పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తమిళనాడు

ABN , First Publish Date - 2022-06-27T17:10:43+05:30 IST

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా

పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తమిళనాడు

సీఎం స్టాలిన్‌ 

చెన్నై/అడయార్‌: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యం ఎంతో కీలకంగా ఉందన్నారు. స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఈ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ఒక కారణమన్నారు. పైగా రాష్ట్రం పారిశ్రామికంగా అగ్రగామిగా ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ పరిశ్రమలు నడుపుతున్న వారిని మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీస్క్షకుంటామన్నారు. పారంపర్య వ్యాపారం చేయడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ముఖ్యంగా అన్ని రంగాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయని గుర్తుచేశారు. కొవిడ్‌  కారణంగా ఈ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోగా, వీటికి తిరిగి పునరుజ్జీవం కల్పించేలా గత 2022-23 వార్షిక బడ్జెట్‌లో నిధులను కేటాయించడమే కాకుండా, అనేక రాయితీలను ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఈ పరిశ్రమలకు కేటాయించే నిధుల్లో 49 శాతం పెంచి మొత్తం రూ.911.50 కోట్లను కేటాయించినట్టు గుర్తుచేశారు. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని, వీటిద్వారా కోటి మందికిపైగా ఉపాధి అవకాశాలు పొందుతున్నారన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముకగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని, వీటిని అన్ని విధాలా ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని సీఎం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 


తిరుచ్చి జమాల్‌ మహ్మద్‌ కాలేజీ వేడుకల్లో సీఎం 

తిరుచ్చిలోని జమాల్‌ మహమ్మద్‌ కాలేజీలో జరిగిన ముప్పెరువిళా వేడుకల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... వేడుకల్లో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో నేరుగా పాల్గొనాలని తాను భావించినప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించలేదని చెప్పారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వైద్యులు చెప్పినట్టు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుచ్చి నగరంలో ఉన్న ల్యాండ్‌ మార్కుల్లో జమాల్‌ మహమ్మద్‌ కాలేజీ ఒకటన్నారు. ఈ కాలేజీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాలేజీలో చరిత్ర విభాగాన్ని ప్రారంభించిన సీఎం.. కొత్త బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

Updated Date - 2022-06-27T17:10:43+05:30 IST