అక్కడి ఐదేళ్లలోపు చిన్నారులు ఊబకాయులుగా మారిపోతున్నారు.. ఆశ్చర్యపరుస్తున్న సర్వే ఫలితాలు..

ABN , First Publish Date - 2021-12-25T15:00:48+05:30 IST

రాజస్థాన్‌లో ఐదేళ్లలోపు చిన్నారులు..

అక్కడి ఐదేళ్లలోపు చిన్నారులు ఊబకాయులుగా మారిపోతున్నారు.. ఆశ్చర్యపరుస్తున్న సర్వే ఫలితాలు..

రాజస్థాన్‌లో ఐదేళ్లలోపు చిన్నారులు ఊబకాయులుగా మారిపోతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లల్లో ఊబకాయ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ నివేదిక ప్రకారం 2015-16 సంవత్సరంలో ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య 2.1 శాతం ఉండగా, 2020-21 సంవత్సరంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ సంఖ్య 3.03 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో రాష్ట్రంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలోని జోధ్‌పూర్ గణాంకాలను పరిశీలిస్తే, ఐదేళ్లలోపు పిల్లలలో స్థూలకాయ సమస్య ఎదుర్కొంటున్నవారి సంఖ్య 5.05 శాతానికి పెరిగింది. జోధ్‌పూర్‌లో గత NFHS- 4తో పోల్చి చూస్తే ఇప్పుడు 3.4 శాతం పెరుగుదల చోటుచేసుకుంది.


నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఆందోళన కలిగించే అంశం. పిల్లల్లో ఊబకాయ సమస్య అధిక రక్తపోటు, మధుమేహంలాంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. తాజా సర్వేలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఊబకాయం అధికంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 3.09 శాతం పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో 3.01 శాతం మంది పిల్లలు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో 3.03 శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో ఈ సంఖ్య కేవలం 2.01 మాత్రమే ఉంది. ఇదేవిధంగా 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల స్త్రీ, పురుషులలోనూ ఊబకాయ సమస్య పెరిగింది. మహిళలు, పురుషులలో వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా, పిల్లలలో ఎత్తు, బరువు నిష్పత్తి ఆధారంగా ఊబకాయం అంచనా వేస్తారు. రాజస్థాన్‌లో మొత్తంగా 12.9 శాతం జనాభా ​​స్థూలకాయంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. NFHS- 5 ప్రకారం దేశంలోని 20 రాష్ట్రాల్లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఊబకాయ సమస్య వేగంగా పెరిగింది. మహారాష్ట్ర, గుజరాత్, మిజోరాం, త్రిపుర, లక్షద్వీప్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లలోగల ప్రజలతో ఊబకాయ సమస్య తీవ్రమవుతోంది.

Updated Date - 2021-12-25T15:00:48+05:30 IST