ప్రసవం.. ప్రోత్సాహం!

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్‌ డెలివరీలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు ప్రసవవేదనలు తట్టుకోకుండా ఆపు చేసైన ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళుతూ శస్త్ర చికిత్సలు చేయించుకుని దీర్ఘకాలిక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి పథకాలను అమలు చేస్తుంది.

ప్రసవం.. ప్రోత్సాహం!
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల నిమిత్తం వచ్చిన గర్భిణులు(ఫైల్‌)

- ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్‌ డెలివరీల పెంపు దిశగా ప్రభుత్వ ఆలోచనలు

- తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం

- ప్రభుత్వ ఆసుపత్రులకు టార్గెట్‌లు.. సిబ్బందికి ప్రోత్సాహం


కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 10: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్‌ డెలివరీలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు ప్రసవవేదనలు తట్టుకోకుండా ఆపు చేసైన ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళుతూ శస్త్ర చికిత్సలు చేయించుకుని దీర్ఘకాలిక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి పథకాలను అమలు చేస్తుంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కానీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నార్మల్‌ డెలివరీల సంఖ్య పెరగడం లేదు. దీంతో నార్మల్‌ డెలివరీల సంఖ్యను పెంచాలనే ఆలోచన చేసి సిబ్బందికి సైతం ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకు వచ్చింది. నార్మల్‌ డెలివరీలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులకు టార్గెట్‌ విధించడంతో పాటు సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించి తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పని చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

శస్త్ర చికిత్సల వల్ల కలిగే అనర్థాలను నివారించేందుకే..

శస్త్ర చికిత్సలు చేయడం వల్ల మహిళల్లో పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం గ్రహించింది. నార్మల్‌ డెలివరీలో పుట్టె చిన్నారుల కంటే శస్త్రచికిత్సలతో పుట్టె చిన్నారులకు అనేక రకాలైన సమస్యలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా శస్త్రచికిత్స జరిగేప్పుడు రక్తం ఎక్కువగా పోవడం వల్ల మహిళలకు ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా సాధారణ ప్రసవం అయిన వారితో పోలిస్తే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. మత్తులో ఉండడం వల్ల పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు ఇవ్వలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసివస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆలోచన మంచిదే అయినప్పటికీ గర్భిణులకు కుటుంబీకులు నార్మల్‌ డెలివరీలపై అవగాహన కల్పించి దైర్యం చెప్పాలని అలా కాకుండా వైద్యులపై ఒత్తిడి తీసుకువస్తూ శస్త్రచికిత్సల వైపు మొగ్గు చూపడంపై సైతం ఆలోచన చేస్తే తల్లి,బిడ్డ జీవిత కాలం పాటు అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు.

ప్రోత్సాహకాలు ఇలా..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 85 శాతం మేర నార్మల్‌ డెలివరీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 85 శాతం మేరకు సాధారణ ప్రసవాలు చేసిన ఆసుపత్రులను లెక్కించి రూ.3వేల నగదు ప్రోత్సాహకం అందజేయనున్నారు. జనరల్‌ ఆసుపత్రులలో ప్రతీనెల 350 నార్మల్‌ డెలివరీలు, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ప్రతీనెల 150 నార్మల్‌ డెలివరీలు, సివిల్‌ ఆసుపత్రిలో నెలకు 50, 24 గంటల పీహెచ్‌సీలలో 10, ప్రతీ పీహెచ్‌సీలో 5 నార్మల్‌ డెలివరీలను చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 85 శాతానికి మించి నార్మల్‌ డెలివరీలు చేసిన తరువాత ప్రతీ డెలివరీకి ప్రోత్సాహకాలు అందిస్తారు. డాక్టర్‌, స్టాఫ్‌ నర్సులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున, ఆయా పారిశుధ్య సిబ్బందికి రూ.500, ఏఎన్‌ఎంకు రూ.250, ఆశ కార్యకర్తలకు రూ.250 చొప్పున అందజేస్తారు.

ప్రజల ఇబ్బంది తొలగించే ప్రయత్నం

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో ఉన్న అప నమ్మకాన్ని పోగొట్టడంతో పాటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వచ్చే ఇబ్బందులను తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.  ప్రసవం చెందే మహిళకు శస్త్ర చికిత్సలు చేస్తే జీవితకాలం ఏ తరహాలో ఇబ్బందులు పడుతుందో తెలిసి కూడా ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులు కేవలం తమకు వచ్చే లాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు. వీటితో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది చేసే నిర్లక్ష్యాన్ని రూపుమాపేందుకు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి పథకాలతో పాటుగా సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని గర్భిణులు ప్రసవించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST