నాకు పిల్లలు లేరు.. అందుకే ఇలా చేస్తున్నా.. స్కూల్లో విద్యార్థుల కోసం ప్రతీరోజూ ఈ టీచర్ చేస్తున్న పనేంటంటే..

ABN , First Publish Date - 2022-08-06T16:30:13+05:30 IST

విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు...

నాకు పిల్లలు లేరు.. అందుకే ఇలా చేస్తున్నా.. స్కూల్లో విద్యార్థుల కోసం ప్రతీరోజూ ఈ టీచర్ చేస్తున్న పనేంటంటే..

విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం  చెబుతుంటుంది. ఈ మేరకు పిల్లల విద్యాభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలను పలు పథకాలకు వెచ్చిస్తుంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థ ఇప్పటికీ అధ్వాన్నంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ విద్యా వెలుగులు నింపుతున్న కొందరు ఉపాధ్యాయులు ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారు.  మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఇలాంటి ఉదంతం కనిపించింది. 


ఒక మహిళా టీచర్ ప్రతి రోజూ 17 మంది పిల్లలను తన ఇంటి నుంచి స్కూటీపై స్కూలుకు తీసుకువస్తుంటారు. దీంతో ఆమెను స్థానిక చిన్నారులంతా స్కూటీ వలీ మేడమ్ అని పిలుస్తుంటారు. నిజానికి జిల్లాలోని భైందేహి పరిధిలోని ధుదియా మారుమూల ప్రాంతం. ఇక్కడి నుంచి పాఠశాలకు 2 కిలో మీటర్ల దూరం. రవాణా సౌకర్యం లేకపోవడంతో పిల్లలు కాలినడకన బడికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో చాలా మంది పిల్లలు బడికి వెళ్లడం మానేశారు. ఫలితంగా ఆ పాఠశాల మూతపడే దశకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయురాలు అరుణా మహాలే చొరవచూపి పాఠశాలను మూతపడకుండా చూశారు. స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలను ఇంటి నుంచి స్కూటీపై పాఠశాలకు తీసుకెళ్లడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె 17 మంది పిల్లలను పాఠశాలకు తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో పిల్లల సంఖ్య 85. 


తాను చేస్తున్న పని గురించి అరుణా మహాలే మీడియాతో మాట్లాడుతూ..‘ నా పేరు అరుణా మహాలే. నేను భైందేహి పరిధిలోని ధుదియా గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. నేను 7 సంవత్సరాల క్రితం ఇక్కడ చేరినప్పుడు, ఇక్కడ 10 మంది పిల్లలు చదువుకునేవారు. ఇక్కడి పరిస్థితుల కారణంగా పిల్లలు బడికి రావడం మానుకుంటున్నారని స్థానికులు తెలిపారు. క్రమంగా ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. స్కూల్ మూతపడే దశకు చేరుకుంది. నేను ఈ పరిస్థితిని చూడలేకపోయాను. అది మొదలు పిల్లల్ని వాళ్ల ఇంటి నుంచి స్కూటీ మీద స్కూలుకు తీసుకురావడం మొదలుపెట్టాను. స్కూటర్‌పై ఒకసారి నలుగురు పిల్లలు మాత్రమే కూర్చోబెట్టుకుని తీసుకువస్తాను. నాలుగు రౌండ్లు తిరిగేందుకు ప్రయత్నిస్తాను. దీంతో మరింత మంది పిల్లలను పాఠశాలలకు చేర్చే అవకాశం ఉండేది. మెల్లగా నా ప్రయత్నాలు ఫలించడం ప్రారంభించాయి. నన్ను చూసి కొంతమంది పిల్లల కుటుంబాలు తమ ఇరుగుపొరుగు పిల్లల్ని కూడా స్కూల్‌కి తీసుకురావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పాఠశాలలో 85 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ పాఠశాల మూసివేత నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నేను నా డబ్బుతో స్కూటీ ట్యాంక్‌ని వారానికి రెండుసార్లు నింపుతాను. నాకు పిల్లలు లేరు. స్కూల్ పిల్లలే నా సొంత పిల్లలు. ఉపాధ్యాయురాలు అరుణ పాఠశాలలో మరో అసిస్టెంట్ టాచర్‌ను నిమమించుకున్నారు. ఆమె తన జీతం నుండి కొంత మొత్తాన్ని ఆమెకు చెల్లిస్తుంటారు. పాఠశాలలోని పిల్లల దగ్గర రబ్బరు, పెన్సిల్, కాపీ పుస్తకాలు లేకపోత వారికి అవి అందజేస్తుంటారు. స్థానికంగా ఉంటున్న రూపా బామ్నే మాట్లాడుతూ నేటి కాలంలో ఇలాంటి గురువు దొరకడం అరుదు. సమాజంలో ఇలాంటి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ఉంటే ఏ ఒక్క పిల్లాడూ చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉండదన్నారు. 



Updated Date - 2022-08-06T16:30:13+05:30 IST