బడి బయట బాల్యం

ABN , First Publish Date - 2022-01-28T04:30:37+05:30 IST

విద్యాబుద్దులు నేర్వాల్సిన పిల్లల బాల్యం ఇటుక బట్టీలు, కూలి పనులు, వ్యాపారుల, చెత్తకుండీల వద్దే మగ్గుతోంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చిన్నతనం నుంచే కుటుంబ పోషణ భారాన్ని మోస్తున్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో సుత్తెలు, తట్టలు, భుజానికి సంచులు కనిపిస్తున్నాయి.

బడి బయట బాల్యం
బడి బయట పిల్లల సర్వే చేపడుతున్న విద్యాశాఖ సిబ్బంది

- చదువుకు దూరమవుతున్న బాలలు

- ఇటుక బట్టీలు, కూలి పనులు, వ్యాపారుల వద్దే మగ్గుతున్న బాల్యం

- బడి బయట సర్వేలో మొత్తం 591 మంది గుర్తింపు

- 6-14ఏళ్ల లోపు వయస్సు వారు 307

-  15-19ఏళ్ల లోపు వయస్సు వారు 284

- తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన విద్యాశాఖ అధికారులు


కామారెడ్డి టౌన్‌, జనవరి 27: విద్యాబుద్దులు నేర్వాల్సిన పిల్లల బాల్యం ఇటుక బట్టీలు, కూలి పనులు, వ్యాపారుల, చెత్తకుండీల వద్దే మగ్గుతోంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చిన్నతనం నుంచే కుటుంబ పోషణ భారాన్ని మోస్తున్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో సుత్తెలు, తట్టలు, భుజానికి సంచులు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితికి తోడు కరోనా విపత్కర పరిస్థితుల్లో అంధకారంలోకి నెట్టెస్తున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు ప్రభుత్వం బడిబయట పిల్లల సర్వేను ప్రారంభించింది. ఈనెల 25 వరకు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఈ ప్రక్రియను కొనసాగించి 591 మంది పిల్లలను గుర్తించారు. చిన్నపిల్లలతో పనులు చేయించవద్దని వారి చిట్టిచేతులు చక్కని రాతలు రాయాలి కాని సుత్తెలు, తట్టలు మోయవద్దని ప్రభుత్వం నిర్బంధ విద్యను చేపడుతోంది. ఎవరైన చిన్నపిల్లలను పనులలో పెట్టుకుంటే శిక్షలు వేస్తామని చెబుతున్నా వ్యాపారులు మాత్రం తక్కువ జీతంకు పని చేస్తున్నారు కదా అని చిన్నపిల్లలను పనులకు పెట్టుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ముగిసిన సర్వే

రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ చట్టం ప్రకారం 6-14 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను అందిస్తోంది. అయినా చాలా మంది తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో పిల్లల చదువు మధ్యలోనే మాన్పించేస్తున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు పనిచేసే చోటే ఉంటూ బడికి దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రతీ మండలం, ప్రతీ నివాస ప్రాంతం, ప్రతీ ఇల్లును క్షేత్రస్థాయిలో సందర్శించి సర్వే నిర్వహించారు. ఏటా నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలో ఈ సర్వేను చేపడుతారు. జిల్లాలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారితో పాటు నిరుపేదల కుటుంబాలే ఎక్కువ. పేద కుటుంబాలకు చెందిన బాలలు బడికి వెళ్లాల్సిన సమయంలో బయట కన్పిస్తున్నారని విద్యాశాఖధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా వస్తున్న ఆన్‌లైన్‌ చదువులు వీరికి దరిచేరడం లేదు. పరోక్ష పాఠాలు వినలేక, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు అందుబాటులో లేక ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇలాంటి పిల్లలను గుర్తించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 25 వరకు సర్వేను నిర్వహించి మొత్తం 591 మంది బడి బయట పిల్లలను గుర్తించారు. ఇందులో 6-14ఏళ్ల లోపు వయస్సు వారు 307,  15-19ఏళ్ల లోపు వయస్సు వారు 284 మంది ఉన్నట్లు విద్యాశాఖధికారులు పేర్కొంటున్నారు.

పనిచోసే చోటే ఎక్కువ

జిల్లాలో ఎక్కువగా ఇటుక బట్టీలు, ఇనుప వస్తువుల తయారీదారులు, రోడ్డుసైడ్‌ వ్యాపారం చేసే వారి వద్ద పనిచేసే వారు ఎక్కువగా ఉన్నారు. మహారాష్ట్ర, బిహర్‌, ఒడిశా, యూపీ రాష్ట్రాల నుంచి కూలీ పనుల కోసం వలస వస్తుంటారు. స్థానికంగా వ్యవసాయ కూలీలుగా, ఇటుక బట్టీలు, పౌలీ్ట్ర ఫారంలు, భవన నిర్మాణ రంగంలో ఉపాధి పనులు చేస్తుంటారు. దీంతో బడి మానేసిన వారిలో వీరి పిల్లలే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, పంట చేన్లలో, ఇనుప వస్తువుల తయారీ, అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యార్థులు బడిబాట పట్టే అవకాశాలు ఉన్నాయని విద్యావంతులు పేర్కొంటున్నారు. ఈ అంశంపైన దృష్టి సారిస్తామని పిల్లలను బడి బయట ఉంచకుండా చూడాలని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు విద్యాశాఖధికారులు తెలిపారు.


తల్లిదండ్రులు సహకరించాలి

- రాజు, డీఈవో, కామారెడ్డి

బడిబయట బాల్యం ఉండకూడదనే ప్రభుత్వం 6-14ఏళ్ల వయస్సు గల పిల్లలను ఉచిత నిర్బంధ విద్యను అందజేస్తోంది. ప్రతీ ఏటా ఈ సర్వే నిర్వహిస్తున్న పనులు చేస్తున్న చోటే పిల్లలు ఎక్కువగా బడులకు వెళ్లకుండా కనిపిస్తున్నారు. అలాంటి వారి కోసం త్వరలో ప్రత్యేక ప్రణాళిక తయారు చేసే విధంగా కృషి చేస్తాం. జిల్లాలో ఈనెల 11 నుంచి 25 వరకు సర్వేను నిర్వహించి మొత్తం 591 మంది బడిబయట పిల్లలను సీఆర్‌పీలచే సర్వే నిర్వహించి గుర్తించాం. ఇందులో  6-14ఏళ్ల లోపు వయస్సువారు 307,  15-19ఏళ్ల లోపు వయస్సు వారు 284 మంది ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు సహకరించాలి.

Updated Date - 2022-01-28T04:30:37+05:30 IST