వేలాది మసీదులను ధ్వంసం చేసిన చైనా!

ABN , First Publish Date - 2020-09-25T21:56:24+05:30 IST

మానవ హక్కులకు చైనా ప్రభుత్వం వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదు. మతపరమైన సంప్రదాయాలను విడిచిపెట్టాలని ముస్లింలపై ఒత్తిడి తెస్తోంది.

వేలాది మసీదులను ధ్వంసం చేసిన చైనా!

బీజింగ్ : మానవ హక్కులకు చైనా ప్రభుత్వం వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదు. మతపరమైన సంప్రదాయాలను విడిచిపెట్టాలని ముస్లింలపై ఒత్తిడి తెస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో వేలాది మసీదులను చైనా అధికారులు ధ్వంసం చేశారు. 


వందలాది పవిత్ర స్థలాలు, స్టాటిస్టికల్ మోడలింగ్‌ను ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా పరిశీలించి రూపొందించిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదికను ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఏఎస్‌పీఐ) రూపొందించింది. 


ఈ నివేదిక ప్రకారం చైనాలోని జింజియాంగ్‌లో దాదాపు 16 వేల మసీదులను చైనా అధికారులు ధ్వంసం చేశారు. జింజియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. సుమారు 10 లక్షల మంది వీఘర్ ముస్లింలను ప్రత్యేక శిబిరాల్లో నిర్బంధించారు. సంప్రదాయాలు, మతాచారాలను వదిలిపెట్టాలని స్థానికులపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. 


గడచిన మూడేళ్ళలోనే దాదాపు 8,500 మసీదులను కూల్చారు. ఉరుంకి, కష్గర్ ప్రాంతాల్లో మరింత ఎక్కువ నాశనం చేశారు. 


ఇదిలావుండగా, ఈ ఆరోపణలను చైనా నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది. జింజియాంగ్ ప్రావిన్స్‌లో మత స్వేచ్ఛ సంపూర్ణంగా ఉందని చెప్తోంది. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌కు విశ్వసనీయత లేదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ సంస్థ చైనాకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. జింజియాంగ్‌లో 24 వేల మసీదులు ఉన్నాయని తెలిపింది. 


Updated Date - 2020-09-25T21:56:24+05:30 IST