చలించిన చిన్నారులు.. పెద్దమసస్సుతో సాయం!

ABN , First Publish Date - 2021-05-25T18:10:18+05:30 IST

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేస్తోంది.

చలించిన చిన్నారులు.. పెద్దమసస్సుతో సాయం!

  • చిట్టి చేతుల ఆశీర్వాదం.. 
  • ఐసొలేషన్‌లో ఉన్న వారికి భోజనం అందజేత
  • ఏడు నుంచి ఇంటర్‌.. చదివే విద్యార్థుల ఔదార్యం 
  • పిల్లల ఆలోచనకు పెద్దల చేయూత


కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేస్తోంది. కొవిడ్‌ బారిన పడిన పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో చాలా మంది చికిత్సతో పాటు కనీస అవసరాల కోసం అవస్థలు పడుతున్నారు. ఆపత్కాలంలో అలాంటి వారికి చేయందించేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. కొందరు చిన్నారులు కూడా పెద్ద మనసు చాటుకుంటున్నారు. 


హైదరాబాద్ సిటీ/బౌద్ధనగర్‌ : కొవిడ్‌ బారిన పడి హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వారి బాధలు చూసి ఆ చిన్నారులు చలించారు. వయస్సుకు చిన్నవారైనా పెద్దమసస్సుతో వారికి ఏదైనా చేయాలని తపన పడ్డారు. ఆహారం పంపిణీ చేయాలని నిర్ణయించుకుని పెద్దలకు చెప్పారు. వారు కూడా పచ్చజెండా ఉపారు. తమ ఇంటికి పెట్టుకున్న పేరుతో ఆహార పంపిణీకి పెట్టారు. కేవలం ఓ కుటుంబం ‘ఆశ్వీరాద్‌ అమ్మచేతి ముద్ద’తో కొవిడ్‌ బారిన పడి హోమ్‌ ఐసొలేషన్‌ ఉన్నవారికి నగరంలోని వివిధ ప్రాంతాల వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేసే కార్యక్రమానికి నడుంచుట్టారు.


సికింద్రాబాద్‌ నియోజకవర్గం బౌద్ధనగర్‌ డివిజన్‌లో జామై ఉస్మానియాలో త్రివేణి శ్రీరాంపూర్‌ కుటుంబం నివసిస్తోంది. త్రివేణి కుమార్తె స్నేహ శ్రీరాంపూర్‌ నగరంలోని కేశవ మెమోరియల్‌ సాంకేతిక విద్యాసంస్థలో సీఎ్‌ససీ రెండో సంవత్సరం చదువుతుండగా, త్రివేణి అన్నయ్య కుమారులు పృథ్వీ ఇంటర్‌ మొదటి సంవత్సరం, ఆకాశ్‌ ఏడో తరగతి చదువుతూ వీరితో పాటు ఇంట్లోనే ఉంటున్నారు. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్న కొంత మంది ఆహారం లేక ఆకలితో అలమట్టిస్తున్నారని సోషల్‌మీడియా, మీడియాలో చదివి స్నేహా శ్రీరాంపూర్‌ చలించిపోయింది. వాళ్లకి ఉచితంగా ఆహారం పంపిణీ చేద్దామని తమ్ముళ్లతో చెప్పింది. అందరూ కలిసి పెద్దల దృష్టికి తమ నిర్ణయాన్ని తీసుకెళ్లారు. సమాజసేవ చేయాలనే పిల్లల తపనను అర్థం చేసుకుని మేము సైతం అంటూ పెద్దలు వారితో చేతులు కలిపారు.


స్నేహితుడి వేదన కదిలించింది...

కరోనా వచ్చిన స్నేహితుడు పడ్డ ఇబ్బందులను గమనించిన ద్యాప రాంబాబురెడ్డి తనవంతుగా కొందరి ఆకలి బాధలైనా తీర్చాలనుకున్నాడు. ఎల్‌బీనగర్‌ సిరీస్‌ రోడ్డులో వాటర్‌ ఫ్యూరిఫయర్‌ వ్యాపారం చేసే అతను స్నేహితులు మందల జైపాల్‌రెడ్డి, అనుదీప్‌, రాఘవేందర్‌, మహేశ్వర్‌లతో కలిసి బృందం ఏర్పాటు చేశారు. స్వయంగా వారే ఇంట్లో భోజనం తయారు చేసి, ప్యాకింగ్‌ చేసి కరోనా రోగుల ఇళ్లకు వెళ్లి అందించి వస్తున్నారు. సోషల్‌ మీడియాలో నంబర్లను పోస్ట్‌ చేసిన వీరు కాంటాక్ట్‌ చేసిన వారి చిరునామాను నోట్‌ చేసుకుని వారికి భోజనం అందిస్తున్నారు. వనస్థలిపురం, హయత్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, నాగోలు, దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతాలలో ఉండే బాధితులకు సొంత ఖర్చులతో సహాయం అందిస్తున్నారు. ‘అన్నం, కూరలతో పాటు, గుడ్లు, పండ్లు, కీర, క్యారెట్‌, సలాడ్‌లు ఇలా ఒక్కోరోజు ఒక్కో వెరైటీతో భోజనం అందిస్తున్నాం.’ అని రాంబాబురెడ్డి తెలిపారు.


ఐదు రోజుల్లో ఐదు వందల మందికి

కుటుంబసభ్యులు, పిల్లలంతా కలిసి ‘ఆశ్వీరాద్‌ అమ్మచేతి ముద్ద’ అని ఉచిత ఆహార పంపిణీకి నామకరణం చేశారు. ముందుగా తమకు తెలిసిన బంధువులు, స్నేహితులు, స్థానికుల్లో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్న వారి వివరాలు సేకరించారు. ఈనెల 17న ఆశ్వీరాద్‌ అమ్మచేతి ముద్ద కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. తార్నాక, విద్యానగర్‌, కాచిగూడ, కవాడిగూడ, సైనిక్‌పురి, హిమాయత్‌నగర్‌, వనస్థలిపురం, తదితర ప్రాంతాల్లో కొవిడ్‌ బాధితులకు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, ద హైదరాబాద్‌ రిలీఫ్‌ రైడర్స్‌ సహకారంతో ఆహార ప్యాకింగ్‌లను బాధితులకు అందజేశారు. రోజూ ఉదయం, సాయంత్రం అన్నం, పప్పు, చట్నీ, మజ్జిగ పులుసు, చపాతీలు, పెరుగుప్యాకెట్‌ తదితర ఆహార పదార్థాలను పంపుతున్నారు.


చాలా సంతోషంగా ఉంది

స్నేహితులు చాలామంది కరోనా బాధితులకు ఏదోకటి సేవ చేస్తున్నారు. మేమూ ఎందుకు చేయకూడదని ఆలోచన వచ్చింది. ఉన్నదాంట్లో కొద్దిగా సమాజసేవకు ఉపయోగించాలని కుటుంబసభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం. ముద్దుగా ఆశ్వీరాద్‌ అమ్మచేతి ముద్ద అని నామకరణం చేసి కొవిడ్‌ బాధితులకు ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నాం. చాలా మంది చల్లగా ఉండాలని కుటుంబాన్ని దీవిస్తుంటే సంతోషంగా ఉంది. - స్నేహ శ్రీరాంపూర్‌ 

Updated Date - 2021-05-25T18:10:18+05:30 IST