Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లల ఆరోగ్యానికి మార్గాలివే

పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి తగ్గడం మూలంగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటికి పరిష్కారాలు ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నాయి. 


జీర్ణసంబంధ సమస్యలు

ఆకలి తగ్గడం, ఊబకాయం, విరేచనం పలుచగా, పలుమార్లు అవడం, మలబద్ధకం, ఆహార సంబంధ అలర్జీలు, బలహీనత, అలసట వంటివి జీర్ణసంబంధ సమస్యల లక్షణాలు. ఈ కోవకు చెందినవారికి కరివేపాకు కారం, సొంఠి కారం, సంప్రదాయ పచ్చళ్లు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కాలాలనుగుణ ఫలాలు, మజ్జిగ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. సూర్యాస్తమయం లోపు వండిన ఆహారం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. 


అగ్నితుండివటి: ఆకలి లేకపోవడం, ఆహారం తినాలనే కోరిక తగ్గడం మొదలైన సమస్యలకు ఈ ఔషధాన్ని ఉదయం, సాయంత్రం ఒక మాత్ర చొప్పున తీసుకోవాలి.


ఆరోగ్యవర్ధిని వటి: ఆహారం తింటున్నా, తరచూ ఏదో ఒకటి తినాలనే కోరిక కలగడం, ఎప్పుడూ నీరసంగా ఉండడం లాంటి లక్షణాలు ఉంటే, రెండు మాత్రల చొప్పున ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవాలి.


మహా సుదర్శన కాడ: విరోచనం గట్టిగా అవడం, అవకపోవడం, ఆహార సంబంధ అలర్జీలు ఉన్నవారు ఈ ఔషధాన్ని నీళ్లతో కలిపి ఉదయం, సాయంత్రం 10 మి.లీ తీసుకోవాలి. మహా సుదర్శన ఘనవటి వయసును బట్టి ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు మాత్రల చొప్పున ఆహారం తర్వాత తీసుకోవాలి.


బిళ్వజిల్‌: విరోచనం సరిగా కాని వారు, కొద్ది కొద్దిగా పలుచని విరోచనం అయ్యేవారు, పొత్తికడుపులో, బొడ్డు దగ్గర నొప్పితో బంక విరోచనాలు అయ్యేవారు వయసును బట్టి ఒకటి లేదా రెండు మాత్రలు భోజనం తర్వాత తీసుకోవాలి.


గృహవైద్యం: విరోచనం పలుచగా అయ్యేవారు ఒక స్పూను మెంతులను పెరుగుతో కలిపి నమలకుండా మింగాలి. ఆవాలు ఇనుప మూకుడులో వేయించి, ఒక కప్పు నీళ్లు కలిపి తాగాలి. విరోచనం సరిగా కాని వారు భోజనం తర్వాత గులాబీలతో చేసిన గుల్బంద్‌ తింటే విరోచనం సాఫీగా అవుతుంది.


జి. శశిధర్‌,

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, చీరాల.

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement