దాడులు జరగనివ్వం

ABN , First Publish Date - 2021-12-22T08:04:19+05:30 IST

రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ప్రజలందరికీ పూర్తి రక్షణ ఉంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దాడులు జరగనివ్వం


  • మైనారిటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా
  • తెలంగాణ రాష్ట్రంలో అందరికీ స్వేచ్ఛ
  • ఎవరూ ఎవరికీ తలవంచాల్సిన అవసరంలేదు
  • మా ప్రభుత్వం ఉన్నంతవరకు పూర్తి రక్షణ
  • ఏ మతమూ హింసను ప్రోత్సహించదు
  • మనిషిని ప్రేమించలేని వాడు మనిషే కాదు
  • కొందరు పిచ్చి ముస్లింరాజులు గుళ్లు కూల్చారు
  • మరో రాజులు వేరే మతం వారివి కూల్చారు
  • కూల్చివేతలతో సాధించిందేముంది?: కేసీఆర్‌
  • క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి


హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ప్రజలందరికీ పూర్తి రక్షణ ఉంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎవరిపైనా దాడులు జరగకుండా చూసే బాధ్యత తమదన్నారు. ఎవరూ ఎవరికీ తలవంచాల్సిన, భయపడాల్సిన అసవరం లేదని, అందరు స్వేచ్ఛగా జీవించడానికి తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణమైన అవకాశం ఉంటుందని తెలిపారు. ఏ మతమూ హింసను ప్రోత్సహించదని, అన్ని మతాలూ ప్రజలంతా శాంతిగా ఉండాలనే చెబుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఎదుటి మనిషిని ప్రేమించే తత్వాన్ని అలవర్చుకుంటే దానికి మించిన మతం మరొకటి లేదని, అదే గొప్ప మతమని అన్నారు. మానవజాతి అభిమతం అదే కూడా కావాలని, అలా అయినప్పుడు అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకలకు సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. అందరూ సంతోషంగా ఉండాలనే సంకల్పంతో తానే సొంతంగా రంజాన్‌, క్రిస్మస్‌, బతుకమ్మ, బోనాల వేడుకలు నిర్వహిస్తున్నానని చెప్పారు. కరోనా కారణంగా ఒకసారి క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించలేకపోయామని, ఇకపై ఎలాంటి ఆటంకం లేకుండా పండగలు నిర్వహించుకుందామని అన్నారు. దేశంలో మైనారిటీలపై దాడుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి ఘటనలు జరగడం గొప్ప కాదన్నారు. దాడులు చేసి ఏదో చేయాలనుకునేవారి ఆలోచనలు ఎక్కువ రోజులు నిలబడవని, అది తాత్కాలికమేనని అన్నారు. మానవత్వమే సజీవంగా నిలుస్తుందని, అదే శాశ్వతమని చెప్పారు. 


ఏ మతంలోనూ తప్పు లేదని, తప్పు చేయాలని ఏ మతమూ చెప్పలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏ మత బోధకులూ ఈర్షా ద్వేషాలు పెంచుకోవాలని చెప్పలేదన్నారు. మతం కొంచెం ఉన్మాద స్థితికి పోయినప్పుడు, ఆ పిచ్చి నెత్తికెక్కినప్పుడే తప్పు జరుగుతుందని అన్నారు. కొందరు పిచ్చి ముస్లిం రాజులు గుళ్లను కూల్చివేశారని, వారి తీరు హిందువులకు బాధ కలిగించిందని తెలిపారు. కొందరు వేరే రాజులు మరో మతం వారి గుళ్లను కూలగొట్టారని, అలా చేసి సాధించిందేంటని ప్రశ్నించారు. దాని వల్ల మానవజాతికి జరిగిన మేలు ఏమిటని అన్నారు. ప్రతి మనిషీ ఎదుటి మనిషిని ప్రేమించడమే అతి గొప్ప లక్షణమని, మనిషిని ప్రేమించలేని వాడు మనిషే కాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. లక్షల ఏళ్ల క్రితం భూగోళంపై మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి అనేక రకాల విశ్వాసాలు, ఆచరణలు మంచి ఫలితాలు సాధించాయన్నారు. శాంతి బోధనలు, మానవజీవితం ఉజ్వలంగా ముందుకు సాగేందుకు అన్ని తరాల వారు చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఇప్పుడు ఇంత గొప్పగా జీవిస్తున్నామని తెలిపారు.  అనేక మంది శాస్త్రవేత్తలు వారి జీవితాలను త్యాగం చేసి పెన్సిలిన్‌ వంటి మందులను కనిపెట్టారని గుర్తు చేశారు. అమెరికా, ఇంగ్లండ్‌లోనైనా, అరబ్‌ దేశాల్లోనైనా అప్పుడే పుట్టిన పాప ఏడుపు ఒకేలా ఉంటుందని, గిల్లితే కలిగే బాధ కూడా అన్ని దేశాల్లో ఒకేవిధం గా ఉంటుందనే విషయాన్ని మరువ వద్దన్నారు. దుఃఖం, క్షోభ అందరికీ ఒకే విధంగా ఉంటుందన్నారు. అర్థం చేసుకుంటే, ఆస్వాదించ గలిగితే, భారతదేశం అందమైన దేశమన్నా రు. ఇస్లాం దేశాలకు వెళితే రెండే రెండు పండుగలు వస్తాయని, క్రిస్టియన్‌ దేశాలకు వెళ్లినా ఒకటి, రెండు పండుగలు మాత్రమే ఉంటాయని, భారతదేశం మాత్రం ప్రపంచంలోనే రంగుల దేశమని అన్నారు. ఇక్కడ అన్ని పండగలనూ జరుపుకొంటామని తెలిపారు. కరోనా తర్వాత ఆర్థికంగా కొంత వెనకబడ్డా.. ఇప్పుడు తిరిగి పుంజుకున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యమూ ఉందన్నారు.


క్రిస్మస్‌ కేక్‌.. ఆత్మపూర్వక తీపి

క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా కట్‌ చేసే కేక్‌ ఒకరికి ఒకరు తినిపించుకోవడం వల్ల ఆ తీపి కేవలం నాలుకకు మాత్రమే కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అది ఆత్మపూర్వకంగా ఉండే తీపి అని, ఒకరి పట్ల మరొకరికి ఉండే అభిమాన బంధమని తెలిపారు. మానవుల మధ్య ఉండాల్సింది ప్రేమానుబంధమని, ఇలాంటి ప్రేమ వల్లనే మానవజాతి ఇంత వరకు పురోగమించగలిగిందని తెలిపారు. క్రిస్టియన్‌ మైనారిటీ పెద్దలు తన దృష్టికి తెచ్చిన సమస్యలతోపాటు మరెన్నో సమస్యల్ని ఇప్పటికే చాలావరకు పరిష్కరించామని, మిగిలిపోయిన చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు రాబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, అన్ని మతాలను గౌరవించే రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వమే క్రిస్మస్‌ వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. ఈ వేడుకల్లో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, క్రిస్టియన్‌ మతపెద్దలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-22T08:04:19+05:30 IST