ఆ కండీషన్‌కు ఓకే అంటే చర్చల్లో సంతోషంగా పాల్గొంటాం: చైనా

ABN , First Publish Date - 2020-07-09T00:11:26+05:30 IST

అమెరికా అణ్వాయుధాల సంఖ్య చైనా స్థాయికి చేరుకుంటేనే అగ్రరాజ్యంతో సంతోషంగా ఆయుధ నియంత్రణ చర్చల్లో పాల్గొంటామని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆ కండీషన్‌కు ఓకే అంటే చర్చల్లో సంతోషంగా పాల్గొంటాం: చైనా

బీజింగ్: అమెరికా అణ్వాయుధాల సంఖ్య చైనా స్థాయికి చేరుకుంటేనే అగ్రరాజ్యంతో సంతోషంగా ఆయుధ నియంత్రణ చర్చల్లో పాల్గొంటామని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయుధ సంపత్తి తగ్గింపుపై  అమెరికా, రష్యాతో చైనా కూడా చర్చలు జరపాలంటూ అగ్రరాజ్యం కోరిన నేపథ్యంలో కమ్యునిష్టు దేశం ఈ విధంగా స్పందించింది. చైనా స్థాయికి అమెరికా అణ్వాయుధాల సంఖ్య తగ్గితే చర్చల్లో పాల్గొనేందుకు తమకూ సంతోషమేనని తెలిపింది. అమెరికా వద్ద దాదాపు 5800 అణ్వాయుధాలు ఉన్నాయని చైనా విదేశాంగ శాఖకు చెందిన ఆయుధాల నియంత్రణ డిపార్టెమెంట్ చీఫ్ ఫూ కాంగ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇది చైనా ఆయుధ సంపత్తికి 20 రెట్లతో సమానమని వ్యాఖ్యానించారు. 


అణ్వాయుధాల నియంత్రణ కోసం అమెరికా, రష్యాలు ‘స్టార్ట్’ పేరిట గతంలో ఓ ఒప్పందంపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం అమలు కోసం మొదటి నుంచీ అగ్రరాజ్యమే చొరవ చూపిస్తోంది. అయితే దీని కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. దీంతో ఈ ఒప్పందంలో చైనా కూడా భాగస్వామి కావాలంటూ అగ్రరాజ్యం పలు మార్లు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే చైనా ఇలా కొత్త మెలిక పెట్టింది. అమెరికా ఆయుధ సంపత్తి చైనాతో సమానమైనప్పుడే చర్చల్లో సంతోషంగా పాల్గొంటామని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-07-09T00:11:26+05:30 IST