కొనేందుకు డీఎఫ్-17 హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థను సరఫరా చేయడానికి చైనా మొగ్గు చూపుతోంది. అదేవిధంగా సంప్రదాయ ఆయుధ వ్యవస్థలు, యుద్ధ విమానాలు, విధ్వంసకారులను సరఫరా చేస్తోంది. 


ఈ ఆయుధాల సరఫరా వెనుక చైనా అసలు లక్ష్యం  భారత్-పాక్ మధ్య శాశ్వత శత్రుత్వం కొనసాగాలన్నదేనని విశ్లేషకులు చెప్తున్నారు. పాకిస్థాన్ అణ్వాయుధ దేశంగా మారడంలో చైనా పాత్ర చాలా ఉందని, ఆయుధ వ్యవస్థలను రహస్యంగా సరఫరా చేస్తోందని, 1990వ దశకం నుంచి జరుగుతున్న ఈ వ్యవహారాలన్నీ నమోదై ఉన్నాయని అంటున్నారు. చైనా వ్యూహం ఫలిస్తోందని కూడా చెప్తున్నారు. భారత్ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించవలసి వస్తోందని అంటున్నారు. 


Updated Date - 2022-01-27T19:21:14+05:30 IST