మార్కెట్‌లో చికెన్‌ ధరకు రెక్కలు.. కిలో ఎంతంటే...!

ABN , First Publish Date - 2021-07-31T06:44:32+05:30 IST

మార్కెట్‌లో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. మూడు వారాల వ్యవధిలో...

మార్కెట్‌లో చికెన్‌ ధరకు రెక్కలు.. కిలో ఎంతంటే...!

  • మూడు వారాల్లో రూ.100 పెరుగుదల
  •  కిలో రూ.300కి చేరిన వైనం

మండపేట, జూలై 30: మార్కెట్‌లో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. మూడు వారాల వ్యవధిలో చికెన్‌ ధరలు రూ.100 వరకు పెరిగింది. ప్రస్తుతం రూ.300కి చేరింది. ధర పెరుగుదలతో చికెన్‌ వినియోగం తగ్గింది. వర్షాకాలం ప్రారంభంకావ డంతోపాటు కొవిడ్‌ నేపథ్యంలో చికెన్‌ తినడం తొలుత మంచిదని వైద్యులు చెప్పడంతో వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో బాయిలర్‌ కోళ్ల లభ్యత తగ్గడంతో ఇప్పుడు చికెన్‌ ధరలు పెరిగాయి. బాయిలర్‌ కోళ్లకు అధిక ఆహారం ఇవ్వడం ద్వారా సకాలంలో బరువు పెరుగుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కోళ్లదాణా ధరలు కూడా భారీగా పెరిగాయి. మొక్కజొన్న ధర రూ.18 వేల నుంచి 22వేలకి చేరింది. సోయాబిన్‌ టన్ను ధర రూ.32 వేల నుంచి రూ.62 వేల వరకు చేరింది.  ముడిసరుకు ధరలు పెరగడంతో కోళ్ల దాణా ధర కూడా టన్ను రూ.32 వేల నుంచి రూ.42 వేలకు పెరిగిందని రైతులు చెబుతున్నారు.


50రోజుల వ్యవధిలో కోడిబరువు పెరగాలంటే నాలుగు కిలోల వరకు మేత అవసరం అవుతుంది. దీంతో కోళ్ల పెంపకానికి పెట్టుబడులు పెరిగాయని, దాంతోనే ధర పెరుగుదల ఉందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం మన జిల్లాలో కూడా బాయిలర్‌ కోళ్ల నిల్వలు లేకపోవడంతో ఇక్కడకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. దీంతో రవాణా చార్జీల ప్రభావమూ పడుతోంది. గతేడాది కొవిడ్‌ ప్రారంభంలో కిలో చికెన్‌ ధర రూ.60 నుంచి 100 వరకు ఉండగా, అదే చికెన్‌ ఇప్పుడు రెండొందలకు చేరుకుని నెల వ్యవధిలో ఇప్పుడు రూ.300కి చేరింది. అలాగే లేయర్‌కోడి ధర కొవిడ్‌ ప్రారంభంలో రూ.20, ఇప్పుడు రూ.150కి చేరింది.

Updated Date - 2021-07-31T06:44:32+05:30 IST