ఎన్టీఆర్‌ మనిషిగా ముద్రపై గర్విస్తున్నా

ABN , First Publish Date - 2022-06-10T08:13:52+05:30 IST

ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ ఆయనతో ఎంతో సన్నిహితంగా మెలిగానని, ఆ కారణంగా ఎన్టీఆర్‌ మనిషిగా తనపై ముద్ర పడినందుకు

ఎన్టీఆర్‌ మనిషిగా ముద్రపై గర్విస్తున్నా

రిటైరయ్యాక ఆయనపై పుస్తకం రాస్తా: జస్టిస్‌ రమణ


తిరుపతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ ఆయనతో ఎంతో సన్నిహితంగా మెలిగానని, ఆ కారణంగా ఎన్టీఆర్‌ మనిషిగా తనపై ముద్ర పడినందుకు గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. గురువారం తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ గురించి సంపూర్ణంగా వర్ణించదగిన వారెవరూ లేరని, అలా వర్ణించడం సామాన్యమైన విషయం కాదని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సమగ్రమైన మానవతామూర్తిగా పేరున్న రామారావును పేదలు ఎన్టీవోడని, మధ్య తరగతి వర్గాలు ఎన్టీఆర్‌ అని, విద్యావంతులు నందమూరి తారక రామారావు అని... ఇలా ఏ పేరుతో పిలిచినా అందరిలోనూ ఆయన పట్ల అభిమానమే వొలుకుతుందని తెలిపారు.


రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, సమాజ సేవకుడిగా, కుటుంబ పెద్దగా, సినీనటుడిగా, కళాకారుడిగా, వారికి పెద్దదిక్కుగా ప్రతి దశలో రామారావు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారని, ఆయన సహజ నటుడే కాకుండా సహజ నాయకుడు కూడానని చెప్పారు. రాజకీయాల్లో ఎవరికీ అంతుబట్టని రీతిలో ప్రయోగాలు చేశారని, జనం నాడి తెలిసిన నేతగా ప్రజలతో మమేకమయ్యారని తెలిపారు. అలాంటి నేత మరొకరు లేరన్నారు. చైతన్య రథంపై గ్రామగ్రామం తిరిగి జనంలో చైతన్యం తెచ్చారని, అధికారంలోకి వచ్చాక ప్రజలకు అపారమైన సేవ చేశారని శ్లాఘించారు. ముక్కుసూటితనం,భోళాతనం, నిజాయితీ, అమాయకత్వం వంటి అనేక సుగుణాలు కలబోసిన ఎన్టీఆర్‌ ఆహారం, ఆహార్యం, సంగీతం, కళలు, భాష వంటి అన్నింటినీ ఆస్వాదించగలిగిన శక్తిసామర్ధ్యాలు కలిగినవారని కొనియాడారు. ఇన్ని సుగుణాలు ఒకే మనిషిలో ఉండడం అరుదైన విషయమన్నారు. 


ఎన్టీఆర్‌ తో ఫొటో దిగాలనుకున్నా..

1971లో తమ గ్రామానికి ఎన్టీఆర్‌ వస్తే ఫొటో దిగాలనుకున్నానని, కానీ మహాజన సంద్రంలో బతికి బట్టకడతానా అన్న భయం కలిగిందని జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. తాను లా చివరి సంవత్సరంలో ఉండగా ఎన్టీఆర్‌ టీడీపీని పెట్టినపుడు రోజూ వెళ్లి కలిసేవాడినని, ఆ తర్వాత న్యాయవాదిగా తన వంతు సహకారం అందించానని తెలిపారు.


అత్యంత సామాన్య జీవితాన్ని చూశా..

అత్యంత సామాన్యమైన ఎన్టీఆర్‌ జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూశానని జస్టిస్‌ రమణ చెప్పారు. ఆరు అంగుళాల ఎత్తున్న చిన్న బల్లమీద పరుపు వేసుకుని పడుకునేవారని, ఏసీ కూడా వాడేవారు కాదని తెలిపారు. వీలైతే రిటైరైన తర్వాత ఎన్టీఆర్‌ గురించి పుస్తకం రాస్తానన్నారు.    ప్రజల గురించి ఆయన ఏ రకంగా ఆలోచించేవారో, ప్రజలకు ఏదో చేయాలని ఎంత తపన పడేవారో, ఆయన గొప్పతనం, వ్యక్తిత్వం ప్రజలకు తెలియజేసేందుకు పుస్తకం రాస్తానన్నారు.


తెలుగుజాతికే గౌరవం..

తెలుగు జాతికి తలమానికమైన ఎన్టీఆర్‌కు తగిన గౌరవం లభిస్తే అది తెలుగు జాతికంతా గౌరవం లభించినట్టవుతుందని జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యమంటే అబ్రహం లింకన్‌ ఇచ్చిన నిర్వచనం గురించి అందరూ చెబుతారు. అయితే, సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ ఇచ్చిన నిర్వచనం కంటే ఉత్తమంగా, క్లుప్తంగా ప్రజాస్వామ్యాన్ని నిర్వచించడం మరెవరికీ సాధ్యం కాలేదు’ అన్నారు. ఆయనకు అవార్డుల విషయంలో చిన్న చూపు చూశారని, బాధాకరమని చెప్పారు. ఆయనకు ఇవ్వడం వల్ల అవార్డులకే విలువ పెరిగేదన్నారు.  తెలుగు భాష, సంస్కృతి, ఆత్మగౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత తెలుగు ప్రజలకు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకూ ఉందన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా భాషను, సంస్కృతిని పరిరక్షించుకునేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  


ప్రముఖులకు పురస్కారాల ప్రదానం..

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.  పన్నెండు నెలలు, పన్నెండు కేంద్రాల్లో ఒక్కొక్క కళ, సాహిత్యాన్ని కేంద్ర బిందువు చేసుకుంటూ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రముఖ పండితుడు మేడసాని మోహన్‌ అష్టావధానం నిర్వహించారు. ఆయనతో పాటు వివిధ రంగాల ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు  మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


శ్రీవారి సేవలో సీజేఐ

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబసమేతంగా గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు నైవేద్య విరామ సమయంలో ధ్వజస్తంభాన్ని తాకుతూ గర్భాలయంలోని వెళ్లి మూలమూర్తిని, అనంతరం వరాహస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం మరోసారి స్వామిని దర్శించుకోనున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-06-10T08:13:52+05:30 IST