మిరప రైతు నష్టం 11వేల కోట్లు

ABN , First Publish Date - 2022-01-12T08:17:57+05:30 IST

ఎర్రబంగారంగా పిలిచే మిరప పంటను ఈ ఏడాది తామరపురుగు తొలిచేసింది.

మిరప రైతు నష్టం 11వేల కోట్లు

  • మిరపను తొలిచిన తామర పురుగు.. 
  • దాని దెబ్బకు రాష్ట్రంలో మిర్చి రైతు గుల్ల
  • ఎకరానికి క్వింటా దిగుబడి కూడా కష్టమే
  • ప్రభుత్వం ఆదుకోకుంటే ఈ ఏడాది రైతు ఆత్మహత్యలు పెరుగుతాయని ఆందోళన

ఖమ్మం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఎర్రబంగారంగా పిలిచే మిరప పంటను ఈ ఏడాది తామరపురుగు తొలిచేసింది. ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల దాకా రావాల్సిన దిగుబడులు.. ఆ పురుగు దెబ్బకు పూర్తిగా పడిపోయాయి. తామరుపురుగు కాత, పూతను తినేయడం, ఆకులో రసాన్ని పీల్చేయడంతో పచ్చగా కళకళలాడాల్సిన మిర్చి తోటలు ఇప్పుడు కాయలు లేకుండా వెలవెలబోతున్నాయి. నిరుడు మిర్చికి ధర బాగా రావడంతో చాలామంది ఈసారి పత్తి సాగు తగ్గించి మిర్చి పంటవేశారు. సగటున ఎకరానికి 25క్వింటాళ్ల దిగుబడి వస్తే క్వింటాకు రూ.15వేల చొప్పున రూ.3,75,000 దాకా రాబడి ఉంటుందని అంచనా వేసి ఎకరానికి రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టారు. ఈ లెక్క ప్రకారం.. సాగు చేస్తున్న నాలుగు లక్షల ఎకరాలకూ కలిపి దాదాపు రూ.15 వేల కోట్ల దాకా రాబడి రావాల్సి ఉంది. అందులో పెట్టుబడి రూ.4 వేల కోట్లు పోగా.. రూ.11 వేల కోట్ల మేర రైతుల జేబుల్లోకి రావాలి. కానీ తామరపురుగు దెబ్బకు ఎకరానికి క్వింటా దిగుబడి మాత్రమే వస్తుండటంతో రావాల్సిన ఆదాయం రాకపోగా.. పెట్టిన పెట్టుబడినే కోల్పోయే పరిస్థితి. ఇప్పటిదాకా అలా రైతులు సుమారు రూ.2500 కోట్లకుపైగా పెట్టుబడి సొమ్మును కోల్పోయినట్టు అంచనా. ముఖ్యంగా కౌలు రైతులు నిండా మునిగారు. గతంలో మామూలు వైరస్‌ తెగులు, ఆకుముడత వచ్చినా క్రిమిసంహారక మందులతో తోటలు కోలుకుని కాసేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. తామరపురుగును అంతం చేసేందుకు జిగురు అట్టలు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. మిర్చి సాగుచేస్తున్న ప్రతి జిల్లాలో 60-70% తోటలు తామరపురుగు దెబ్బకు వెలవెలబోతున్నాయి. తామరపురుగు తినేసిన తర్వాత అక్కడక్కడ మిగిలినకాయలను రైతులు పరిగ ఏరినట్టు ఏరుతున్నారు. దీంతో ఎకరానికి క్వింటా నుంచి మూడు క్వింటాళ్ల మేర మాత్రమే దిగుబడులు వస్తున్నాయి. ఎక్కువ శాతం తోటల్లో క్వింటా మేర మాత్రమే దిగుబడి వస్తున్నట్టు చెబుతున్నారు.  

రెట్టింపు సాగు..

గత ఏడాది తెలంగాణలో 2.40లక్షల ఎకరాల్లో మిర్చిసాగుకాగా 5.52లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. సాగు పెరగడంతో ఉత్పత్తి కూడా రెట్టింపవుతుందని భావించినా.. తామరపురుగు కారణంగా దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడిజిల్లాలతోపాటు నల్గొండ జిల్లాలోని కొంతప్రాంతం, తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో మిర్చి సాగుచేయడం ఆనవాయితీ. కిందటి సంవత్సరం మిర్చి ధర క్వింటాకు రూ.20 వేల దాకా పలకడంతో ఈ ఏడాది అదే పరిస్థితి ఉంటుందని సాగును కూడా రెట్టింపు చేశారు.  మొక్కల కాతపూత దశ నుంచే తామరపురుగు దాడిచేయడంతో.. పంటలు నాశనమయ్యాయి.  ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలామంది రైతులు మిర్చి తోటల్ని ట్రాక్టర్లతో దున్ని మొక్కజొన్న వేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ తామరపురుగు తెలంగాణతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిసా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా మిర్చి తోటలను తినేసింది. క్రిమిసంహారక మందులు ఎన్ని కొట్టినా చావని పరిస్థితి. దీంతో రైతులు కష్టాలు, నష్టాలపాలవుతున్నారు. మిర్చి రైతులను ప్రభు త్వం ఆదుకోకపోతే.. ఆత్మహత్యలు  పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఖమ్మం జిల్లాలోనే ఈమధ్య కాలంలో ఐదుగురు మిర్చి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పలువురు రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారు.

రెండు లక్షలు పెట్టుబడి పెడితే..

రెండు ఎకరాల్లో మిర్చి వేసి.. రెండులక్షలపైగా పెట్టుబడి పెట్టా. కానీ తామరపురుగు కారణంగా రెండెకరాలకూ కలిపి మూడు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఉన్న కాయ కూడా తాలవుతోంది. ఎన్ని పురుగుమందులు కొట్టినా ఈ తామరపురుగు చావలేదు. పూతతోపాటు రసంకూడా పీల్చేయడంతో ఎదుగుబొదుగు లేకుండా తోట మోడుబారింది. చివరకు జిగురు అట్టలకైతే తామరపురుగు అంటుకుని చచ్చిపోతుందని చెబితే పొలంలో జిగురు అట్టలుకూడా పెట్టాం. అయినా పురుగు చావలేదు. పదేళ్లుగా మిర్చి సాగుచేస్తున్నా. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. 

- కోలేటి మోహన్‌రావు, చింతకాని మండలం జగన్నాథపురం

ఎకరన్నర తోట పోయింది

నేను కౌలు రైతును. ఎకరానికి రూ.30వేలు పెట్టి మిర్చి వేశా. ఎకరన్నర మీద రూ.లక్షన్నర దాకా పెట్టుబడి పెట్టా. పంటను తామరపురుగు తినేసింది. కిందటి సంవత్సరం ఎకరానికి 25 క్వింటాళ్లు పండిస్తే ఇప్పుడు 3క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కూలీలను పెట్టి కాయలు కోయిస్తున్నా.. కోతకూలీ కూడా వస్తుందో రాదోనన్న భయం ఉంది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

- చిర్రా రామకృష్ణ, చింతకాని మండలం జగన్నాథపురం

మూడెకరాలు..  పోయింది

తామరపురుగు దెబ్బకు మూడెకరాల్లో మిర్చి తోట పనికిరాకుండా పోయింది. మూడు లక్షలు పెట్టుబడి పెట్టా. ఎప్పుడూ లేని విధంగా తామరపురుగు తోటపై పడి తినేసింది. ఎన్నో మందులు కొట్టాం. ఫలితంలేదు. చేసేదిలేక తోటనే వదిలేశా.

- రాయల అనంతరామయ్య, కొణిజర్ల, మిర్చిరైతు

ఆదాయంపైనా ప్రభావం..

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గత ఏడాది 20 లక్షల క్వింటాళ్ల మిర్చి అమ్మకాలు, కొనుగోలు జరగ్గా ప్రస్తుతం ఏసీ గోదాములన్నీ ఖాళీ అయ్యాయి. ఏసీ గోదాం లో 30 లక్షల బస్తాల వరకూ ఉండగా అన్నీ కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో దిగుబడి బాగా తగ్గిపోవడంతో మిర్చికి భారీగా డిమాండ్‌ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో పండే మిర్చికి రంగు, రుచి, ఘాటు ఎక్కువ ఉండటంతో దేశ, విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. తెలంగాణలో పండే మిర్చి.. చైనా, బ్యాంకాక్‌, మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, థాయిలాండ్‌ తదితర దేశాలకు ఏటా ఎగుమతి అవుతుంది. తద్వారా రూ.వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. ఈసారి తామరపురుగు దెబ్బ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలపైనా ప్రభావం చూపబోతోంది.

Updated Date - 2022-01-12T08:17:57+05:30 IST