వాతావరణ మార్పుల భారం బాలలపైనే అధికం

ABN , First Publish Date - 2021-09-29T22:18:29+05:30 IST

మితిమీరిన వాతావరణ మార్పుల ప్రభావం నేటి వయోజనుల మీద

వాతావరణ మార్పుల భారం బాలలపైనే అధికం

న్యూఢిల్లీ : మితిమీరిన వాతావరణ మార్పుల ప్రభావం నేటి వయోజనుల మీద కన్నా ఈ తరం బాలలపైనే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. 2021లో జన్మించిన బిడ్డ జీవితాన్ని, ప్రస్తుతం 60 ఏళ్ళ వయసుగల వ్యక్తి జీవితాన్ని పోల్చినపుడు, ప్రస్తుతం 60 ఏళ్ళ వయసుగల వ్యక్తి తన జీవితంలో అనుభవించే ఇబ్బందుల కన్నా ఎక్కువ ఇబ్బందులను 2021లో జన్మించిన బిడ్డ తన జీవితంలో అనుభవించే అవకాశం ఉందని తెలిపారు. 2021లో పుట్టిన బిడ్డ తన జీవిత కాలంలో సగటున రెట్టింపు దావానలాలు, రెండు లేదా మూడు రెట్ల కరువుకాటకాలు, దాదాపు మూడు రెట్ల వరకు నదుల వరదలు, పంటల వైఫల్యాలు, సుమారు ఏడు రెట్ల వేడి గాలులను అనుభవిస్తాడని తెలిపారు. ఈ అధ్యయన నివేదికను ‘సైన్స్’ జర్నల్ ప్రచురించింది. 


ఇంటర్-సెక్టోరల్ ఇంపాక్ట్ మోడల్ ఇంటర్‌కంపేరిజన్ ప్రాజెక్ట్ (ఐఎస్ఐఎంఐపీ) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. వాతావరణ మార్పుల వల్ల కలిగే వేర్వేరు ప్రభావాలను ఈ అధ్యయనంలో మదింపు చేశారు. సమాజం వల్ల కలిగే వాతావరణ మార్పుల ప్రభావాలను అంచనా వేశారు. ఈ అధ్యయనంలో ఐఎస్ఐఎంఐపీ డేటాతో పాటు వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ వెల్లడించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. కంట్రీ-స్కేల్, ఆయుర్దాయ  సమాచారం, జనాభా సమాచారం, ఉష్ణోగ్రతల సమాచారాన్ని పరిశీలించారు. 


పోస్ట్‌డామ్ వాతావరణ మార్పుల ప్రభావ పరిశోధన సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలు తగిన స్థాయిలో లేవు. ప్రస్తుతం ప్రపంచ భూభాగంలో 15 శాతంపై పడుతున్న ప్రమాదకర మితిమీరిన వేడి గాలుల ప్రభావం ఈ శతాబ్దాంతానికి 46 శాతానికి పెరగవచ్చు.  ప్రస్తుతం 40 ఏళ్ళ వయసుగలవారు మునుపెన్నడూ లేని జీవితాన్ని జీవించవలసి ఉంటుంది. పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్రకారం నిర్ణయించిన వాతావరణ విధానాలను దేశాలు అనుసరిస్తే, ఈ ప్రభావం 22 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉంది.


ఈ తరం బాలలు ఎదుర్కొనే వాస్తవ తీవ్రతను తమ లెక్కలు తక్కువ అంచనా వేస్తున్నాయనే భావం తమకు ఉందని ఈ పరిశోధకుల్లో ఒకరైన విమ్ థియెరీ చెప్పారు. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయగలిగితే బాలలపై పడే దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చునని ఈ అధ్యయనం తెలిపింది.


Updated Date - 2021-09-29T22:18:29+05:30 IST