అసెంబ్లీలో CM Stalin కీలక ప్రకటన.. పరవశించిన OPS.. బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు!

ABN , First Publish Date - 2021-08-25T16:17:45+05:30 IST

13 సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఓటమి ఎరుగని వీరుడిగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎనలేని సేవలను...

అసెంబ్లీలో CM Stalin కీలక ప్రకటన.. పరవశించిన OPS.. బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు!

  • రూ.39 కోట్లతో కరుణ స్మారక మండపం
  • అసెంబ్లీలో స్టాలిన్‌ ప్రకటన 
  • కృతజ్ఞతలు తెలుపుతూ పులకించిన ఓపీఎస్‌

చెన్నై : దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి ప్రాంతంలో రూ.39 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్టు  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. కలైవానర్‌ అరంగం హాలులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఉదయం 110వ నిబంధనల కింద ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ సందర్భంగా స్టాలిన్‌ ప్రసంగిస్తూ.. మెరీనాబీచ్‌లో కరుణానిధి సమాధి ప్రాంతం వద్ద 2.2 ఎకరాల్లో స్మారక మండపాన్ని నిర్మించనున్నామని తెలిపారు. ఏడుదశాబ్ధాలపాటు పాత్రికేయుడిగా, ఐదు దశాబ్దాలపాటు డీఎంకే నేతగా, రాజకీయాల్లోనే కాకుండా చిత్ర రంగంలోనూ, సాహిత్యరంగంలో రాణించిన కరుణానిధికి స్మారకమండపం నిర్మించడం సముచితమన్నారు. 13 సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఓటమి ఎరుగని వీరుడిగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎనలేని సేవలను అందించారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపరిచిన కరుణానిధి సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాడారన్నారు. ముఖ్యమంత్రిగా కరుణానిధి అమలు చేసిన పలు ప్రజా సంక్షేమపథకాలను స్టాలిన్‌ ఈ సందర్భంగా వివరించారు.


పరవశించిన ఓపీఎస్‌

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి వద్ద స్మారక మండపం నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేసిన ప్రకటనతో అన్నాడీఎంకే నేత ఒ.పన్నీర్‌సెల్వం పులకించిపోయారు.స్టాలిన్‌ ప్రకటనను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దీనిని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు స్వాగతిస్తాయని ఆయన ప్రకటించగానే విపక్ష సభ్యులందరూ బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కరుణానిధి గుణగణాలను వివరించారని, స్మారక మండపం వద్ద ఈ వివరాలన్నీ పొందుపరిచేలా ఆ మండపాన్ని తీర్చిదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


తామంతా అన్నాదురై నీడలో రాజకీయ పాఠాలను నేర్చుకున్నవారమని, అదేవిధంగా సినీ సంభాషణల రచనలో కరుణానిధి కీర్తిగడించారని, పరాశక్తి, మనోహర చిత్రాలకు ఆయన రాసిన సంభాషణలే ఇందుకు నిదర్శనమన్నారు. తన తండ్రి కూడా కరుణానిధికి వీరాభిమాని అని, ఆయన ట్రంకు పెట్టెలో పరాశక్తి, మనోహర సినిమా డైలాగుల పుస్తకాలుండేవని పాత సంగతులను గుర్తు చేసుకున్నారు. కరుణానిధికి స్మారక మంటపాన్ని నిర్మించడాన్ని అన్నాడీఎంకే సభ్యుల తరఫున స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇదేవిధంగా కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్టి సభ్యుడు ఈశ్వరన్‌, మణిదనేయ మక్కల్‌ కట్చి నేత జవహిరుల్లా, ఎండీఎంకే సభ్యుడు సతన్‌ తిరుమలైకుమార్‌, సీపీఐ సభ్యుడు రామచంద్రన్‌, సీపీఎం సభ్యుడు నాగైమాలి, డీపీఐ సభ్యుడు చిందనై సెల్వం, బీజేపీ సభ్యుడు నయినార్‌ నాగేంద్రన్‌, పీఎంకే సభ్యుడు జీకే మణి, సీఎల్పీ నేత సెల్వ పెరుంతగై తదితరులు కరుణ స్మారక మండప నిర్మాణాన్ని స్వాగతిస్తూ ప్రసంగించారు.


ఉదయ సూర్యుడి ఆకారం

మెరీనాబీచ్‌లో కరుణానిధి సమాధి వద్ద నిర్మించనున్న స్మారక మండపం నమూనా చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తన ట్విట్టర్‌ పేజీలో విడుదల చేశారు. సమాధిపైన ఉదయసూర్యుడి ఆకారంలో బోర్లించిన అర్థచంద్రాకారపు పైకప్పులు, ఆ భవనం పక్కనే అదే రీతిలో స్వాగత వలయాలు, వాటిని దాటుకుని సమాధి పైకప్పులకు చేరువగా మెట్లు వున్నాయి. సమాధి ఎదుట ఎత్తయిన కలం ఆకారంలో స్తూపం కూడా ఉంది.



Updated Date - 2021-08-25T16:17:45+05:30 IST