చిగురిస్తున్న ఆశ!

ABN , First Publish Date - 2022-03-11T04:58:05+05:30 IST

మొన్నటి వరకు డీలాపడ్డ నిమ్మ సాగుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఒక పక్క ధర పలుకుతుండటంతో మరో పక్క ఇతర ప్రాంతాలకు ఎగుమతులు ప్రారంభం కావడంతో రైతులతోపాటు వ్యాపారులు, కూలీల్లో ఉత్సాహం నెలకొంది.

చిగురిస్తున్న ఆశ!
నిమ్మకాయలను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు

నిమ్మకు పెరుగుతున్న ధర

ఇతర రాష్ట్రాలకూ ఎగుమతులు ప్రారంభం

కళకళలాడుతున్న గూడూరు మార్కెట్‌


గూడూరు, మార్చి 10 : మొన్నటి వరకు డీలాపడ్డ నిమ్మ సాగుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఒక పక్క ధర పలుకుతుండటంతో మరో పక్క ఇతర ప్రాంతాలకు ఎగుమతులు ప్రారంభం కావడంతో రైతులతోపాటు వ్యాపారులు, కూలీల్లో ఉత్సాహం నెలకొంది. గతేడాది ఫిబ్రవరిలో నిమ్మకాయలు కేజీ రూ.60 నుంచి 110 పలికింది. అయితే, కొవిడ్‌ కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన విధించడంతో మే నెలలో కేజీ రూ.6 నుంచి రూ. 15లకు పడిపోయింది. మే తర్వాత కిలో రూ.15 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 40 వరకు పలికాయి. ఫిబ్రవరి నుంచి కేజీ రూ.25 నుంచి 65 వరకు పలుకుతుండటంతో నిమ్మమార్కెట్‌కు పూర్వవైభవం వచ్చింది. కేజీ నిమ్మకాయలు రూ.30 పలికితేనే సాగుదారులకు గిట్టుబాటు అవుతుంది. గూడూరు నుంచి నిమ్మకాయలు ఉత్తరాదిరాష్ట్రాలైన ఢిల్లీ, లక్నో, ఆహ్మదాబాద్‌, బీహార్‌, ఒడిశా, రాంచీ, భువనేశ్వర్‌, దక్షిణాది రాష్ట్రాలలోని కేరళ, సేలం, ఈరోడ్‌, కోయంబత్తూరు, ఎర్నాకుళం, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇటీవల తెనాలి, ఏలూరు, బీజాపూర్‌ ప్రాంతాల నుంచి కూడా నిమ్మకాయలు ఎగుమతి అవుతుండడంతో ధరలు హెచ్చుతగ్గులు ఉండేది. ప్రస్తుతం గూడూరు మార్కెట్లో కిలో రూ.30 నుంచి 65 వరకు పలుకుతోంది. రోజుకు 12వేలకుపైగా బస్తాలు ఎగుమతి అవుతున్నాయి. ఈ డిమాండ్‌ ఇలాగే కొనసాగితే రూ. 50 నుంచి 110 వరకు పలికే అవకాశం ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. కొవిడ్‌ సమయంలో డీలాపడ్డ రైతులు, వ్యాపారులు, కూలీలు  ఇప్పుడు కొంత ఊరట చెందుతున్నారు. నిమ్మమార్కెట్‌ కూడా కళకళలాడుతోంది. 


రూ.30 పలికితేనే గిట్టుబాటు


కేజీ నిమ్మకాయలు మార్కెట్‌లో రూ.30 పలికితేనే గిట్టుబాటు అవుతుంది. కొవిడ్‌ కారణంగా ధరలు లేకపోవడంతో తోటల్లోనే కాయలను వదిలివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆశించిన మేర ధరలు పెరగకపోయినా కొంతమేర ఊరటగా ఉంది.

- రాఘవరెడ్డి, నిమ్మరైతు


వ్యాపారం పుంచుకుంటోంది!


కొవిడ్‌ కారణంగా నిమ్మ మార్కెట్లను మూసివేయడం, సమయ వేళలను తగ్గించడంతో నిమ్మ వ్యాపారం తగ్గిపోయింది. ఇప్పుడు ఉత్తరాదిరాష్ట్రాలలో నిమ్మకాయలకు డిమాండ్‌ పెరగడంతో వ్యాపారాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. 

- మోహనరెడ్డి, నిమ్మవ్యాపారి

Updated Date - 2022-03-11T04:58:05+05:30 IST