ఐసీహెచ్ఆర్ పోస్టర్‌లో నెహ్రూకు చోటేదీ?: చిదంబరం

ABN , First Publish Date - 2021-08-30T00:04:59+05:30 IST

దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) విడుదల చేసిన పోస్టర్‌లో..

ఐసీహెచ్ఆర్ పోస్టర్‌లో నెహ్రూకు చోటేదీ?: చిదంబరం

న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) విడుదల చేసిన పోస్టర్‌లో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు చోటు లేకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు.   దీనిపై స్వయంప్రతిపత్తి కలిగిన ఐసీహెచ్ఆర్ ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ''75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా విడుదల చేసిన తొలి డిజిటల్ పోస్టర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ఫోటో లేదు. దీనిపై ఐసీహెచ్ఆర్ మెంబర్ సెక్రటరీ ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉంది'' అని చిదంబరం ఆదివారంనాడు ఓ  ట్వీట్‌లో తప్పుపట్టారు.


కాగా, ఇది అనవసరమైన వివాదమని ఐసీహెచ్ఆర్ పేర్కొంది. స్వాతంత్ర్య సమరయోధుల ఎంపిక వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని తెలిపింది. దీనిపై చిదంబరం వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పిస్తూ, మోటార్ కార్ పుట్టుక ఉత్సవాలు జరపాలనుకుంటే హెన్రీ ఫోర్డ్‌ను పక్కనపెట్టేస్తారా? ఏవియేషన్ గురించి చెప్పాల్సి వస్తే రైట్ బ్రదర్స్‌ను విస్మరిస్తారా? ఇండియన్ సైన్స్‌ ఉత్సవాలనుకుంటే సీవీ రామన్‌ను తప్పించగలరా?'' అని చిదంబరం ప్రశ్నించారు.

Updated Date - 2021-08-30T00:04:59+05:30 IST