బాలల పరిరక్షణకు పునరంకితం కావాలి

ABN , First Publish Date - 2020-10-23T10:24:10+05:30 IST

వ్యవస్థలో పనిచేస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు పోలీసులు బాలల పరిరక్షణకు పునరంకితం కావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఉద్భోదించారు

బాలల పరిరక్షణకు పునరంకితం కావాలి

చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌

వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టుల ప్రారంభం


ఖమ్మంలీగల్‌, అక్టోబరు 22: వ్యవస్థలో పనిచేస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు పోలీసులు బాలల పరిరక్షణకు పునరంకితం కావాలని  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఉద్భోదించారు. ఖమ్మం మహిళా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన రెండు ప్రత్యేక కోర్టులను జస్టిస్‌ చౌహాన్‌, హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలితో కలిసి గురువారం ఉదయం వీడియోకాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. అనంతరం జస్టిస్‌ చౌహాన్‌ మాట్లాడుతూ హింస, అత్యాచారం జరిగినప్పుడు పిల్లలు కుంగిపోతారని, వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని కాబట్టి న్యాయవ్యవస్థ అప్రమత్తతో మెలిగి బాలల నమ్మకం చూరగొనాలని కోరారు. మానసికంగాను, శారీరకంగాను బాలలు బలహీనంగా ఉంటారని వారిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బాలలపట్ల జరిగిననేరాలను త్వరితగతిన విచారించడానికి రెండు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సహకరించిన కలెక్టర్‌ కర్ణన్‌ను న్యాయమూర్తి అభినందించారు. 


ఖమ్మం జిల్లాలో మొత్తం 435నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కనీసం నెలరోజుల్లో  పరిష్కరించాలని పోలీసుకమిషనర్‌ తప్సీర్‌ఇక్బాల్‌ను కోరారు. ప్రస్తుత కరోనా, వరదల గడ్డు పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొని విజయం సాధించాలని న్యాయమూర్తి ఆకాంక్షించారు. హైకోర్టు న్యాయమూర్తి, ఖమ్మం జిల్లాపరిపాలన న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలి మాట్లాడుతూ నూతన కోర్టుల వల్ల సత్వర న్యాయం జరుగుతుందన్నారు.  కార్యక్రమం నిర్వహించిన జిల్లా జడ్జి ఎం. లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల న్యాయవ్యవస్థ పరంగా ఖమ్మంజిల్లాగానే కొనసాగుతున్నాయని, వీటికి మౌలిక సదుపాయాల కల్పన అవసరమని చీఫ్‌ జస్టిస్‌ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, ఖమ్మం జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిపుడి తాజుద్దీన్‌బాబా ప్రసంగించగా  న్యాయమూర్తులు వి.బాలభాస్కరరావు, పి.చంద్రశేఖరప్రసాద్‌, అరుణకుమారి, వినోద్‌కుమార్‌, అప్రోజ్‌ అక్తర్‌, ఎన్‌.అనితారెడ్డి, ఎం.ఉషశ్రీ, రుబీనాఫాతిమా పాల్గొన్నారు. జిల్లా కోర్టు పరిపాలనాధి

కారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమ ఏర్పాట్లుచేశారు.  

Updated Date - 2020-10-23T10:24:10+05:30 IST