Abn logo
May 23 2020 @ 05:53AM

కొత్త బడ్జెట్టే మార్గాంతరం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 12న ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని నేను గత వారం ఇదే కాలమ్‌లో విశ్లేషించాను (‘మే 16, ‘మిథ్యా వాగ్దానాల ఉద్దీపనలు’). ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీ వివరాలను ఐదు విడతలుగా వెల్లడించారు. విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు ఆ వివరాలను నిశితంగా పరిశీలించారు. ఆ ప్యాకేజీలో భాగంగా ఉన్న ద్రవ్య ఉద్దీపన (ఫిస్కల్ స్టిములస్) స్థూల దేశియోత్పత్తి (జీడీపీ)లో 0.8 నుంచి 1.3 శాతం వేరకు ఉంటుందనే ఏకగ్రీవ నిర్ణయానికి వారందరూ రావడం గమనార్హం. మరి నేనూ వివిధ రంగాల వారీగా ఆ ప్యాకేజీని విపులంగా విశ్లేషించి ద్రవ్య ఉద్దీపన పరిమాణం రూ.1,86,650 కోట్లు (జీడీపీలో 0.91 శాతం) గా నిర్దారించాను. ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ నా అంకెలతో విభేదించలేదు.


కరోనా వైరస్ మన దేశంలో ప్రబలడం ప్రారంభమయినప్పుడు ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఏలా వున్నాయో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవల్సిన అవసరమున్నది. అప్పటికి, వరుసగా ఏడు త్రైమాసికాలలో జీడీపీ పెరుగుదల రేటు తగ్గిపోతూ వస్తున్నది. ఇంతకు ముందెన్నడూ సంభవించని ఆర్థిక పతనమది. 2020 మార్చి 11న కొవిడ్ -19ని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ పరిస్థితి నుంచి మన దృష్టి కరోనా కట్టడివైపుకు మళ్ళింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవ్వడానికి కరోనా మహమ్మారేనని ప్రభుత్వం ఇప్పుడు అదేపనిగా ఆక్రోశిస్తోంది. అయితే నిజమేమిటి? ఇప్పుడు మనలను చుట్టిముట్టివున్న ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ దారితప్పిన విధానాల పుణ్యమే సుమా!


లాక్‌డౌన్ అనివార్యమైనది. గత మార్చిలో ఈ విషయమై తొలుత నిర్ణయం తీసుకున్నప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఏకైక మార్గం ‘సామాజిక దూరం’ పాటించడమే. ఇందుకు లాక్‌డౌన్ విధించడం తప్పనిసరి. ప్రత్యామ్నాయ వ్యూహం ఏదీ లేకపోవడంతో లాక్‌డౌన్ ను పొడిగిస్తూ పోవడం మినహా ప్రభుత్వానికి మరో గత్యంతరం లేకపోయింది. అయితే లాక్‌డౌన్ మొదటినుంచీ పరిస్థితులు మెరుగపడకపోగా మరింతగా క్షీణించిపోసాగాయి. కొవిడ్-19 కేవలం ఆరోగ్య విపత్తు, ఆర్థిక సంక్షోభం మాత్రమేకాదు మానవ జీవితం మొత్తాన్ని అమితంగా కల్లోలపరిచిన మహాజాడ్యం.


లాక్‌డౌన్ 1.0 అనంతరం ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమూ సరైన ఫలితాల నివ్వలేదు. ప్రతిదీ ప్రశ్నార్థకమైపోయింది. పరిస్థితి మెరుగుపడడం లేదన్న వాస్తవాన్నిపాలకులూ గుర్తించారు. కనుకనే కాబోలు లాక్‌డౌన్ 3.0 సందర్భంగా ప్రధానమంత్రి జాతీయ టెలివిజన్‌లో దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించలేదు. ఆ లాక్‌డౌన్ ప్రకటన బాధ్యతను కేంద్ర హోం శాఖకు వదిలివేశారు. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనే బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేశారు. 


అయితే దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడమనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేని వ్యవహారం. అందుకు అవసరమైన అధికారాలు ఏవీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేవు కదా. కేంద్ర ప్రభు త్వం ఇప్పుడు ఒక సామ్రాజ్య ప్రభుత్వంగా వ్యవహరిస్తోంది అన్ని అధికారాలూ ప్రధానమంత్రి కార్యాలయం (పి ఎం ఓ) లో కేంద్రీకృతమైపోయాయి.నిధుల కోసం పి ఎం ఓను దేబిరించాల్సిన దుర్గతి రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టింది. చివరకు డిస్కామ్‌లకు ఆర్థిక సహాయం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పులపై గరిష్ఠ పరిమితి పెంపుదల రూపేణా రాష్ట్రాలకు తాము పెద్ద ఎత్తున తోడ్పడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అట్టహాసంగా ప్రకటనలు చేశారు. ఇంతకూ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని పలు షరతులతో మాత్ర మే ఇచ్చారు ఆ షరతులను పాటించగల పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిరాష్ట్ర ప్రభుత్వమూ తీవ్ర నిధుల కొరతను నెదుర్కోవడం ఖాయం. 


ఈ పరిస్థితి ఎక్కడికి దారితీయనున్నది? తీవ్ర ఆర్థిక మాంద్యానికేననడంలో సందేహం లేదు భారత్ గత నాలుగు దశాబ్దాలుగా జీడీపీలో ప్రతికూల లేదా రుణాత్మక పెరుగుదల ను చవిచూడలేదు. ఈ ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఆర్థిక వ్యవస్థ దుస్థితికి కరోనా మహమ్మారే కారణమని పాలకుల ఘంటాపథంగా చెబుతున్నారు. ఏమైనా అసలు పాపం మోదీ ప్రభుత్వానిదేననడంలో సందేహం లేదు. 2016 నవంబర్ 8 (పెద్ద నోట్ల రద్దు) నాటి నుంచి మోదీ ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన చర్యలూ ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పడం లేదన్నది ఒక కఠోర వాస్తవం. 


కరోనా మహమ్మారి పై యుద్ధంలో చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్‌ల మార్గాలనే ప్రధానమంత్రి అనుసరిస్తున్నారు. తొలుత లాక్‌డౌన్ విధించారు. ఆ తరువాత వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, సంబంధిత రోగులకు ఎవరి నుంచి సోకిందో కనుగొనడం, వైరస్ బాధితులను క్వారంటైన్‌కు పంపించి చికిత్సచేయడం చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య భద్రతా సదుపాయాలను అదనంగా సమకూర్చారు. ఈ కృషి మిశ్రమ ఫలితాలను మాత్రమే ఇచ్చింది. సిక్కింలో ఒక్క కరోనా కేసు లేకపోగా మహారాష్ట్రలో వేలాది కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసులలో 35 శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరుతెన్నులు నిర్దిష్టంగా తెలియడం లేదు. పలు అజ్ఞాత కారణాలు కూడా కరోనా వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.


అయితే మహమ్మారి ఆర్థిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో పలు దేశాలను అనుసరించిన మార్గాన్ని అనుసరించేందుకు ప్రధాని మోదీ తిరస్కరిస్తున్నారు! దాదాపుగా ప్రతి ఆర్థిక వేత్తా సూచిస్తున్న మార్గం ద్రవ్య ఉద్దీపన. దీని అర్థం ఒక్కటే: మరింతగా ఖర్చు పెట్టడం. 2020-–21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో వ్యయాల అంచనా రూ.30,42,230 కోట్లు. ఈ భారీ వ్యయం ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని అరికడుతుందా అనేది చర్చనీయాంశమే. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత సంక్షోభం నుంచి అది ఎట్టి పరిస్థితులలోను గట్టెక్కించలేదనడంలో సందేహం లేదు.


మనకు ఒక కొత్త బడ్జెట్ అవసరం 2020 ఫిబ్రవరి1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు ఇంకెంత మాత్రం ఉపయుక్తమైనవి కావు. 2020 జూన్ 1న ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తీరాలి. మొత్తం వ్యయం రూ.40,00,000 కోట్లుగా ఉండాలి. వివిధ ఆదాయ వనరులు (పన్ను, పన్నేతర, పెట్టుబడి వసూళ్ళు) ప్రస్తుతం రూ.18,00,000 కోట్లు మాత్రమే సమకూరుస్తాయి. మిగతా సొమ్మును మనం రుణాల రూపేణా సమకూర్చుకోవాలి. ఈ మేరకు మనం తీసుకోవాల్సిన అప్పులు రూ.7,96,337 కోట్ల నుంచి రూ.22,00,000 కోట్లకు పెరుగుతాయి.


ఈ ఆర్థిక సంవత్సరం గడుస్తున్నకొద్దీ అప్పులూ, ద్రవ్యలోటూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి పెరగవచ్చు. అటువంటి పరిస్థితిలో ద్రవ్యలోటులో కొంత భాగాన్ని భర్తీచేసుకునేందుకు కరెన్సీ నోట్లను ముద్రించడం అనివార్యమవుతుంది. 2008/2009 సంవత్సరాలలో చాలా దేశాలూ ఇలానే చేశాయి. కరెన్సీ నోట్లను ముద్రించడం ద్వారా ద్రవ్యలోటును భర్తీచేసుకొని తమ ఆర్థిక వ్యవస్థలను సుదీర్ఘ మాం ద్యం బారిన పడకుండా కాపాడుకున్నాయి. మరి ఇందుకు ప్రత్యామ్నాయమున్నదా? ఈ విషయం గురించి ఆలోచించడానికే భయమేస్తుంది. ముమ్మరమయ్యే మాంద్యంతో నిరుద్యోగం మరింతగా పెరుగుతుంది (ఇది ఇప్పటికే 24 శాతం మేరకు ఉన్నది) జీవితంలోకి ప్రవేశించిన యువ జనులు ఉద్యోగం కోసం సుదీర్ఘకాల వేచివుండడం తప్పనిసరిఅవుతుంది. వేతనాలు, ఆదాయాలు తగ్గిపోతాయి. సహజంగానే వినియోగమూ తగ్గిపోతుంది. వ్యాధిగ్రస్తత పెరిగి పోతుంది. పేదరికం మరింతగా పెచ్చరిల్లిపోతుంది. 


2020 సంవత్సరంలో భారత్ పరిస్తితిని కళ్లకుగట్టుతున్న దృశ్యం వలస కార్మికుని దీనావస్థ. ఈ కష్టజీవి తన శ్రమతో, తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. దారిద్ర్యరేఖకు ఎగువన వున్న ఈ శ్రమజీవి కరోనా ప్రళయంతో ఒక్కసారిగా ఉద్యోగాన్ని/ ఉపాధిని కోల్పోయారు. కూడు కరువయి, గూడులేని పరిస్థితిలో వేలాది కిలో మీటర్ల దూరాన వున్న స్వస్థలానికి కాలినడకన బయలుదేరిన వైనం హృదయ విదారకమైనది. స్వస్థలానికి చేరిన తరువాత అతని పరిస్థితి ఏమిటి? అనిశ్చితమే కాదూ?


ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు మోదీ ప్రభుత్వానికి ఇంకా ఒక అవకాశమున్నది. ఇదే చివరి అవకాశం. ప్రభుత్వం తన ఉష్ట్రపక్షి తీరును త్యజించాలి. ప్రభుత్వ వినియోగాన్ని పెంచాలి. ప్రజల సంక్షేమానికి మరింత ఎక్కువగా ఖర్చుచేయాలి. ద్రవ్యలోటును భర్తీచేసుకునేందుకు కరెన్సీ నోట్లను ముద్రించాలి. లేనిపక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ పది సంత్సరాల వెనక్కు తిరోగమిస్తుంది. ఇదే జరిగితే మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితికి మోదీ సర్కారే కారణమన్న వాస్తవాన్ని జాతి ఎన్నటికీ మరచిపోదు.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Advertisement