ప్రమాదకర స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ

ABN , First Publish Date - 2021-10-25T06:17:43+05:30 IST

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరస్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదకర స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ

మరో 9నెలలు ఆర్థిక మందగమనం

కేంద్రం దురాశతోనే పెట్రో ధరల పెంపు: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం 


చెన్నై, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరస్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం ఇంకా పూర్తిగా తొలగిపోలేదన్నారు. స్పష్టంగా చెప్పాలంటే, ఆర్థిక స్థితి 2018-19కి సమానంగా కూడా పురోగమించలేదని చెప్పారు. ఆదివారం తమిళనాడు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వృద్ధిలో కూడా తారతమ్యాలు ఉన్నాయని తెలిపారు. ఒక వర్గం వారు వృద్ధి చెందడం, మరో వర్గం ప్రజలు అధ్వాన స్థితికి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. దేశంలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఆదాయం పెరిగిందని, మరో 40 శాతం మంది పతనావస్థ దిశగా, మిగిలిన 50 శాతం మంది ప్రజలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారని తెలిపారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం నెలకొందని, ఇది 2022 వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రకారం.. దేశ ఆర్థిక మందగమనం మరో 9 నెలల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈలోపు ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. ఇదేసమయంలో దేశంలో పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే వస్తువుపై 33 శాతం పన్ను విధించడం అంటే.. బలవంతపు పన్ను వసూలుతో సమానమన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ దురాశ ఇట్టే తెలిసిపోతోందని విమిర్శించారు.

Updated Date - 2021-10-25T06:17:43+05:30 IST