మీరు ఇంకా వెనక్కి వెళ్లండి

ABN , First Publish Date - 2020-08-08T08:09:42+05:30 IST

భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది, తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ప్రతిష్టంబనను మొదలుపెట్టిందీ చైనాయే. అంటే.. తను దురాక్రమించిన భూభాగం నుంచి ఆ దేశమే వెనక్కి తగ్గాల్సి ఉంటుంది...

మీరు ఇంకా వెనక్కి వెళ్లండి

  • మేము కూడా ఫింగర్‌-8 దగ్గరకు వెళ్లిపోతాం
  • చర్చల్లో చైనా కొత్త బేరం..  వెనక్కి తగ్గం:  భారత్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది, తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ప్రతిష్టంబనను మొదలుపెట్టిందీ చైనాయే. అంటే.. తను దురాక్రమించిన భూభాగం నుంచి ఆ దేశమే వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. కానీ.. అది వదిలేసి తాజాగా మరో కొత్త బేరం మొదలుపెట్టింది డ్రాగన్‌. ఇటీవల జరిగిన కమాండర్‌ స్థాయి సమావేశంలో కొత్త పాట అందుకుంది. రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. భారత్‌ దశాబ్దాలుగా ఉంటున్న గోగ్రా, ఫింగర్‌-3 శిబిరాలనుంచి మరింత వెనక్కి తగ్గాలని చైనా కోరింది. అలా చేస్తే తాము కూడా భారత్‌ కోరినట్లుగా పాంగాంగ్‌ సో నది వద్ద ఫింగర్‌-4 నుంచి ఫింగర్‌-8కు వెళ్లిపోతామని చెప్పింది. ఫింగర్‌-3 వద్ద ఉన్న ధన్‌సింగ్‌ థాపా పోస్టు సంప్రదాయ భారత సైనిక శిబిరమే కాక, పూర్తిగా భారత భూభాగంలోనిది. గోగ్రా కూడా భారత్‌దే. ఈ నేపథ్యంలో... తనే దురాక్రమించి భారత్‌ను వెనక్కి వెళ్లమంటున్న చైనా జిత్తులు తమకు తెలియనివి కావని రక్షణ శాఖ అధికారి ఒకరు వివరించారు.


చైనా విజ్ఞప్తిని భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు. భారత్‌ ఒక అడుగు కూడా వెనక్కి వేయదన్న సంగతిని చైనా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. భారత బలగాలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే స్పష్టం చేశారు. అసోంలోని తేజ్‌పూర్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కమాండర్లకు ఆయన పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. లఖ్‌నవూలోని కేంద్ర కమాండ్‌లో కూడా ముకుంద్‌ సమీక్ష నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు వెంబడి భారత సైన్యం సన్నద్ధతను ఆయన పరిశీలించారు. ఎల్‌ఏసీ వెండి భారత్‌లోకి చైనా చొచ్చుకొచ్చిన పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత సున్నితంగా ఉందని, ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని బలగాలకు ముకుంద్‌ సూచించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2020-08-08T08:09:42+05:30 IST