Abn logo
Sep 25 2021 @ 00:29AM

జిహాద్ ఉన్మాదంపై ఉక్కుపాదం

లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్‌లను ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి విస్పష్టంగా ఖండించాలి. గుజరాత్‌లో 3000 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడంపై కూడా వారు ప్రతిస్పందించాలి. దేశ ఆంతరంగిక భద్రతకు, మన సమాజంలో మతసామరస్యానికి జిహాద్‌లు చాలా ప్రమాదకరమైనవిగా పరిణమిస్తాయనడంలో సందేహం లేదు.


కాలం మన స్మృతులలోకి ప్రవహిస్తుంది. మన జ్ఞాపకాలలో ఘనీభవించిన గతించిన యుగాలలోని కొన్ని సంఘటనలను, ముఖ్యంగా ‘క్రూసేడ్స్ ’ పేరిట యూరోపియన్లు చేసిన మతయుద్ధాలను ప్రస్తుత సందర్భంలో మనం గుర్తు చేసుకోవల్సిన అవసరముంది. ఇవి, క్రీ.శ. 11వ శతాబ్ది తుది దశకంలో ప్రారంభమయ్యాయి. క్రీ.శ.1095–1291 సంవత్సరాల మధ్య ఈ యుద్ధాలు జరిగినట్టు చరిత్రకారులు భావిస్తున్నారు. రోమన్ కేథలిక్ చర్చి మద్దతుతో యూరోపియన్ క్రైస్తవులు ఈ యుద్ధాలు చేశారు. లక్ష్యమేమిటి? ఇస్లాం వ్యాప్తిని నిలిపివేయడం; పాలస్తీనా, సిరియా, ఈజిప్ట్‌లను ఆక్రమించుకున్న ముస్లిం పాలకులను వెనక్కి తరిమికొట్టడం; తూర్పు మెడిటేరినియన్‌లోని పవిత్ర భూమిని మళ్ళీ సొంతం చేసుకోవడం. 


జీసస్ క్రీస్తు అనంతరం 1000 సంవత్సరాలకు, ప్రవక్త మహమ్మద్ అనంతరం 450 సంవత్సరాలకు ఈ మతయుద్ధాలు జరిగాయి. వారూ వీరూ ఏకేశ్వరోపాసకులే. అబ్రహం, మోజెస్‌లతో ప్రభావితులయినవారే. ముస్లింలలో వారిరువురూ ఇబ్రహిం, మూసాలుగా విఖ్యాతులు. జుడాయిజంతో పాటు ఈ మూడు మతాలూ అబ్రహామిక్ మతాలుగా సుప్రసిద్ధమయ్యాయి.


మరి ఈ ‘క్రూసేడ్స్’ ఎందుకు జరిగాయి? సహేతుకమైన కారణాలు ఉన్నాయని చెప్పలేము. ఆ పరస్పర హరణోద్యోగం నుంచి క్రైస్తవం, ఇస్లాం రెండూ బయటపడి నేటికీ వర్ధిల్లుతున్నాయి. ఆ రెండు మతాలను వందల కోట్ల ప్రజలు అనుసరిస్తున్నారు. వారిలో అత్యధికులు సహన స్వభావులు, శాంతి ప్రియులు. కొద్దిమంది మాత్రమే రణోత్సాహులు. యూరోప్‌లో క్రైస్తవమే ప్రధానమతం. ఏ ప్రాంతాల కోసమైతే ఆ మతయుద్ధాలు జరిగాయో అవి, అంటే పాలస్తీనా, సిరియా, ఈజిప్ట్ మొదలైన వాటిలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఏ మతమూ లేదా మత సమూహమూ మరో మతం లేదా మత సమూహాన్ని జయించలేదు. ఇదే ఆ మతయుద్ధాలు చాటిన సత్యమూ, మనం నేర్చుకోవల్సిన పాఠమూ. 


ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన పదం జిహాద్. ఇస్లాంలో జిహాద్ అంటే ఒక విశిష్ట పోరాటం లేదా ప్రశంసాయోగ్యమైన ప్రయత్నం. మంచిని పెంచి, చెడును నిర్మూలించేందుకు జరిగే పోరాటం లేదా ప్రయత్నమే జిహాద్ అని ‘బ్రిటానికా’ వివరించింది. అయితే ఆధునిక యుగంలో అది హింసాత్మక ఘర్షణలకు పర్యాయపదంగా పరిణమించింది. 


యువతీయువకులను బెదరగొట్టేందుకు హిందూ మితవాదులు ‘లవ్ జిహాద్’అనే జుగుప్సాకర ఆందోళనను ప్రారంభించారు. నార్కోటిక్ జిహాద్ అనేది మరో భయంకర సృష్టి. బిషప్ జోసెఫ్ కల్లరంగట్టు ఈ కొత్త జిహాద్‌ను ప్రారంభించడం నన్ను, కోట్లాది భారతీయులను కలవరపరుస్తోంది. ‘లవ్’, ‘నార్కోటిక్’ అనేవి వాస్తవాలు. అయితే లవ్ (ఒక సహజ మానవోద్వేగం)కు, నార్కోటిక్ (మాదక ద్రవ్యం)కు జిహాద్‌ను కలపడం వక్రగతి పట్టిన ఆలోచనలకు ఒక నిండు తార్కాణం. 


ఈ జిహాద్‌ల ఉద్దేశం స్పష్టమే. హిందూ లేదా క్రైస్తవ మత అనుయాయులు, ఇస్లాం అనుయాయుల మధ్య పరస్పర అపనమ్మకాలను, ద్వేషభావాలను రెచ్చగొట్టడమే ఆ జిహాద్‌ల లక్ష్యం. ఈ మతోన్మాదులకు ఇస్లాం అన్య మతం. ఆ మతానుయాయులు ఇతర మతస్థులు. లౌకికవాదానికి నిబద్ధమైన దేశం ఏదైనా సరే ఇటువంటి మతోన్మాదాన్ని మొగ్గదశలోనే సమూలంగా మట్టుబెట్టాలి. మానవత నిర్దేశిస్తున్న కర్తవ్యమిది. 


భారతదేశంలో ఇస్లాం విస్తరిస్తుందనడానికి రుజువులు లేవు. ముస్లిం జనాభా పెరుగుతుందనే విషయమై ప్రజల్లో ఉన్న తప్పుడు భావనలు, దరభిప్రాయాలు వాస్తవ విరుద్ధాలని గత జూన్‌లో ప్రచురితమైన ప్యూ సర్వే నివేదిక స్పష్టం చేసింది. 1951–2011 సంవత్సరాల మధ్య మతాలవారీగా భారత జనాభా ఇంచుమించు నిలకడగా ఉంది. వలసలు, ముస్లింలలో ప్రజనన రేట్ మూలంగా ముస్లింల నిష్పత్తి స్వల్పంగా పెరిగింది. అయితే ముస్లింలలో ప్రజనన 1992లో 4.4శాతం నుంచి 2015లో 2.6 శాతానికి తగ్గిపోయింది. హిందువులు, ఇతర మతస్థులలోని ప్రజనన రేటు కంటే అది స్వల్పంగా అధికం. అయినప్పటికీ 2050 సంవత్సరం నాటికి దేశ జనాభాలో హిందువులు 77శాతంగా ఉంటారని అంచనా.  


ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిగా నా అనుభవాలను చెప్పి తీరాలి. క్రైస్తవ మిషనరీలు నిర్వహిస్తున్న పాఠశాలలో నేను చదివాను. ఆ బడిలో అత్యధికులు హిందువులే. హిందూ సమాజంలోని అన్ని వర్గాలకు చెందినవారూ ఉండేవారు. కైస్తవుల సంఖ్య తక్కువగా ఉండేది. ముస్లింలు మరీ తక్కువగా ఉండేవారు. ప్రతి క్లాస్‌ను పలు సెక్షన్లుగా విభజించేవారు. ప్రతిక్లాస్‌కు ఒక లీడర్ ఉండేవాడు. ప్రధానోపాధ్యాయుడు కురివిల్ల జాకబ్ ఆ లీడర్‌ను ఎంపిక చేసేవారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మా క్లాస్ లీడర్ ఎ.కె.మూసా. సదా నవ్వుతూ తుళ్లుతూ, స్నేహపూరితంగా ఉండేవాడు. అయితే సగటు విద్యార్థి. 11వ తరగతిలో క్లాస్ లీడరే పాఠశాల విద్యార్థుల నాయకుడు అయ్యేవాడు. ఆకర్షణీయంగా కనిపిస్తూ ఆంగ్లాన్ని ధారాళంగా మాట్లాడగల విద్యార్థినే స్కూల్ లీడర్‌గా నియమించేందుకు మా హెడ్ మాస్టర్ మొగ్గు చూపారు. జాకబ్ సార్ ఎవరిని ఎంపిక చేశాడనుకున్నారు? మూసాను కాదు, హరూన్ మహమ్మద్ అనే విద్యార్థిని. అయితే మేమెవరమూ ముఖ్యంగా హిందూ, క్రైస్తవ మతాలకు చెందినవాళ్ళం ఈ ఎంపిక పై ఎలాంటి మనస్తాపం చెందలేదు. మా ప్రధానోపాధ్యాయునికి దురుద్దేశాలు అంటగట్టడమనేది కలలో కూడా చేయలేదు. 


సరే, ముఖ్యమంత్రి పినరయి విజయన్ బిషప్ కల్లరంగట్టు కు అల్లర్ల నిరోధక చట్టాన్ని చదివి వినిపించినందుకు నేను సంతోషపడుతున్నాను. ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ ముఖ్యమంత్రిని సమర్థిస్తూ, తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని గట్టిగా కోరడం పట్ల నేను మరింతగా సంతసించాను. ఇటీవల 3000 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌లోని ఒక నౌకాశ్రయం ద్వారా దిగుమతి చేయడానికి ప్రయత్నిస్తుండగా అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అధికార వ్యవస్థలో అత్యున్నతస్థాయి బాధ్యుల అండ లేకుండా ఎవరైనా సరే అంత భారీ పరిమాణంలో హెరాయిన్‌ను దిగుమతి చేసుకోవడం అసాధ్యం. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది గనుక నేను ఈ విషయాన్ని సాధికారంగా చెప్పగలను. నార్కోటిక్ జిహాద్ గురించి వేళాకోళంగా మాట్లాడుతున్నవారు ఈ విషయమై ఆలోచించవలసిన అవసరముంది.


లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్‌లను ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి విస్పష్టంగా ఖండించాలి. గుజరాత్‌లో 3000 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడంపై కూడా వారు ప్రతిస్పందించాలి. ఈ జిహాద్‌లు చాలా తీవ్ర విషయాలు. దేశ ఆంతరంగిక భద్రతకు, మన సమాజంలో మతసామరస్యానికి అవి చాలా ప్రమాదకరమైనవిగా పరిణమిస్తాయనడంలో సందేహం లేదు.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)