ఒక డీఏకు ఓకే

ABN , First Publish Date - 2020-10-24T07:53:11+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దసరా పండుగకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. పెండింగ్‌లో ఉన్న మూడు కరువు భత్యాల్లో (డీఏ).. ఒక డీఏను విడుదల చేయడానికి

ఒక డీఏకు ఓకే

ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా కానుక

ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.33 కోట్లు అందజేత

2019 జూలై 1 నుంచి అమల్లోకి కరువు భత్యం

నవంబరు వేతనంతో కలిపి 4 వాయిదాల్లో.. 

ముఖ్యమంత్రి ఆదేశం.. ప్రభుత్వం ఉత్తర్వులు

ఇకపై జాప్యం లేకుండా డీఏ చెల్లించాలి

అందుకు అనుగుణంగా విధివిధానాలు మార్చాలి

అవసరమైతే కేంద్రం ప్రకటించాక సవరణ: సీఎం


హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దసరా పండుగకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. పెండింగ్‌లో ఉన్న మూడు కరువు భత్యాల్లో (డీఏ).. ఒక డీఏను విడుదల చేయడానికి సీఎం అంగీకారం తెలిపారు. వరద బాధితుల సహాయార్థం ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందిస్తూ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా వారితో ఆయన సమావేశమయ్యారు. అనంతరం డీఏను విడుదల చేయాల్సిందిగా ఆర్థికశాఖను ఆదేశించారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉద్యోగుల కోసం జీవోనెం.69, పెన్షనర్ల కోసం జీవోనెం.70 జారీ చేశారు. తాజా ఉత్తర్వులతో.. పెరిగిన డీఏ 2019 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. 16 నెలల (ఈ ఏడాది అక్టోబరు దాకా) బకాయిలను నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. నవంబరు వేతనంతో కలిపి దీనిని చెల్లిస్తారు.


ప్రస్తుతం డీఏ 33.536 శాతంగా ఉండగా.. తాజా పెరుగుదలతో అది 38.776 శాతానికి చేరింది. మొత్తంగా 5.24 శాతం పెరిగింది. దాంతో మూలవేతనం రూ.30 వేలు అందుకునే ఉద్యోగికి నెలకు దాదాపు రూ.1550 పెరగనుంది. వరద బాధితుల సహాయార్థం ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల నుంచి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ నిర్ణయంచగా.. రెండేళ్ల నుంచి ఒక్క రూపాయి జీతం పెరగకుండా మా జీతం విరాళంగా ‘ఎందుకివ్వాలి?’ అంటూ ఉద్యోగులు ప్రశ్నించడంపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ స్పందించారు. తాజా నిర్ణయంతో పూర్తిస్థాయి కంటిజెంట్‌ ఉద్యోగులకు రెమ్యూనరేషన్‌ రూ.3850ల నుంచి రూ.6700కు చేరనుంది. 9వ కేంద్ర వేతన సవరణ కమిషన్‌ (యూజీసీ) వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఎయిడెడ్‌, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ బోధన సిబ్బందికి ప్రస్తుతం 154 శాతంగా డీఏ ఉండగా.. అది 164 శాతానికి చేరనుంది. 


జాప్యం లేకుండా డీఏ చెల్లింపు..

ఉద్యోగులకు డీఏ చెల్లింపు విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ‘‘ప్రస్తుతం డీఏ ఎంత అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. దానిని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం మూడు డీఏలు చెల్లించాల్సి ఉండగా.. ఇందులో రెండు డీఏల విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు కూడా జాప్యం చేయాల్సి వస్తోంది. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగులకు సకాలంలో డీఏ అందడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏను నిర్ణయించాలి’ అని సీఎం అన్నారు. కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దానిని సవరించాలన్నారు.  ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డీఏ ప్రకటించి అమలు చేయాలని, కేంద్రం 3.5 శాతంగా ప్రకటిస్తే.. మిగిలిన 0.5 శాతాన్ని చెల్లించాలని పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం 2.5 శాతంగా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి చెల్లించాలన్నారు. దీనిపై వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని, కేబినెట్‌లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై అన్ని సమస్యలను పరిష్కరిస్తానన్నారు.

దసరా మరుసటి రోజు సెలవు

దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఇకపై ప్రతి ఏడాదీ ఇలాగే దసరా మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.  


ఉద్యోగుల హర్షం

డీఏ విడుదలపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వి.రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు డీఏ పెంపు దసరా పండగకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన కానుకగా అర్చక, ఉద్యోగుల జేఏసీ పేర్కొంది. సీఎం కేసీఆర్‌కు జేఏసీ కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఆనంద్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు.  


ఒకరోజు వేతనం 33 కోట్లు అందజేత

వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33 కోట్లను ప్రభుత్వానికి సహాయంగా అందించే కాన్సెంట్‌ లెటర్‌ను ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్లు, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒకరోజు వేతనాన్ని అందించనున్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన వారిలో టీజీవో అధ్యక్ష, కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారాయణ, టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌,  రాయకంటి ప్రతాప్‌, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్‌ ఉన్నారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ఉద్యోగుల 18 రకాల డిమాండ్లను పరిష్కరించే విషయంలో సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారన్నారు. తమకు సహకరించిన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివా్‌సగౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-10-24T07:53:11+05:30 IST