పిల్లలకు అనుబంధాలను పంచండి!

ABN , First Publish Date - 2021-03-15T05:30:00+05:30 IST

‘పిల్లలకు బాల్యం ఆనందాన్ని అందించాలి. నేటి తల్లిదండ్రులు పాఠశాలలు అనే జైలులో చిన్నారులను బందీలుగా చేస్తున్నారు. నిరంతరం చదువు తప్ప మరొకటి లేదు. నేటి తరం పిల్లలకు అమ్మానాన్న పదాలలో ఉన్న మాధుర్యం తెలియదు’

పిల్లలకు అనుబంధాలను పంచండి!

‘పిల్లలకు బాల్యం ఆనందాన్ని అందించాలి. నేటి తల్లిదండ్రులు పాఠశాలలు అనే జైలులో చిన్నారులను బందీలుగా చేస్తున్నారు. నిరంతరం చదువు తప్ప మరొకటి లేదు. నేటి తరం పిల్లలకు అమ్మానాన్న పదాలలో ఉన్న మాధుర్యం తెలియదు’  అని అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదలకు చెందిన  కన్నెగంటి అనసూయ. 2020 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సాహిత్య పురస్కారానికి ఎంపికైన ఆమె నవ్యతో మాట్లాడారు.


బాధ్యత పెరిగింది

స్నేహితులు కథల సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీతగా ఎంపికవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ పురస్కారం ప్రోత్సాహకం మాత్రమే కాదు. సమాజం పట్ల మరింత బాధ్యతను పెంచింది.


‘‘పుట్టిన రెండో రోజే పిల్లలకు పాఠశాలలు నిర్వహిస్తే పంపించే సమాజంలో మనం ఉన్నాం. పంపించే తల్లిదండ్రులు ఉన్నారు. అటువంటి వారిపైనే నా పోరాటం. నేటి చిన్నారులకు బాల సాహిత్యం కరువైంది. నా చిన్నతనంలో బాలలకు సంబంధించి ఎన్నో కథల పుస్తకాలు ఉండేవి. ప్రస్తుతం టీవీలు, సెల్‌ఫోన్లు చూసి గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో గడిపే తీరిక లేకపోవడంతో సమాజంలో యాంత్రికమైన సంబంధాలు తప్ప అనుబంధాలు, ఆప్యాయతలు కరువయ్యాయి. నేటి తరానికి తల్లిదండ్రులు, పెద్దలు అన్న బాధ్యత లేకుండా పోయింది. ఆ జీవన చక్రం నుంచి బయటకు రావాలి. మా చిన్నతనంలో అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెప్పేవారు. నేడు అమ్మమ్మ, తాతయ్యలు అన్న అనుబంధమే కరువైంది. చదువుల ఒత్తిడిలో పిల్లలను సరదాగా నాలుగు రోజులు అమ్మమ్మ ఇంటివద్ద ఉంచడానికి కుదరడం లేదు. పిల్లలు సెల్‌ఫోన్లు, పెద్దలు టీవీలతో గడిపేస్తున్నారు. నాడు మా అమ్మమ్మ, తాతయ్యలు చెప్పిన కథలే నా రచనలకు ప్రేరణ.  


మాది అందమైన కుటుంబం

మాది కొవ్వూరు మండలం పశివేదల. పచ్చని పంట పొలాల మధ్యలో అమ్మమ్మ, తాతయ్యలతో బాల్యం ఎంతో ఆనందంగా గడిచింది. మేం నలుగురు సంతానం. అక్కలు అనంతలక్ష్మి, కాశీరత్నం, సోదరుడు వెంకటకృష్ణారావులను కలవడానికి మా స్వగ్రామం వస్తే ఆ జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. నేటి పిల్లలకు ఆ బాల్యం కరువైంది. 


ఏదైనా చేయాలి!

పిల్లలకు బాల్యాన్ని అందించాలి. అమ్మమ్మలు తాతయ్యలతో గడిపే రోజులు రావాలి. టీవీలు పక్కనపెట్టి బాలల సాహిత్యం చదివాలి. ఇంగ్లిషు ఒరవడిలో కొట్టుకుపోకుండా, తెలుగు భాషా మాధుర్యాన్ని దగ్గర చేయాలి. రచనల ద్వారా కొంత మందిలోనైనా మార్పు తీసుకురావాలని నా ప్రయత్నం.


భవిష్యత్‌ ప్రణాళిక

భవిష్యత్‌లో పిల్లలకు కథ కార్యశాలలు ఏర్పాటు చేసి వారితో కథలు రాయించడం, ఆ కథలను పెద్దలతో చదివించి రోజు రోజుకు పెద్దలు, పిల్లల మధ్య తరిగిపోతున్న అనుబంధాలు ఆప్యాయతలను పెంచేందుకు కృషి చేస్తా. మానస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా భాదితులకు రక్త సేకరణకు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. వరంగల్‌ జిల్లా చేర్యాల మండలంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ ద్వారా సేకరించిన నిదులను ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పన అందించాం.


నేను సాధించింది

ఇప్పటి వరకు 300కు పైగా కధలు, రెండు నవలలు, 150 కవితలు, 550 పైగా బాలల కఽథలు రాశాను. వాటిలో చక్రం-బాలల నవల, చిన్నూ-పిచ్చుక పిల్లల బొమ్మల కథ తానా పురస్కారాలు అందుకున్నాయి. పొడిచేపొద్దు, స్నేహితులు కథల సంపుటాలు, ఆవిడెవరు? రచనలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఇప్పటివరకు 25 పురస్కారాలు అందుకున్నాను.


మరచిపోలేని సంఘటనలు

మార్కెట్లలో అనాథబాలల జీవనశైలిపై రాసిన పొడిచేపొద్దు కథ ప్రచురితమైన సందర్భంలో విజయవాడ నుంచి ఒక మహిళ ఫోన్‌ చేసి మీ కథ చదివాను ఒక బాలుడిని దత్తత తీసుకున్నాను అని చెప్పినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. మహిళలు వృద్ధ్యాప్యంలో ఎదుర్కొనే సమస్యలపై ఆవిడెవరు? కథకు ఓ డాక్టర్‌ మీ కఽథలు సామాజిక మార్పు తీసుకు వస్తున్నాయని అభినందించారు. నా రచనలపై నాగార్జున యూనివర్సిటీ విధ్యార్థి ఒకరు పీహెచ్‌డీ చేయడం మాటల్లో చెప్పలేనిది.

స్వామి నాయుడు కొవ్వూరు

Updated Date - 2021-03-15T05:30:00+05:30 IST