బట్టీల్లో మగ్గుతున్న బాల్యం

ABN , First Publish Date - 2020-12-02T05:22:08+05:30 IST

బట్టీల్లో మగ్గుతున్న బాల్యం

బట్టీల్లో మగ్గుతున్న బాల్యం
గౌడవెల్లిలో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న దృశ్యం

  • ఇటుక బట్టీల్లో పనికి చిన్నారులు 
  • బాల్యం నుంచే చదువుకు దూరం
  • కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్న యజమానులు 
  • నిబంధనలకు విరుద్దంగా జోరుగా ఇటుక బట్టీల దందా
  • పట్టించుకోని అధికారులు 


చేతిలో బలపం పట్టి చదువుకోవాల్సిన చిన్నారులు ్ల ఇటుకలు మోస్తూ బట్టీలోనే మగ్గిపోతున్నారు. బట్టీల వ్యాపారులు విద్యాహక్కు, కార్మిక, వాల్టా, చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. చాలీచాలనీ జీతాలు చెల్లించి కార్మికుల శ్రమను యజమానులు దోచుకుంటున్నారు.  నిబంధనలకు నీళ్లు వదిలి గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు. కోట్లలో వ్యాపారం.. లక్షల్లో ఆదాయం వస్తున్నా పన్నులు వసూళ్లు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. 


మేడ్చల్‌: మేడ్చల్‌ నియోజకవర్గంలోని మేడ్చల్‌, శామీర్‌పేట,  కీసర మండలాల్లో ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా నడుస్తున్నది. మేడ్చల్‌ మండలంలోని శ్రీరంగవరం, గౌడవెల్లి, బండమాదారం, రాజబొల్లారం, యాడారం, కీసర మండలంలోని అంకిరెడ్డిపల్లి, కరీంగూడా, రాంపల్లి, యాద్గార్‌పల్లి, వన్నీగూడెం, భోగారం, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి, అహ్మద్‌గూడ,  ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఇటుకబట్టీల యజమానులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇతర రాష్ట్రాల నుంచి కుటుంబంతో సహా వచ్చి.. 


పొట్టచేతపట్టుకుని ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి పేదలు ఉపాధి కోసం బట్టీల్లో పనిచేయడానికి వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలా ఎన్నో కుటుంబాలు వారి పిల్లలతో సహా వచ్చి పనిచేస్తున్నారు. వీరిలో 14 సంవత్సరాలు లోపు పిల్లలతో కూడా పని చేయిస్తూ విద్యాహక్కు చట్టాన్ని విస్మరిస్తూ రాత్రింబవళ్లు పని చేయించుకుంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేడని పలువురు వాపోతున్నారు. అధికారులు ఎప్పుడో ఓసారి నామమాత్రంగా దాడులు జరిపి చేతులు దులుపేసుకుంటున్నారే తప్ప చర్యలు శూన్యమనే ఆరోపణలున్నాయి. 


కార్మికుల శ్రమ దోచుకుంటున్న యజమానులు


కార్మిక చట్టానికి లోబడి కార్మికులకు చెల్లించాల్సిన కూలి కంటే తక్కువగా చెల్లించి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వారి శ్రమను యజమానులు దోచుకుంటున్నారు. ఆరునెలల్లో ఒప్పందం ప్రకారం వారికి వాయిదాల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో వారు ఎలాంటి అనారోగ్యానికి గురైనా, ప్రాణాలు పోయినా యజమానులు పట్టించుకోరు. బట్టీలల్లో పనిచేసే కార్మికులకు కనీసం బీమా సౌకర్యం కల్పించాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా బట్టీ యజమానులకు లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పన్నులకు వ్యాపారుల ఎగనామం..


గ్రామాల్లో నిర్వహించే ఇటుక బట్టీల వ్యాపారస్తులు పన్నులకు ఎగనామం పెడుతున్నారు. లక్షల్లో ఖర్చుచేసి కోట్లల్లో ఆదాయం సంపాదిస్తున్న వీటి నిర్వాహకులు ఆయా గ్రామపంచాయతీలకు ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. వ్యాపారంలో రెండుశాతం పన్ను చెల్లించాలని నిబంధన ఉన్నప్పటికీ వ్యాపారస్థులు పట్టించుకోవడం లేదని, అధికారులు కూడా తమకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి తోడుగానే ప్రజాప్రతినిధులు అనుసరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో ప్రతి బట్టీలోనూ దాదాపు లక్ష వరకు ఇటుకలు తయారుచేసి బట్టీపెట్టి కాల్చి ఒక్కొక్కటీ రూ.4 నుంచి 6 రూ.ల చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తారు. ఒక్కో యజమాని సీజన్‌లో అన్నీ ఖర్చులు పోనూ రూ.10 నుంచి 20లక్షల వరకు సంపాదించడంతో నియోజకవర్గంలో కోట్లలో లావాదేవీలు జరుగుతున్నా పంచాయతీలకు పన్నులు చెల్లించడం లేదు. విక్రయ సమయంలో కొనుగోలుదారులకు రశీదు కూడా ఇవ్వకుండా వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన రెండు శాతం, పంచాయతీ యాక్ట్‌ ప్రకారం గ్రామంలో జరిగే విక్రయాల్లో రెండు శాతం పంచాయతీలో జమచేయాల్సి ఉండగా వ్యాపారులు విస్మరిస్తున్నారు.


వాల్టాకు తూట్లు


భూ పరిరక్షణ చట్టం 129/12లో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి పనికి రాని భూముల్లో మాత్రమే ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహించాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పంటలు పండే భూముల్లో ఇటుకలు తయారు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అధికారులకు మామూళ్లు చెల్లించి అడ్డదారిల్లో బట్టీలు చెలామణీ చేస్తున్నారు. నగరానికి కూతవేటు దూరంలోనే ఇంత జరుగుతున్నా పట్టించుకొనే అధికారులు లేరని పలువురు ఆరోపిస్తున్నారు. 


యథేచ్ఛగా విద్యుత్‌ చౌర్యం? 


నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించే ఇటుకబట్టీల వ్యాపారానికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీ, విద్యుత్‌ శాఖ అధికారుల అండదండాలు పుష్కలంగా ఉంటాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇటుకబట్టీల వ్యాపారస్థులకు మూడు పువ్వులు...ఆరు కాయలు అన్నట్లుగా ఇటుక బట్టీల వ్యాపారం మండలంలో కొనసాగుతోందని స్థానికులు అంటున్నారు. చాలా చోట్ల ఇటుక బట్టీల్లో యథేచ్చగా  విద్యుత్‌ చౌర్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్‌ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇటుక బట్టీల నిర్వాహకుల వద్ద పన్నులు వసూళ్ళు చేసి పంచాయతీల ఆదాయానికి సహకరించాలని, అదే విధంగా బట్టీల్లో బాలకార్మికులు పని చేయకుండా, ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్‌ వాడుకుంటున్న ఇటుక బట్టీల యజమాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-02T05:22:08+05:30 IST