ముఖ్యమంత్రి మైనార్టీ ద్రోహి

ABN , First Publish Date - 2021-10-20T05:28:07+05:30 IST

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి మైనార్టీ ద్రోహి అని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు ఆరోపించారు.

ముఖ్యమంత్రి మైనార్టీ ద్రోహి
కడపలో అమీర్‌బాబు ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు

ఎంపీపీ పదవి కోసం దిగజారుడు రాజకీయాలు

మైనార్టీ శాఖ మంత్రి స్పందించాలి

కడప టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు


కడప, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి మైనార్టీ ద్రోహి అని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు ఆరోపించారు. మంగళవారం కోఆపరేటీవ్‌ కాలనీలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని దుగ్గిరాళ్ల మండలం, చిలువూరు ఎంపీటీసీగా గెలుపొందిన ముస్లిం మైనార్టీ మహిళ షేక్‌ జబీన్‌కు కుల ఽధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్‌ తిరస్కరించడం అన్యాయమన్నారు. మైనార్టీలోని బీసీ మహిళకు రాజ్యాధికారాన్ని వైసీపీ దూరం చేస్తోందని మండిపడ్డారు. ఆ కలెక్టర్‌ రాజ్యాంగబద్ధంగా కాకుండా ముఖ్యమంత్రి జగన్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తొత్తుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేసినట్లన్నారు. షేక్‌ జబీన్‌ను టీడీపీ కింద ఎంపీపీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దొడ్డిదారిన స్థానిక అధికారులను అడ్డుపెట్టుకొని ఆమెకు కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. జీవో నెం.ఎంఎ్‌స23లో షేక్‌ మరియు మహ్మద్‌లను బీసీ-ఈలుగా పరిగణించారని స్పష్టంగా ఉందన్నారు. జబీన్‌కు కులధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడం ఒక్క బీసీ మహిళ సమస్య కాదు రాష్ట్ర మైనార్టీలు అందరి సమస్య అన్నారు. రాబోయే రోజుల్లో ముస్లింలకు అనర్థాలు జరిగే అవకాశం ఉందన్నారు. దీని పై మైనార్టీ శాఖ మంత్రి స్పందించి ముస్లింలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మాస కోదండ, నాసర్‌అలీ పాల్గొన్నారు.


అమీర్‌బాబు ఇంటిని ముట్టడించిన వైసీపీ నేతలు 

కడప టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జి వీఎస్‌ అమీర్‌బాబు ఇంటిని వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఇంటిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీటీసీ అభ్యర్థి జబీన్‌కు మండల అధ్యక్ష పదవి దక్కకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తోందని, ఆమెకు కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, ఇంత జరుగుతున్నా మైనార్టీ మంత్రి స్పందించలేదని, మైనార్టీ ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి అంటూ అమీర్‌బాబు ఆయన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమాచారాన్ని వాట్స్‌ఆప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్పొరేటర్లు రామలక్ష్మణ్‌రెడ్డి, మల్లి, కిరణ్‌, బాబుతో పాటు ఆపార్టీ నాయకులు బసవరాజు, త్యాగరాజు, గరుడాద్రి, కోఆప్షన్‌ మెంబర్లు మరియేలు, ఐస్‌ క్రీమ్‌ రవి, వెంకటసుబ్బమ్మ, పలువురు వైసీపీ నేతలు సాయంత్రం కోఆపరేటీవ్‌ కాలనీలోని అమీర్‌బాబు ఇంటిని ముట్టడించారు. చాలా సేపు ఇంటి బయట బైఠాయించి నినాదాలు చేశారు. అమీర్‌బాబు నాయకత్వం వర్ధిలాలి అంటూ ఆయన వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నేతలు అమీర్‌బాబు ఇంటి గేటు తీసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చెయ్యిదాటుతుందని భావించి వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణతో పాటు పలువురు పోలీసులు ఇంటిలోకి వెళుతున్న వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.



Updated Date - 2021-10-20T05:28:07+05:30 IST