పిల్లలకూ టీకా!

ABN , First Publish Date - 2021-12-26T06:51:42+05:30 IST

కొత్త సంవత్సరంలో పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్లు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పలురకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధులకు,..

పిల్లలకూ టీకా!

వ్యాధులున్న వృద్ధులకు బూస్టర్‌ డోస్‌

వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకూ

15 ఏళ్లు దాటిన పిల్లలకు 3 నుంచి, 

వృద్ధులకు, వైద్య సిబ్బందికి 10 నుంచి

కొత్త సంవత్సరంలో వ్యాక్సినేషన్‌ విస్తరణ

దేశ ప్రజలకు వాజ్‌పేయీ జయంతి కానుక 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

శనివారం రాత్రి అనూహ్యంగా

జాతినుద్దేశించి ప్రసంగం

త్వరలో నేజల్‌, డీఎన్‌ఏ వ్యాక్సిన్లు

ఒమైక్రాన్‌కు భయపడొద్దని విజ్ఞప్తి


న్యూఢిల్లీ, డిసెంబరు 25: కొత్త సంవత్సరంలో పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్లు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పలురకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధులకు, వైద్య రంగంలోని వారు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఇస్తామన్నారు. శనివారం రాత్రి ఆయన అనూహ్యంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి, క్రిస్మస్‌ పండుగ కలిసి వచ్చిన పవిత్రమైన రోజున ఈ కీలక ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమైక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ భారతదేశంలోనూ వ్యాపించిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సిన్ల కార్యక్రమాన్ని భారీగా విస్తరించింది. 15-18 ఏళ్ల మధ్య వయస్సు 


పిల్లలందరికీ (దాదాపు 10 కోట్ల మంది ఉంటారు)జనవరి 3 నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. జనవరి 10 నుంచి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధులకు, వైద్య రంగంలోని వారు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్లు వేస్తామన్నారు. శాస్త్రవేత్తలు సమగ్రంగా పరీక్షలు చేశాకే బూస్టర్‌ డోస్‌కు అనుమతి ఇచ్చారని ప్రధాని ప్రకటించారు. ఎప్పుడు ఏ డోసు తీసుకోవాలో మన శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయించారని చెప్పారు. దాన్ని తాను ఇప్పుడు వెల్లడిస్తున్నానన్నారు. పలు రకాల వ్యాధులతో బాధ పడుతున్న వృద్ధులు వైద్యుల సలహా అనంతరమే బూస్టర్‌ డోసు తీసుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. గత ఏడాది జన,వరి 16 నుంచి భారతదేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైంది. ఏడాది పూర్తవుతున్న తరుణంలో పిల్లల వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ గురించి భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని చెప్పారు. దేశంలో వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం అయ్యాయన్నారు. అయితే, కొవిడ్‌తో ముప్పు తొలగిపోలేదని, ఇప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసొలేషన్‌ బెడ్లు, ఐదు లక్షల ఆక్సిజన్‌ బెడ్లు, లక్షన్నర ఐసీయూ బెడ్లు, 90 వేల చిన్నపిల్లల పడకలు సిద్ధం చేసి ఉంచామని చెప్పారు. ఆసుపత్రుల్లో మూడు వేల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, 4 లక్షల ఆక్సిజన్‌ సిలిండర్లు సిద్ధం చేశామన్నారు. కొద్ది కాల వ్యవధిలోనే ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేశామని ప్రస్తావించారు. త్వరలోనే దేశంలో ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌, డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. భారత శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిపై యుద్ధం లో భాగంగా నిరంతర పరిశోధనలు చేస్తున్నారని మోదీ కొనియాడారు. ప్రజలంతా కొత్త సంవత్సరాన్ని ఆశాభావంతో కూడిన సంబరాలతో ఆహ్వానిస్తున్న సందర్భంగా కొవిడ్‌ వ్యాప్తి గురించి మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌ మన ప్రధాన ఆయుధాలని చెప్పారు. 

Updated Date - 2021-12-26T06:51:42+05:30 IST