డ్రాగన్‌.. మరో డోక్లాం

ABN , First Publish Date - 2020-07-06T14:08:20+05:30 IST

తగవులమారి చైనా మరో కొత్త రాగం అందుకుంది. తన చుట్టుపక్కల దేశాలన్నింటినీ ఆక్రమించాలని చూసే డ్రాగన్‌ కన్ను తాజాగా భూటాన్‌ తూర్పు సరిహద్దు

డ్రాగన్‌.. మరో డోక్లాం

  • భూటాన్‌ తూర్పు సరిహద్దుతోనూ మాకు వివాదాలు
  • తగవులమారి చైనా కొత్త రాగం
  • సాక్‌టెంగ్‌ అభయారణ్యానికి నిధులపై కొర్రీ
  • ఇప్పటివరకూ చర్చల్లోనే లేని ప్రాంతమిది
  • అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులపై కన్ను 
  • భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పన్నాగం?

న్యూఢిల్లీ, జూలై 5: తగవులమారి చైనా మరో కొత్త రాగం అందుకుంది. తన చుట్టుపక్కల దేశాలన్నింటినీ ఆక్రమించాలని చూసే డ్రాగన్‌ కన్ను తాజాగా భూటాన్‌ తూర్పు సరిహద్దుపై పడింది. భారత్‌కు చెందిన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రకటనలో తమకు చాలాకాలంగా భూటాన్‌ పశ్చిమ, మధ్య, తూర్పు సరిహద్దులతో వివాదాలు నడుస్తున్నట్లు చైనా పేర్కొంది. మూడో పక్షం ఈ విషయంలో వేలు పెట్టకూడదంటూ పరోక్షంగా భారత్‌ గురించి ప్రస్తావించింది. భూటాన్‌లోని సాక్‌టెంగ్‌ వన్యప్రాణుల అభయారణ్యం తమ భూభాగంలోదేనని చైనా ఆరోపిస్తోంది. నిజానికి.. సాక్‌టెంగ్‌కు చైనాకు మధ్య దాదాపు 100కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన జెమీథాంగ్‌, తవాంగ్‌, ముక్తో ప్రాంతాలున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌కు సరిహద్దు అయిన సాక్‌టెంగ్‌ ప్రాంతాన్ని తనది అని చెప్పడం ద్వారా అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ భూభాగమనే రీతిలో చైనా ప్రకటన కనిపిస్తోంది. లద్దాఖ్‌లో పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్న భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే చైనా ఈ కొత్త పన్నాగం పన్నినట్లు భావిస్తున్నారు. 


వాస్తవమేంటి?

1984 నుంచి 2016 మధ్యలో భూటాన్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి 24సార్లు చర్చలు జరిగాయి. అందుకు సంబంధించిన వివరాలు, సమయంతో సహా భూటాన్‌ పార్లమెంటులో, ఇతర రికార్డుల్లో అధికారికంగా నమోదై ఉన్నాయి. ఈ అన్ని భేటీల్లోనూ కేవలం పశ్చిమ, మధ్య సరిహద్దుల గురిం చే చర్చ జరిగింది తప్ప.. తూర్పు సరిహద్దు గురించి చైనా ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. ఆ ఊసే ఎత్తలే దు. తనది కాని భూభాగాన్ని కూడా తనదేనని చెప్పుకొనే చైనా.. తూర్పు సరిహద్దు విషయంలో నిజంగా వివాదం ఉంటే.. అప్పట్లోనే మాట్లాడి ఉండేదని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. జకుర్‌లంగ్‌, పసంలంగ్‌ లోయ ప్రాంతాల్లోని 495 చదరపు కిలోమీటర్ల సరిహద్దు విషయంలో భూటాన్‌-చైనా చర్చిస్తూ వచ్చాయు. వివాదం సద్దుమణిగేందుకు చైనా భూటాన్‌కు ఒక ప్యాకేజీ ఆఫర్‌ కూడా ఇచ్చింది. దాని ప్రకారం.. మధ్య సరిహద్దులో పూర్తిగా, పశ్చిమ సరిహద్దులో కొద్దిగా తన భూభాగాన్ని చైనా వదులుకున్నందుకు డోక్లాంలో 100 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భూటాన్‌ ఇవ్వాలనేది చైనా డిమాండ్‌. ఈ విధంగా భారత్‌లో అతి సున్నితమైన సిలిగురి(ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు ఉన్న సన్నటి ప్రాంతం)పై దృష్టి పెట్టవచ్చనేది బీజింగ్‌ పన్నాగం. అయితే.. భారత్‌తోనే భూటాన్‌ నిలబడింది. 2017లో భూటాన్‌ కోసమే భారత్‌ డోక్లాంలో చైనాతో తలపడింది. భూటాన్‌ తూర్పు సరిహద్దు తమదేననడం ద్వారా, భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు బీజింగ్‌ యత్నిస్తున్నట్లు చెబుతున్నారు.


ఎక్కడ మొదలైంది?

ఈ నెల 2, 3 తేదీల్లో జరిగిన గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ కౌన్సిల్‌(జీఈఎఫ్‌) సమావేశంలో భూటాన్‌లోని సాక్‌టెంగ్‌ వన్యప్రాణుల అభయారణ్యానికి జీఈఎఫ్‌ నిధులు విడుదల చేయడాన్ని చైనా తప్పుబట్టింది. అది వివాదాస్పద తూర్పు సరిహద్దు భూభాగంలో ఉందని ఆరోపించింది. చైనా వాదనను భూటాన్‌ నిర్ద్వంద్వంగా ఖండించింది. అభయారణ్యం భూటాన్‌ అంతర్భాగమని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఎప్పుడూ.. ఆ భూభాగం విషయంలో చైనాకు, తమకు మధ్య చర్చలు రాలేదని గుర్తు చేసింది. జీఈఎఫ్‌ సైతం చైనా వాదనను పక్కన పెట్టి, భూటాన్‌ భూభాగంగా అభయారణ్యాన్ని గుర్తిస్తూ నిధుల్ని కేటాయించింది. అయితే.. బీజింగ్‌ ఒత్తిడి మేరకు, అభ్యంతరాన్ని మాత్రం నమోదు చేసుకుంది. చైనా కొత్తగా లేవనెత్తిన తూర్పు భూటాన్‌ వివాదం అర్థరహితమైనదని ‘ది భూటానీస్‌’ వార్తాపత్రిక సంపాదకుడు టెన్‌జింగ్‌ లంసంగ్‌ పేర్కొన్నారు. లద్దాఖ్‌లో ప్రధాని మోదీ పర్యటించిన మరుసటి రోజుకే చైనా ఈ వాదన లేవనెత్తడం గమనార్హం. సైనికుల ఎదుట ప్రసంగిస్తూ.. విస్తరణ వాదం తోక ముడవాలంటూ మోదీ చైనాకు చురకలంటించారు. ఆయన వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన చైనా.. అందుకు స్పందనగానే తాజా వివాదాన్ని తెరపైకి తెచ్చిందని భావిస్తున్నారు. చైనాకు మావో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విస్తరణ కాంక్షతో ‘ఐదు వేళ్ల ప్రణాళిక’ను రచించారు. దాని ప్రకారం.. టిబెట్‌ అరచేయి కాగా, లద్దాఖ్‌, నేపాల్‌, భూటాన్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లు దాని చుట్టూ ఉండే ఐదు వేళ్లు. ఇవన్నీ కూడా చైనాలో అంతర్భాగాలుగా మారాలనేది మావో ఆశయం. 




బలగాలు ప్రాణత్యాగాలకు సిద్ధం

మోదీ పర్యటనతో ధైర్యం : ఐటీబీపీ డీజీ

భారత సాయుధ బలగాల ఆత్మవిశ్వాసం శిఖరస్థాయిలో ఉందని, దేశరక్షణలో ప్రాణత్యాగాలకు వారు సిద్ధంగా ఉన్నారని ఇండోటిబెటన్‌ సరిహద్దు పోలీసు విభాగం(ఐటీబీపీ) డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) ఎస్‌ఎస్‌ దేస్వాల్‌ వెల్లడించారు. ఇటీవల ప్రధాని మోదీ లద్దాఖ్‌కు చేసిన పర్యటన, ప్రసంగం వారిలో ధైర్యాన్ని ఇనుమడింపచేశాయని ఆయన తెలిపారు. ‘‘జాతీయ నాయకత్వం, రాజకీయ నాయకత్వం, బలగాలు, జవాన్లు పూర్తిగా దేశానికి అంకితమయ్యారు. భారత సైన్యం, వాయుసేన, ఐటీబీపీ.. ఇలా అందరు జవాన్లలోనూ ధైర్యం తొణికిసలాడుతోంది.  దేశం కోసం ఎంతోమంది జవాన్లు గతంలో తమ ప్రాణాలను అర్పించారు. భవిష్యత్తులోనూ అలా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని దేస్వాల్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో ‘సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌-19 కేర్‌’ ఆస్పత్రి ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభమైన ఈ ఆస్పత్రికి ఒకేసారి 10వేల మంది రోగులకు చికిత్స అందించే సామర్థ్యం ఉంది. ఇక.. చైనా దురాక్రమణకు దీటుగా బదులివ్వాలన్న భారత సంకల్పాన్ని మోదీ పర్యటన చాటి చెప్పిందని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లనే పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలు బలగాల్లో స్ఫూర్తిని నింపడమే కాక, చైనాకు హెచ్చరికలా వెళ్లాయని వివరించారు. చైనా శాంతియుతంగా వెనక్కి వెళ్లదని, భారత్‌ తనకున్న ఆర్థిక, దౌత్య మార్గాలను ఉపయోగించుకుని చైనాను దెబ్బకొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.  


Updated Date - 2020-07-06T14:08:20+05:30 IST