Chief Minister Stalin: అంతర్జాతీయ క్రీడా గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2022-08-10T14:16:38+05:30 IST

రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్రీడలకు అనువైన వేదికగా రూపొందించే దిశగా తగు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister

Chief Minister Stalin: అంతర్జాతీయ క్రీడా గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి

- ఒలంపియాడ్‌ చెస్‌ వేదికపై స్టాలిన్‌ 

- ముగిసిన 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు

- ఘనంగా ముగింపోత్సవం 

- అంబరాన్నంటిన సంబరాలు


చెన్నై, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్రీడలకు అనువైన వేదికగా రూపొందించే దిశగా తగు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించారు. స్థానిక వేప్పేరిలోని నెహ్రూస్టేడియంలో 44వ అంతర్జాతీయ చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) పోటీల ముగింపు ఉత్సవాల సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ ... దేశవిదేశాలకు చెందిన అందరూ మెచ్చుకునే విధంగా స్వల్ప కాలంలో తమ ప్రభుత్వం ఈ పోటీలను ఘనంగా నిర్వహించిందన్నారు. ఈ పోటీలను ప్రధాని మోదీ(Prime Minister Modi) ప్రారంభించినప్పుడు తాను మాట్లాడుతూ ఈ పోటీలు నిర్వహించే అవకాశం తమకు లభించడం దేశం గర్వించదగిన అంశమని తెలిపానని, ఆ రీతిలో పోటీలు విజయవంతంగా ముగిశాయన్నారు. ఈ పోటీల నిర్వహణతో భారతదేశం, తమిళనాడు(Tamil Nadu) కీర్తి ప్రతిష్టతలు ప్రపంచ వ్యాప్తమయ్యాయన్నారు. ఈ పోటీలలో పతకాలు గెలుచుకున్న విజేతల కంటే తానే ఎక్కువగా సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడాపోటీల కోసం తమ ప్రభుత్వం రూ.180 కోట్ల మేరకు నిధులు మంజూరు చేసిందని, పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 18 కమిటీలను కూడా ఏర్పాటు చేసిందని వివరించారు. ప్రభుత్వ అధికారులంతా నిద్రాహారాలు మాని అత్యంత శ్రద్ధాసక్తులతో సేవలందించి పోటీలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. చారిత్రక పర్యాటక ప్రాంతం మహాబలిపురంలో ఏర్పాటు చేసిన ఆతిథ్య ఏర్పాట్లను విదేశీ క్రీడాకారులు, ప్రతినిధులు, కోచ్‌లో మెచ్చుకుంటూ సామాజిక ప్రసార మాధ్యమాల్లో తమ అభినందనలు తెలియజేశారన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులంతా తమిళ సంస్కృతి, సంప్రదాయాలను, స్వాతంత్య్ర సమరయోధుల గాథలను తెలుసుకోగలిగారని చెప్పారు. రాష్ట్రంలో ద్రావిడ తరహా పాలనను అందిస్తున్న తమ ప్రభుత్వం అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకునే తమిళ క్రీడాకారులందరికీ ‘ఒలంపిక్‌ స్వర్ణపతకాల వేట’ పథకం కింద ఈ ఏడాది వివిధ క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన రాష్ట్రానికి చెందిన 1071 మంది క్రీడాకారులకు రూ.26కోట్లకు పైగా నగదు బహుమతులు అందుకున్నారని చెప్పారు. ఈ బహుమతులందుకున్నవారిలో చెస్‌ క్రీడాకారులే అధికమని చెప్పారు. ఒలంపిక్‌ క్రీడలకు సిద్ధం చేసేలా రూ.60 కోట్లతో 50 మంది క్రీడాకారులను ఎంపిక చేసి అంతర్జాతీయ జాతీయ స్థాయి కోచ్‌ల ద్వారా శిక్షణను అందించనున్నామని, నాలుగేళ్లలోపు వారిని మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్ది ఒలంపిక్‌ క్రీడలకు పంపనున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మినీ క్రీడామైదానాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉత్తర చెన్నై, గోపాలపురంలో బాక్సింగ్‌ శిక్షణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అదే విధంగా తమిళుల సాహసక్రీడ జల్లికట్టు కోసం ప్రత్యేకంగా క్రీడా మైదానాన్ని (స్టేడియం) నిర్మించనున్నామని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, క్రీడలలో ఆసక్తిగా పాల్గొనటమే ముఖ్యమన్నారు. ఈ అవకాశం కల్పించిన ఫిడే నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని స్టాలిన్‌ తెలిపారు. ఈ పోటీలకు హాజరైన అంతర్జాతీయ చెస్‌ క్రీడాకారులంతా మళ్ళీ చెన్నైకి రావాలని, వారి రాకను ఎదురు చూస్తూ ఓ సోదరుడు (స్టాలిన్‌) ఉన్నాడనే విషయాన్ని మరువకూడదంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. 


అలరించిన ‘తమిళ్‌మన్‌ పాట్టు’

అంతకు మునుపు ‘తమిళ్‌మన్‌ పాటు’్ట పేరిట ప్రముఖ సినీ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ప్రముఖ తమిళ సినీనటుడు కమల్‌హాసన్‌ తమిళ, ఆంగ్ల వ్యాఖ్యానంతో నిర్వహించిన తమిళ స్వాతంత్య్ర సమరయోధుల విశేషాలను తెలిపే నృత్యరూపం ప్రేక్షకులను అలరింపజేశాయి. ఆ తర్వాత అన్‌బీటబుల్‌ క్రూ (బృందం) నిర్వహించిన సాహసోపేతమైన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) హైలైట్స్‌పై వీడియో ప్రదర్శన నిర్వహించారు. హర్యానా(Haryana)కు చెందిన రూబీ గేమ్‌లో నిష్ణాతులైన బాలమేధావులైన చిన్నారులు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటాన్ని రూపొందించి ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేయడం విశేషం.



Updated Date - 2022-08-10T14:16:38+05:30 IST