Abn logo
Sep 9 2020 @ 01:32AM

హద్దు మీరుతున్న చైనా

చైనాతీరు రాను రాను తీవ్రంగా మారుతున్నది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారతదేశం పదే పదే సూచనలు చేస్తున్నప్పటికీ, శత్రుపూరితమైన ప్రకటనలతో ఘర్షణ వాతావరణాన్ని కొనసాగించడమే కాకుండా, పరిస్థితిని మరొక మెట్టు పైకి చేర్చడానికి కూడా చైనా ప్రయత్నిస్తున్నది. నలభై అయిదు సంవత్సరాల తరువాత సోమవారం నాడు భారత–-చైనా దేశాల సరిహద్దుల్లో. తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. గత జూన్ 15 నాడు గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల మృతికి, లెక్కతెలియని చైనా సైనికుల మరణానికి కారణమైన ఘర్షణలో కూడా తుపాకులను ఉపయోగించలేదు. 1975లో అప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న అరుణాచల్ప్రదేశ్‌లోని తులంగ్ లా లోయలో సరిహద్దు వద్ద చైనా సైన్యం మాటు వేసి కాల్పులు జరిపింది. ఆ దాడిలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన నలుగురు సైనికులు మరణించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా రెండు దేశాల మధ్య కాల్పుల సంఘటన ఏదీ జరగలేదు. చైనా సైనికులే దూకుడుగా జరిపిన సోమవారం నాటి కాల్పులలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.


తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట ప్యాంగ్యాంగ్ సో దక్షిణతీరంలోని భారత అధీనంలోని భూభాగంలోకి చొచ్చుకురావడానికి సోమవారం సాయంత్రం చైనా సైన్యం ప్రయత్నించింది. అక్కడి ఉద్రిక్తతల గురించిన పూర్తి వివరాలు ఆలస్యంగా అందుతున్నాయి. భారత్ నుంచే మొదటగా చొరబాటు, కాల్పులు జరిగాయని చైనా ఆరోపించింది. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది. చైనా ప్రజా విముక్తి సైన్యం పశ్చిమ కమాండ్ ఇచ్చిన ప్రకటన, తమ సొంత ప్రజలను, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశించిందని భారత్‌ సైన్యం తన ప్రకటనలో ఆరోపించింది. 


భారత్‌–-చైనా తూర్పు, పశ్చిమ సరిహద్దులు రెంటిలోనూ ఉద్రిక్తతలు విస్తరిస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్ గురించిన వివాదాస్పద ప్రకటనలు చైనా మళ్లీ మళ్లీ చేస్తున్నది. రష్యాలో భారత్‌–-చైనా రక్షణమంత్రుల మధ్య జరిగిన సమావేశం ఏమంత సుహృద్భావ వాతావరణానికి దారితీయలేదు. చైనా బలగాల మోహరింపు, కదలికలు జరుగుతూనే ఉన్నాయి. ఉభయదేశాల మధ్య ఉన్న 4 వేల కిలోమీటర్ల పొడవునా, తన గుప్పిట్లో ఉన్న కీలకప్రాంతాలు, తనవిగా చెప్పుకుంటున్న వివాదాస్పద ప్రాంతాల విషయంలో చైనా ఏ మాత్రం సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఒకవైపు చర్చల ప్రతిపాదనలు చేస్తూనే, భారత్ కూడా కొన్ని సైనిక, సైనికేతర నిర్ణయాలు తీసుకుంటున్నది. మరికొన్ని చైనా మొబైల్ అప్లికేషన్లను నిషేధించడం, కొత్త ఆయుధసామగ్రిని సమకూర్చుకోవడం, సుదూర లక్ష్యాల ఛేదనకు ఉపయోగపడే హైపర్‌ సోనిక్ వెహికల్ ప్రయోగం- వంటివన్నీ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను, ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడానికి, చైనాను హెచ్చరించడానికి ఉపయోగపడే చర్యలే.


స్థానికంగా సరిహద్దులలో జరిగే ఘర్షణలలో ఉభయదేశాల సైన్యానికీ సమానావకాశాలు ఉండవచ్చును కానీ, యుద్ధరంగం విస్తృతమైతే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సైన్యం సంఖ్య దగ్గర నుంచి, కొన్ని కీలక రంగాల దాకా చైనాకు ఆధిక్యం ఉన్నమాట నిజం. చైనాకు తోడుగా పాకిస్థాన్ పశ్చిమరంగంలో పోరాటానికి దిగుతుందేమోనన్న అనుమానాలు కూడా ఈ మధ్య వినిపిస్తున్నాయి. అదే జరిగితే కుడిఎడమల యుద్ధనిర్వహణలో కొన్ని పరిమితులు తప్పవు. నిజానికి, భారత్‌తో యుద్ధానికి దిగడంలో చైనాకు తక్షణ ప్రయోజనాలేమీ లేవన్న వాదన వినిపిస్తోంది. అయితే, అమెరికా భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో, అమెరికా–-చైనా మధ్య ఉన్న వాణిజ్య, ఆధిపత్య స్పర్థ భారత్ వైపు కూడా విస్తరిస్తోంది. భారత్-–అమెరికా కూటమితో తలపడే అవకాశం చైనా ప్రస్తుత నాయకత్వానికి ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి మావో ప్రతిష్ఠను సమకూరుస్తుందన్న వాదన కూడా ఉన్నది. భారతదేశం సోవియట్ అనుకూల దేశంగా ఉండినప్పటికీ, 1962 నాటి భారత-–చైనా ఘర్షణ వెనుక అమెరికా ప్రమేయం, ప్రచ్ఛన్న హస్తం ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. అమెరికాతో ఉన్న సాంప్రదాయ వైరం కొనసాగించి, నూతన జాతీయ ప్రతిష్ఠను సమకూర్చుకోవాలన్న జిన్ పింగ్ ప్రయత్నానికి భారత్ అవకాశాలు అందించకూడదని, సాధ్యమైనంత వరకు దౌత్యమార్గాలనే అనుసరించాలని శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు. 


అంతర్జాతీయ చిత్రపటంలో భారత్–చైనా మైత్రి ఉభయతారకమని ఎందరో విశ్లేషించారు. దురదృష్టవశాత్తూ, వలసపాలన కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు సమస్య, నూతన భౌగోళిక రాజకీయాల కారణంగా ఏర్పడ్డ ఉద్రిక్తతలు, చైనా అంతర్జాతీయ విస్తరణ వ్యూహానికి అనుగుణంగా ఉపయోగపడే వివాదాస్పద సరిహద్దులు- ఇవన్నీ కలిసి పరిస్థితిని దిగజారుస్తున్నాయి. ఉభయదేశాల మధ్య వైరం ఇద్దరికీ మంచిది కాదు. ఇటువంటి సందర్భాలలో అమెరికాను ఎంతవరకు నమ్మవచ్చునో మనకు తెలియదు. రష్యాకు చైనాతో ఎన్నో ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. భారత్ అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. రెచ్చగొట్టే చర్యలు ఎదురవుతాయి. సంయమనం, దూరదృష్టి కోల్పోకుండా వ్యవహరించడమే సరైన వ్యూహం.


యుద్ధమంటే పిల్లలాడుకునే డిజిటల్ వార్ గేమ్ కాదు. దేశాల, సమాజాల, మనుషుల వర్తమానాలు, భవితవ్యాలు ముడిపడి ఉండే తీవ్ర ఘట్టం. అట్లాగే, రాజకీయాలంటే పబ్జీలు, టిక్‌టాక్‌లు కావు. వాటిని నిషేధించి, ఒక యుద్ధ వాతావరణంలో శత్రువుకు ఏదో నష్టం కలిగిస్తున్నామనుకునే భావన మంచిది కాదు. గేమ్‌ల నిషేధం వల్ల కలిగే ఆర్థిక నష్టం ఎంతో తెలియదు కానీ, చైనా కంపెనీల, చైనా తయారీ సంస్థల వస్తువులు అనేక వందల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం చేస్తూనే ఉన్నాయి. వాటి నుంచి బయటపడడం అంత సులువు కాదు. భారత్ స్వావలంబన దిశగా ప్రయాణించడం కూడా పోటీ ఆటలు తయారుచేయడమంత ఈజీ కాదు. దేశీ శునకజాతులను పెంచడం లాంటిది కూడా కాదు. కాబట్టి, దేశాన్ని దృఢం చేయడానికి, చైనా వంటి శక్తిని ఎదిరించగలగడానికి నిజమైన, వాస్తవమైన ప్రయత్నాలు చేయవలసి ఉన్నది.

Advertisement
Advertisement
Advertisement