మండిపోతున్న చికెన్ ధరలు-కిలో రూ.280కి చేరిక

ABN , First Publish Date - 2022-03-18T22:15:48+05:30 IST

గత కొంత కాలంగా అన్ని వర్గాల నాన్ వెజ్ వినియోగ దారులకు అందుబాటులో వున్న చికెన్ ధరలు ఇప్పుడు ఆకాశానికి ఎగబాకుతున్నాయి

మండిపోతున్న చికెన్ ధరలు-కిలో రూ.280కి చేరిక

హైదరాబాద్: గత కొంత కాలంగా అన్ని వర్గాల నాన్ వెజ్ వినియోగ దారులకు అందుబాటులో వున్న చికెన్ ధరలు ఇప్పుడు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. గత రెండు వారాలుగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగలు కానీ, ఇతర ప్రత్యేక సందర్భాల్లో సామాన్య నాన్ వెజ్ ప్రియులు తప్పని సరిగా కొనుగోలు చేసేది చికెనే. కానీ ఇప్పుడు వాటి ధరలుకూడా అందనంత ఎత్తుకు పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం చికెన్ ధరలు రిటైల్ మార్కెట్ లో కిలో 200 నుంచి 220 రూపాయలు పలికింది. తర్వాత తర్వాత పెరుగుతూ ప్రస్తుతం కిలో 280 రూపాయలకు చేరింది. నాన్ వెజ్ ప్రియులు అధికశాతం మంది మొదటి ప్రాధాన్యత చికెన్ కే ఇస్తుంటారు. ధర తక్కువ కావడమే దీనికికారణం. కానీ ఇప్పుడు ధరలు పెరగడానికి ప్రధాన కారణం వేసవి ఎండలు పెరగడమేనని వ్యాపారులు చెబుతున్నారు. ముందు ముందు ఎండలు మరింత ముదిరితే చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం వుందని అంటున్నారు. 


వేసవి ఎండలకు తట్టుకోలేక కోళ్ల ఫారాల్లో కోళ్లు ఎక్కువగా చనిపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. అందుకే మార్కెట్ కు కోళ్ల సరఫరా తగ్గుతున్నట్టు వారు తెలిపారు.రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చికెన్ లో 80 శాతం వినియోగం హైదరాబాద్ నగరంలోనే జరుగుతున్న హయత్ నగర్ లోని పౌల్ట్రీ ఫారం నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో గత కొంత కాలం క్రితం వరకూ రోజుకు లక్షకేజీల చికెన్ వినియోగం కాగా ప్రస్తుతం 1.5లక్షల కేజీలు వినియోగం అవుతున్నట్టు తెలిపారు. పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో డిమాండ్ కు అనుగుణంగా కోళ్ల సరఫరా కావడం లేదని అందుకే ధరలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. మాంసానికి ప్రత్యామ్నాయంగా అధికశాతం మంది చికెన్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు దీని ధర కూడా రోజు రోజుకూ పెరుగుతుండడంతో నాన్ వెజ్ ప్రియలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-03-18T22:15:48+05:30 IST