‘హోదా’ బహు దూరం!

ABN , First Publish Date - 2020-05-29T07:28:41+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నోట అనేక నెలల తర్వాత ‘ప్రత్యేక హోదా’ అనే మాట వినిపించింది.

‘హోదా’ బహు దూరం!

  • కేంద్రానికి మన అవసరం వస్తేనే ఇస్తారు
  • దురదృష్టవశాత్తూ బీజేపీకి పూర్తి మెజారిటీ
  • ఎప్పుడైనా కేంద్రంలో ‘ఆ సమయం’ వస్తుంది
  • అప్పుడు హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామంటాం!
  • మా ప్రభుత్వంలో లంచాలు ఇవ్వక్కర్లేదు
  • గత సర్కారుతో ఒప్పందాలు చేసుకున్న వాటిలో
  • 39 వేల కోట్ల విలువైన పరిశ్రమలు ప్రారంభం
  • అబద్ధాలు చెప్పను.. నిజాయితీ, నిబద్ధత ఉండాలి
  • పరిశ్రమల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నోట అనేక నెలల తర్వాత ‘ప్రత్యేక హోదా’ అనే మాట వినిపించింది. అధికారం చేపట్టిన కొత్తలో చెప్పినట్లుగానే... ‘కేంద్రానికి మన ఎంపీల అవసరం ఉంటేనే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తుంది’ అని ఆయన తెలిపారు. ‘మన పాలన - మీ సూచన’లో భాగంగా గురువారం ఆయన పారిశ్రామిక రంగంపై సమీక్షించారు. ‘‘రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చి ఇవ్వలేదు.  హోదా వచ్చి ఉంటే పారిశ్రామిక రాయితీలు ఇంకా ఎక్కువగా ఉండేవి. రాయితీల్లో అధిక భారాన్ని కేంద్రం మోసేది. దురదృష్టవశాత్తూ... గతంలో కేంద్రంతో కలసి కాపురం చేసినా కూడా స్పెషల్‌ స్టేటస్‌ తెచ్చుకోలేకపోయారు. ఎన్నికల్లో వైసీపీ 25 లోక్‌సభ స్థానాలకు 22 స్థానాలను స్వీప్‌ చేసింది.


కేంద్రంలో వాళ్లకు సంపూర్ణమైన మెజారిటీ రాకపోయి ఉండిఉంటే,  వాళ్లు మెజారిటీలో సగం మార్కుకు చేరుకోలేకపోయి ఉంటే.... అప్పుడు తప్పనిసరిగా రాష్ట్రం ప్రయోజనం పొంది ఉండేది. ప్రత్యేక హోదా ఇస్తేనే తాము మద్దతు ఇస్తామంటూ ఇరుపక్షాలతో బేరమాడేవాళ్లం. కానీ, దురదృష్టవశాత్తూ అది  జరగలేదు. కేంద్రంలోని బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. దీనివల్ల  మనతో అవసరం లేకుండా పోయింది. కాబట్టి స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితి ఉంది’’ అని జగన్‌ వివరించారు.


ఈరోజు కాకుంటే... రేపైనా!

అడగడం మానేస్తే ఇక ఏరోజూ మనకు ప్రత్యేక హోదా రాదని తనకు తెలుసునని జగన్‌ చెప్పారు. ‘‘కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తేనే మేం మద్దతు ఇస్తాము అని చెబుతాం. మన ఆలోచనలు ఎప్పుడైనా కూడా ముందుకు తీసుకుని వస్తాం. హోదా అన్నది ఎప్పుడో ఒకసారి రియలైజ్‌ అవుతుంది’’ అని తెలిపారు. హోదా లేకపోయినా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు అన్నీ చేసుకుంటూ  పోతామన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను నిర్మిస్తామని.. అదేవిధంగా మత్స్యకారులకు స్థానికంగా ఉపాధి లభించేలా 8 ఫిషింగ్‌ హార్బర్‌లను నిర్మిస్తామని అన్నారు.


ఇవే మన బలాలు... 

రాష్ట్రంలో బలమైన, సుస్థిర ప్రభుత్వం ఉందని జగన్‌ తెలిపారు. అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. అవే తమ బలాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి లంచాలూ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ పోలీసు వ్యవస్థ ఉందని సీఎం కితాబిచ్చారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. ‘‘ఏదైనా చెప్పేటప్పుడు మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వంలో అన్నీ అబద్ధాలే చెప్పారు. రాయితీలు ఎగ్గొట్టి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అన్నారు. గత ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక సంస్థలకు రూ.4000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. ఎంఎ్‌సఎంఈలకూ రూ.968 కోట్లు చెల్లించలేదు.


ఇందులో రూ.450 కోట్లు చెల్లించాం. మిగిలిన మొత్తాన్ని జూలైలో చెల్లిస్తాం’’ అని తెలిపారు. తమది ప్రోయాక్టివ్‌ గవర్నమెంట్‌ అని... అందుకే గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న రూ.39వేల  కోట్ల విలువైన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయని చెప్పారు. తమ హయాంలో దాదాపు 13222 ఎంఎ్‌సఎంఈల ద్వారా 63 వేల మందికి ఉపాధి కలిగిందని... లాక్‌డౌన్‌ వల్ల ఈ పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని తెలిపారు. పరిశ్రమలకు అన్ని విధాలుగా  అండగా ఉంటామని జగన్‌ ప్రకటించారు. వారి అవసరాలు తీరేలా రాష్ట్రమంతా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.


గ్యాస్‌ లీక్‌పై ‘తండ్రి’లాగా....

విశాఖ గ్యాస్‌ దుర్ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. కేవలం పది రోజుల్లో 50 కోట్లను పరిహారం చెల్లించామని చెప్పారు. ‘‘ఈ గ్యాస్‌ లీక్‌ ఘటనలో ఒక తండ్రిలా చేయాల్సిందంతా చేశాను. ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ఆరెంజ్‌, రెడ్‌ పరిశ్రమలు రావద్దు. అందుకే కాలుష్య నియంత్రణ చట్టంలో మార్పులు తెస్తున్నాం’’ అన్నారు. 


ఆ సత్తా విశాఖకే ఉంది!

విశాఖను పాలనా రాజధానిగా మారుస్తున్న నేపథ్యంలో అక్కడికి అవసరమైన విధంగా అంతర్జాతీయ విమానాశ్రయం వస్తోందని.. ఈ పనులను జీఎంఆర్‌కు అప్పగించామని సీఎం చెప్పారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై నగరాలతో పోటీ పడగల సత్తా విశాఖకే ఉందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. విశాఖలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌  కోసం అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్‌  యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - 2020-05-29T07:28:41+05:30 IST