న్యూఢిల్లీ: లద్దాఖ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఆత్మనిర్భరత స్ఫూర్తితో ముందుకెళుతోంది. ఇతర దేశాలు, ముఖ్యంగా చైనా దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే..2020 ఏడాదికి గాను భారతకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా తాజాగా అవతరించింది. భారత్‌కు ఇప్పటివరకూ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి ఈ స్థానాన్ని ఆక్రమించిందని వార్తా సంస్థ బ్లూమ్ బర్గ్ పేర్కొంది. గతేడాది ఇరు దేశాల మధ్య ఏకంగా 77.7 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. అంతకుమనుపు ఏడాదితో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ..వ్యాపారం పరంగా చైనా భారత్‌కు 2020లో అతిపెద్ద భాగస్వామిగా మారిందని సదరు వార్తా సంస్థ పేర్కొంది. యంత్ర సామాగ్రి కోసం భారత్ చైనాపై అధికంగా ఆధారపడటమే దీనికి కారణమని తెలుస్తోంది.