ఆకాశహర్మ్యాల నిర్మాణంపై చైనా నిషేధం!

ABN , First Publish Date - 2021-07-08T22:50:10+05:30 IST

ఐదు వందల మీటర్ల కంటే ఎత్తుండే ఆకాశహర్మ్యాలను నిర్మించకూడదంటూ చైనా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి ప్రాజెక్టుల నాణ్యత విషయంలో పలు ఆరోపణలు వస్తుండటంతో, ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆకాశహర్మ్యాల నిర్మాణంపై చైనా నిషేధం!

న్యూఢిల్లీ: ఐదు వందల మీటర్ల కంటే ఎత్తుండే ఆకాశహర్మ్యాలను నిర్మించకూడదంటూ చైనా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి ప్రాజెక్టుల నాణ్యత విషయంలో పలు ఆరోపణలు వస్తుండటంతో, ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా..  250 మీటర్ల ఎత్తుకు పైబడిన భవనాల నిర్మాణానికి కూడా వీలైనంత తక్కువగా అనుమతులు ఇవ్వాలని  చైనా పట్టణాభివృద్ధి సంస్థ అక్కడి అధికారులకు సూచించింది. 500 మీటర్ల ఎత్తున్న భవనాలు చైనాలో కేవలం పది మాత్రమే ఉన్నాయి.  అక్కడి ఆకాశహర్మ్యాల్లో ఒకటైన షెన్‌జెన్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ ప్లాజా భూకంపానికి లోనైనట్టు ఇటీవల తెగ ఊగిపోవడం స్థానికంగా కలకలం రేగింది. భవంతి కూలిపోతుందేమోననే భయంతో ప్రజలు అటూ ఇటూ పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి వీడియోలు చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా.. ప్రభుత్వం అప్పటికప్పుడు ఆ భవంతిలో ఉన్న వారిని మరో చోటకు తరలించాల్సి వచ్చింది. కాగా..నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో చైనాలో అప్పుడప్పుడూ బహుళ అంతస్తుల భవనాలు కూలిపోతుంటాయని స్థానిక మీడియా చెబుతోంది. వేగంగా పట్టణీకరణ చేపట్టాలన్న తొందరలో ప్రభుత్వం భవంతుల నిర్మాణానికి సంబంధించిన నిబంధనల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-07-08T22:50:10+05:30 IST