ఆక్సిజన్‌ కేంద్రానిది.. ఆర్భాటం జగన్‌ది!

ABN , First Publish Date - 2022-01-11T08:07:15+05:30 IST

‘నవ్వి పోదురుగాక మాకేంటి సిగ్గు’ అని జగనన్న ప్రభుత్వం మరోసారి తప్పుడు ప్రకటనలను గుప్పించింది. సొంత మీడియాకు ఆదాయం కల్పించేందుకు ఒక అవకాశం సృష్టించుకుంది. ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక ఆక్సిజన్‌ సౌకర్యాలు’ అంటూ సోమవారం జగన్‌ సర్కారు పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించింది.

ఆక్సిజన్‌ కేంద్రానిది.. ఆర్భాటం జగన్‌ది!

  • తప్పుడు ప్రకటనల్లో ఆరితేరిన ‘అన్న’ సర్కారు
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి 649 కోట్ల ‘కొవిడ్‌’ నిధులు
  • ఆక్సిజన్‌ ప్లాంట్లు, సదుపాయాల ఖర్చులో సగం కేంద్రానిదే
  • అన్నీ తామే ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్రం సొంత డబ్బా
  • దాతలు, ఇతర సంస్థలు ఇచ్చిన వాటిపైనా తన స్టాంపు
  • ఎస్‌బీఐ ఫౌండేషన్‌ సహకారంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌
  • అది కూడా తామే ఏర్పాటు చేసినట్లుగా కలరింగ్‌


మొన్నటికి మొన్న... ప్రధానమంత్రి ఇచ్చిన మూడో విడత రైతు భరోసా నిధులకు ముఖ్యమంత్రి జగన్‌ ఉత్తుత్తి మీట నొక్కారు! ఇప్పుడు... రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం వాటాతోపాటు దాతలు, ఇతర సంస్థల ఆర్థిక సహాయ సహకారాలతో ఏర్పాటైన ఆక్సిజన్‌ ప్లాంట్లను కూడా ‘జగనన్న’ పూర్తిగా తన ఖాతాలో వేసుకున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘నవ్వి పోదురుగాక మాకేంటి సిగ్గు’ అని జగనన్న ప్రభుత్వం మరోసారి తప్పుడు ప్రకటనలను గుప్పించింది. సొంత మీడియాకు ఆదాయం కల్పించేందుకు ఒక అవకాశం సృష్టించుకుంది. ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక ఆక్సిజన్‌ సౌకర్యాలు’ అంటూ సోమవారం జగన్‌ సర్కారు పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 144 పీఎ్‌సఏ (ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సాప్షన్‌) ఆక్సిజన్‌ ప్లాంట్లను, మరిన్ని సౌకర్యాలను ‘జగనన్న ప్రభుత్వం’ ఏర్పాటు చేస్తోందంటూ అందులో ఊదరగొట్టారు. సోమవారం జగన్‌ వాటిని వర్చువల్‌గా ప్రారంభించి... భారీ ప్రసంగం చేశారు. ఈ ప్రకటనలో కొన్ని పూర్తిగా అసత్యాలుకాగా, మరికొన్ని అర్ధసత్యాలు! ఎందుకంటే... జగన్‌ ప్రారంభించిన 144 పీఎ్‌సఏ యూనిట్లకు పెట్టిన ఖర్చులో సగం వాటా కేంద్ర ప్రభుత్వానిదే. కొవిడ్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యల కోసం కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు రూ.649 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, కొన్ని ఆసుపత్రుల్లో పీఎ్‌సఏ యూనిట్లు, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకుల ఏర్పాటుకు ఈ నిదులను ఉపయోగించారు. కానీ... ఏం జరిగినా, ఏం చేసినా మొత్తం తన ఖాతాలో వేసుకునేందుకు అలవాటు పడిన జగన్‌ ప్రభుత్వం ఆక్సిజన్‌ ప్లాంట్ల విషయంలోనూ అదే చేసింది. రూ.649 కోట్లు ఇచ్చిన కేంద్రం గురించి తన ప్రకటనలో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. కేంద్రం ఇచ్చిన నిధుల సంగతి దాచిపెట్టేసి... మొత్తం ‘జగనన్న ప్రభుత్వమే’ చేసినట్లుగా డబ్బా కొట్టుకుంది.


ఎవరో ఇచ్చిన వాటిమీదా తన పేరే...

పీఎ్‌సఏ యూనిట్లు, ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు... ఇలా అన్నింటిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. మరికొన్నింటిని కొన్ని సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశాయి. చివరికి... వాటిపైనా జగన్‌ తన పేరు రాసేసుకున్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటైంది. ‘‘ఒమైక్రాన్‌ వైరస్‌ నిర్ధారణ కోసం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు. దేశంలో కేరళ తర్వాత మన రాష్ట్రంలోని విజయవాడలో మాత్రమే ఇది ఏర్పాటైంది’’ అని జగన్‌ సర్కారు పేర్కొంది. వెరసి... అది కూడా తామే ఏర్పాటు చేసినట్లు కలరింగ్‌ ఇచ్చింది. నిజానికి ఈ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ పాత్రే లేదు. కానీ... ఎస్‌బీఐ ఫౌండేషన్‌ సహకారంతో సీసీఎంబీ ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ను కూడా జగనన్న ప్రభుత్వం తన ఘనతగానే చెప్పుకొంది.


ఆలస్యం చేసినా ఆర్భాటం

‘లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ రవాణా, నిల్వ కోసం 25 క్రయోజనిక్‌ ట్యాంకులు’ అంటూ ప్రభుత్వం మరో గొప్పకు పోయింది. క్రయోజనిక్‌ ట్యాంకుల కొనుగోలు ప్రక్రియలో ఏపీఎంఎ్‌సఐడీసీ (వైద్య సరఫరాలు, అభివృద్ధి సంస్థ) నిబంధనలు పాటించ లేదు. కొవిడ్‌ రెండో దశలో తీవ్రస్థాయిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిని నివారించేందుకు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు కొనాలని అప్పట్లోనే నిర్ణయించారు. ఆరు నెలల తర్వాత వాటిని ఇప్పుడు తీసుకువచ్చారు. వీటిని కూడా విదేశాల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఏపీకి తీసుకువచ్చారు.


కరోనాకు ముందే ల్యాబ్‌లా!?

ఖర్మకాలి కొవిడ్‌-19 విజృంభించడంతో ప్రపంచమంతా వణికిపోతోంది. అప్పటిదాకా... ఆర్టీపీసీఆర్‌ గురించి ఎవరికీ తెలియదు. సామాన్యులెవరూ ఆ మాటే వినలేదు. అలాంటి పరీక్షలు చేయించుకోవల్సిన అవసరమూ రాలే దు. దేశవ్యాప్తంగా అక్కడక్కడ మాత్రమే వైరల్‌ ల్యాబ్‌లు (వీఆర్‌డీఎల్‌) ఉండేవి. కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసే ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. దీనిని జగనన్న ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకోవడమే కాదు... ‘గతంలో కనీసం ఒక్క వైరల్‌ ల్యాబ్‌ కూడా లేని దుస్థితిని చక్కదిద్దాం’ అంటూ టీడీపీ సర్కారుపై విమర్శలు గుప్పించింది.


కోట్లల్లో బిల్లు బకాయిలు..

కరోనా బాధితుల కోసం పీఎ్‌సఏ ప్లాంట్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పుకొంటున్న సర్కారు... ఇప్పటిదాకా ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేసిన కంపెనీలకు కోట్లలో బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. కరోనా తొలి దశలో రూ.20 కోట్లు.. రెండో దశలో రూ.70 కోట్ల వరకూ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రేపు, మాపు అనుకుంటూ కాలం గడిపేస్తున్నారు తప్ప బిల్లులు మాత్రం చెల్లించడంలేదు. మరో వారం రోజుల్లో పెండింగ్‌ బిల్లులు విడుదల చేయకపోతే తాము ఆక్సిజన్‌ సరఫరా చేయలేమని కంపెనీలు డీఎంఈకి, ఇతర ఉన్నతాధికారులు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోతే.. కొవిడ్‌ రోగులతోపాటు సాధారణ రోగులు కూడా ఆస్పత్రుల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-11T08:07:15+05:30 IST