బక్కచిక్కుతున్న భావితరం

ABN , First Publish Date - 2020-02-20T09:00:31+05:30 IST

కంటిచూపును మెరుగుపరచే ‘ఏ’ విటమిన్‌ కరవు! శరీరంలోని నాడులను, రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచే బీ-12 విటమిన్‌ కరవు!!

బక్కచిక్కుతున్న భావితరం

  • రాష్ట్రంలోని విద్యార్థుల్లో పోషకాహార లోపం
  • 32 శాతం మందికి రక్తహీనత సమస్య
  • సగటున 18.2% మందికి బీ-12 లోపం
  • ఏ విటమిన్‌ లోపం గలవారు 27 శాతం
  • వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేక అవస్థలు
  • 2016-18 సీఎన్‌ఎన్‌ఎ్‌స సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): కంటిచూపును మెరుగుపరచే ‘ఏ’ విటమిన్‌ కరవు! శరీరంలోని నాడులను, రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచే బీ-12 విటమిన్‌ కరవు!! అసలు శరీరం మొత్తానికీ ప్రాణవాయువును అందించే రక్తమూ తక్కువే! వెరసి.. రాష్ట్రంలోని చిన్నారులు, విద్యార్థులు తీవ్ర పోషకాహార లోపంతో.. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగక పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. లెక్కల్లో చెప్పాలంటే.. ఏడాది నుంచి 19 ఏళ్ల వయసున్న ప్రతి వంద మందిలో సగటున 32ు మంది.. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సగటున 27 శాతం మందికి ఎ విటమిన్‌ లోపం ఉండగా.. 18.2 శాతం మంది బి-12 విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారు. దేశ వ్యాప్తంగా చిన్నారులు, కౌమారదశ పిల్లలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు, పోషకాహర లోపం, పరిసరాల ప్రభావంపై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ సహ కారంతో యునిసెఫ్‌, పాపులేషన్‌ కౌన్సిల్‌ 2016-18 వరకు సంయుక్తంగా ‘సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎ్‌స)’ చేపట్టాయి. హైదరాబాద్‌ తార్నాకలోని ‘నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌)’లో  ఆ సర్వే నివేదికను బుధవారం విడుదల చేశారు. చిన్నారులకు బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నామని పాలకులు ఎన్ని గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఈ నివేదికలోని గణాంకాలు బట్టబయలు చేశాయి. అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలు కేటాయిస్తూ అన్ని వర్గాల విద్యార్థుల శారీరక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు కాగితాల్లో లెక్కలు చూపిస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో పిల్లలు, విద్యార్థులు పోషకాహారలోపంతో బాధపడుతూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ, నగరాల్లో కూడా పోషకాహార లోపం సమస్య అధికంగా ఉండడంతో భావిభారత పౌరుల ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారుతోంది. పరిసరాల ప్రభావం, తీసుకునే పోషకాహారంపై కనీస అవగాహన కొరవడడంతో సరైన తిండి తినక.. చాలా మంది పిల్లలు తమ వయసుకు తగినట్టుగా ఎత్తు, బరువు పెరగట్లేదు. మరికొందరు చిరుప్రాయంలోనే మధుమేహం, గుండెజబ్బుల ముప్పును ఎదుర్కొంటున్నారు. 


భారతదేశంలో అతిపెద్ద సర్వే..


అన్ని రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో చేపట్టిన ఈ సర్వే.. దేశంలోనే అతిపెద్ద సర్వే. ఇందులో భాగంగా.. దేశంలోని 0-19 ఏళ్ల వయసు కలిగిన పిల్లలను మూడు కేటగిరీలుగా (0 నుంచి 5 ఏళ్లు, 5-9 ఏళ్లు, 10-19 ఏళ్లుగా) విభజించి వివిధ అంశాలపై సర్వే చేపట్టారు. 2500 మంది సర్వే అధికారులు, 200 మంది సమన్వయకర్తలు దేశవ్యాప్తంగా 1,12,316 మందిని కలుసుకుని వారి శారీరక అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించి నివేదిక రూపొందించారు. 1,12,316 మంది నుంచి రక్త, మల, మూత్ర నమూనాలను సేకరించి వైద్యపరీక్షలు నిర్వహించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. గతంలో నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పోష కాహార సమస్య అధికంగా ఉండగా.. నగరాలు, పట్టణాల్లోనూ ఈ సమస్య ఉన్నట్టు తాజా సర్వేలో తేలింది. ఇక.. తెలంగాణలో 2016 ఫిబ్రవరి 26 నుంచి జూలై 24 వరకూ మూడు కేటగిరీల్లోని 3024 పిల్లలు, విద్యార్థులపై సర్వే చేపట్టారు. ఈ సర్వే నివేదికలోని ముఖ్యాంశాలు.


సమస్య 1-4 5-9 10-19 

ఏళ్లు ఏళ్లు ఏళ్లు

(అంకెలన్నీ శాతాల్లో)

రక్తహీనత 37.8 27.2 32.1

ఫోలేట్‌ లోపం 46.8 45.8 63.7

బి12 లోపం 12.4 13.2 29.1

డి విటమిన్‌ లోపం 9.6 5.5 8.8

ఎ విటమిన్‌ లోపం 26.5 35.0 19.7

జింక్‌ లోపం 10.1 9.3 27.9

సమస్య 5-9 10-19 

ఏళ్లు ఏళ్లు

అధిక కొలెస్ట్రాల్‌ 0.8 1.4

అధిక ట్రైగ్లిజరైడ్‌లు 21.9 12.4

అధిక సీరమ్‌ 23.6 24.3

క్రియాటినైన్‌

Updated Date - 2020-02-20T09:00:31+05:30 IST