అవి ఇవ్వడం మాని పుస్తకాలు బహుమతులుగా ఇవ్వండి: సీజేఐ ఎన్.వీ.రమణ

ABN , First Publish Date - 2021-12-29T00:54:51+05:30 IST

హైదరాబాద్: బొకేలు, షాల్స్ ఇవ్వడం మాని పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాలని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్.వీ.రమణ పిలుపునిచ్చారు.

అవి ఇవ్వడం మాని పుస్తకాలు బహుమతులుగా ఇవ్వండి: సీజేఐ ఎన్.వీ.రమణ

హైదరాబాద్: బొకేలు, షాల్స్ ఇవ్వడం మాని పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాలని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్.వీ.రమణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పుస్తక ప్రియులను ప్రోత్సహిస్తూ మాట్లాడారు. పుస్తకం రాబోయే రోజుల్లో మనుగడ సాధిస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్న సమయంలో అనేక మంది యువతి యువకులు రావడం చూస్తే పుస్తకం సజీవంగా ఉంటుందని నమ్మకం కలుగుతోందన్నారు. చిరిగిన చొక్కా వేసుకున్నా పర్వాలేదు కానీ మంచి పుస్తకము మాత్రం కొనుక్కోవాలన్నారు. తాను చదువుకున్న పాఠశాల గ్రంధాలయం తనకు ఎంతో ఉపయోగపడిందని గుర్తు చేసుకుంటూ ఈ రోజున అటువంటి పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆట స్థలం, గ్రంధాలయం ప్రతి పాఠశాలలో ఉండాలని, ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. పుస్తకం చదవడం జ్ఞానాన్ని పెంచుతుందన్నారు. సాహిత్యం, కవులు రాసిన పుస్తకాలు చదవడం ముఖ్యమని, భావ వ్యక్తీకరణ, విజ్ఞానం పుస్తకాలతోనే అలవడుతుందని చెప్పారు. చాలా మంది ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ జీవితాలను త్యాగం చేశారని, అటువంటి వారి గురించి చదువుకోవాలని రమణ సూచించారు. కాఫీ కన్నా పుస్తకాలు ఎక్కువ కిక్ ఇస్తాయన్నారు. గ్రంధాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలని, నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రజలు చదువుతారనే విశ్వాసం కలిగితే పుస్తకము రాస్తానన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పులను తెలుగుతో పాటు అన్ని భాషల్లోకి అనువాదాలు చేసి వెబ్ సైట్‌లో పెడుతున్నామని, అది మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-12-29T00:54:51+05:30 IST