ధర్మం మరణిస్తే ఎవరూ బతికించలేరు

ABN , First Publish Date - 2022-08-16T06:53:21+05:30 IST

న్యాయం అందించడం కేవలం న్యాయ వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వం, చట్టసభలకు సమానమైన కర్తవ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. రాజ్యాంగంలోని 38వ

ధర్మం మరణిస్తే ఎవరూ బతికించలేరు

ప్రజల మనస్సులో అది ఉంటుంది

కోర్టులే రాజ్యాంగాన్ని సంరక్షించాయి: చీఫ్‌ జస్టిస్‌ రమణ


న్యూఢిల్లీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): న్యాయం అందించడం కేవలం న్యాయ వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వం, చట్టసభలకు సమానమైన కర్తవ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. రాజ్యాంగంలోని 38వ అధికరణ ప్రకారం ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అయినప్పటికీ ఈ రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చేందుకు న్యాయ వ్యవస్థ కృషి చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, కాగ్‌ లాంటి సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్యను గుర్తు చేసుకున్నారు.


ఈ త్రివర్ణ పతాకం స్వతంత్ర భారత గుర్తింపుకు ప్రతీకగా మారిందని అన్నారు. రాజ్యాంగానికి సరైన సంరక్షక పాత్రను కోర్టులే పోషించాయని జస్టిస్‌ రమణ అన్నారు. ధర్మానికి, చట్టానికి మధ్య ఉన్న తేడాను కూడా ఆయన వివరించారు. ధర్మమనేది చట్టాలకు మించినదని అన్నారు. ‘ధర్మం ప్రజల మనసుల్లో ఉంటుంది. అది ప్రజల మనసుల్లో మరణించినప్పుడు ఏ రాజ్యాంగమూ, ఏ చట్టమూ, ఏ సవరణా దాన్ని కాపాడలేదు’ అని ప్రముఖ న్యాయనిపుణుడు నానీ పాల్కీవాలా అన్న మాటల్ని జస్టిస్‌ రమణ ఈ సందర్భంగా ఉటంకించారు. కాగా, భారత న్యాయవ్యవస్థ దేశంలో అత్యంత విశ్వసనీయ వ్యవస్థగా ఎదిగిందని జస్టిస్‌ రమణ అన్నారు. సుప్రీంకోర్టు రూపొందించిన ‘భారత న్యాయస్థానాలు, నాటి నుంచి నేటి వరకు’ అన్న  తెలుగు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. దీనితో ఈ పుస్తకం ఏడు భాషల్లో ముద్రణ జరిగినట్లయిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయమంత్రి కిరెణ్‌ రిజుజు, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ పాల్గొన్నారు.


తీర్పులపై విమర్శలు పరిధులు దాటకూడదు

జస్టిస్‌ లలిత్‌ అభిప్రాయం 

న్యూఢిల్లీ, ఆగస్టు 15: న్యాయ ప్రక్రియ శీఘ్రగతిన కొనసాగాలని కాబోయే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ అన్నారు. తీర్పుల్లో స్పష్టత, స్థిరత్వం కూడా ఉండాలని చెప్పారు. స్థిరత్వం లేకుంటే మొత్తం న్యాయ చక్రమే దెబ్బతింటుందని అన్నారు. ఆయన ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తీర్పులు, జడ్జీలు, మొత్తంగా కోర్టులపై వస్తున్న విమర్శలను ప్రస్తావించారు. జడ్జీలు కూడా ప్రజా సేవకులేనని, అందువల్ల వారిచ్చే తీర్పులు సమాజ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నవీ లేనిదీ పరిశీలించే అధికారం ప్రజలకు ఉందని చెప్పారు. అయితే ఈ విమర్శలు పరిమితులకు లోబడే ఉండాలని అన్నారు. దీనికొక లక్ష్మణ రేఖ ఉండాలని తెలిపారు. ఎవరైనా జడ్జి సరైన తీర్పు ఇవ్వలేదని భావిస్తే దానిపై స్పష్టమైన విమర్శ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అప్పుడే న్యాయ వ్యవస్థ కూడా తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2022-08-16T06:53:21+05:30 IST